ఏప్రియల్ నెలాఖరులో విడుదల కావాల్సి వుంది రజనీ కాంత్ కాలా సినిమా. ఆ సినిమాకు భయపడే మన సినిమాలు అన్నీ అటు ఇటు చెల్లా చెదురుగా మారాయి. భరత్ అనే నేను ఒక వారం ముందుకు వచ్చింది. నా పేరు సూర్య ఓ వారం వెనక్కు వెళ్లింది. కానీ అంతలోనే తూచ్.. కాలా రావడం లేదు అని వార్తలు వచ్చాయి. సరే చేసేది లేక, ఎలా ఫిక్సయిన వాళ్లు అలాగే వుండిపోయారు.
అయితే ఇప్పుడు కాలా సినిమా రెడీ అయిపోయింది. యుఎ సర్టిఫికెట్ వచ్చేసింది. 27న విడుదలకు రెడీ అని వార్తలు వినవస్తున్నాయి. అలా అయితే మన సినిమాలకు కాస్త కష్టమే. రజనీ సినిమా బాగా లేకుంటే ఏమో కానీ, బాగుంటే తెలుగునాట కూడా బాగానే కుమ్ముతుంది.
అయితే 27న విడుదల కష్టమని, తమిళనాట సమ్మె కారణంగా చాలా సినిమాలు నిలిచిపోయాయని, అవి క్యూలో వున్నాయని, వాటిని కాదని రజనీ తన సినిమాను ముందుకు తెస్తే అక్కడ కాస్త పరిణామాలు వేరుగా వుంటాయని వినిపిస్తోంది. మన టాలీవుడ్ లా కాదు తమిళనాట. పెద్ద హీరో అని పరిశ్రమ సాగిలపడిపోదు.. పద్దతులు, రూల్స్ కాస్త గట్టిగానే పట్టుకుంటారు. అందునా ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఇలాంటపుడు అనవసరంగా కెలుక్కుంటారా? అన్నది అనుమానం.
అందుకే జూన్ 12నకు కాలా విడుదల వుంటుందని చెన్నయ్ వర్గాల బోగట్టా. అదే పక్కా అయితే అప్పటికి షెడ్యూలు చేసుకున్న సవ్యసాచి, లవర్, సమ్మోహనం లాంటి సినిమాల డేట్ లు మారాల్సి వుంటుంది. లేదు ఈనెల 27కే కాలా వచ్చేస్తే, ఏ గొడవా లేదు కానీ, మహానటి, నాపేరు సూర్య లాంటి వాటి మీద ఎఫెక్ట్ కొంత వుంటుంది.