భరత్ కోసం కొరటాలకు 28కోట్లు?

కొరటాల శివ మంచి దర్శకుడు అందులో సందేహం లేదు. అయితే కేవలం దర్శకుడే కాకుండా మంచి బిజినెస్ మెన్ కూడా. ఆయనకు మాంచి బయ్యర్ సర్కిల్ వుంది. ఆయన సినిమాలు అన్నీ వాళ్లకే ఇవ్వడం…

కొరటాల శివ మంచి దర్శకుడు అందులో సందేహం లేదు. అయితే కేవలం దర్శకుడే కాకుండా మంచి బిజినెస్ మెన్ కూడా. ఆయనకు మాంచి బయ్యర్ సర్కిల్ వుంది. ఆయన సినిమాలు అన్నీ వాళ్లకే ఇవ్వడం అన్నది కామన్ గా జరుగుతూ వుంటుంది. అయితే అజ్ఞాతవాసి తరువాత బయ్యర్లు కుదేలయిపోవడమే కాదు, భయపడిపోయారు. దాంతో భరత్ అనే నేనుకు రేటు రాలేదు. అప్పుడు కొరటాలనే రంగంలోకి దిగారు.

తనను నమ్మి తీసుకోమని, తేడా వస్తే, తన తరువాతి సినిమాకు సర్దుబాటు చేసే పూచీ తనదని హామీలు ఇచ్చారు. దీంతో కొరటాలను నమ్మి, ఆయన టీమ్ బయ్యర్లంతా, చెప్పిన రేటుకే భరత్ అనే నేను సినిమాను తీసుకున్నారు. అడ్వాన్స్ మీదనే ఆడిస్తాను, ఎంతకావాలన్నా అడ్వాన్స్ ఇస్తాను, కానీ కొనడం కష్టం అన్న నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నట్లు బోగట్టా. రేటును కాస్త అటు ఇటు చేసి, తీసుకునే విధంగా ఇటీవలే చర్చలు ఫలప్రదమయ్యాయి.

కేవలం దర్శకత్వం కాకుండా ఇంతలా కొరటాల శివ బిజినెస్ కూడా పట్టించుకోవడం వెనుక చాలా విషయాలు వున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయట. రెమ్యూనిరేషన్ మాత్రమే కాకుండా, సినిమా ప్రాఫిట్ లో షేర్ వుందని తెలుస్తోంది. ప్రాఫిట్ లో తొలి పదికోట్లు నిర్మాతకు, తరువాత 8కోట్లు కొరటాల శివకు అనే విధంగా ఓ ఒప్పందం వుందని వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాకు మంచి అమ్మకాలు తెప్పించి, టేబుల్ ప్రాఫిట్ రప్పిస్తే, రెమ్యూనిరేషన్ తో పాటు మరో ఎనిమిదికోట్లు అదనంగా వస్తాయి. అంటే రెమ్యూనిరేషన్ 20కి ఇది అదనం అనుకోవాలి.

అదే సమయంలో సినిమాను నిలబెట్టడం, ఓపెనింగ్స్ తేవడం అన్నది కొరటాల మీదే వుంది. అందుకే ఆయనే ప్రమోషన్ మొత్తం ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాకు మరో ఇద్దరు టాప్ స్టార్ లను, అది కూడా అభిమానులు కౌంటర్ పార్ట్ గా ఫీలయ్యే వాళ్లను పిలవడం అంటే కొరటాల ప్లానింగ్ అనే అనుకోవాలి.

అందుకే వస్తున్నాడంట ఎన్టీఆర్

లుక్ రివీల్ అయిపోతుంది. అందుకే అన్న కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ కు రాలేదు ఎన్టీఆర్ అన్నారు మొన్నటికి మొన్న ఎమ్మెల్యే సినిమా విషయంలో. మరి ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు ఎలా వస్తున్నాడో? అన్న క్వశ్చన్లు వినిపించడం ప్రారంభమైంది. కొరటాల శివ మాట కొట్టేయలేకనా? మహేష్ స్వయంగా ఫోన్ చేసాడనా?  రెండూ కరెక్టే కానీ అవి మాత్రమే కాదట.

ఐపిఎల్ తెలుగు ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కొన్ని ప్రోమోలు షూట్ చేసాడు. అవి రేపటి నుంచి టెలికాస్ట్ కావడం ప్రారంభమవుతుంది. అంటే లుక్ రివీల్ అయిపోతుంది ఆ విధంగా. మరింక దాచి ప్రయోజనం ఏముంది? అందుకే మహేష్ పిలవగానే ఓకె చెప్పేసాడట. పైగా కొరటాల శివతో స్నేహం వుండనే వుంది.

స్ట్రాటజీగా వెళ్తున్నారా?

మొత్తం మీద భరత్ అనే నేనుకు మాంచి బజ్ రప్పించారు. దానికి తగినట్లు ఓపెనింగ్స్ వస్తాయి. ఓవర్ సీస్ లో మహేష్ ఇప్పడు మళ్లీ ప్రూవ్ చేసుకోవాలి. అయితే కొరటాల బ్రాండ్ నేమ్ వుంది కాబట్టి, భయం అవసరం లేదు. అయితే కంటెంట్ నే ఫైనల్ గా ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటికి వదిలిన రెండు పాటలు అయితే మాస్ లోకి వెళ్లలేదు. ట్విట్టర్, యూట్యూబ్ హిట్ లు కాదు కొలమానం. జనాల్లోకి వెళ్లాలి. ఇప్పటికే అభిమానులు మంచి మాస్ నెంబర్ వదలండి అంటూ ట్విట్టర్ లోనే పోస్ట్ లు పెడుతున్నారు. అసలు పాటలు ఇంకా వుండే వుంటాయి. అయితే అవి బయటకు రావాలి.

సినిమాలో లవ్ స్టోరీ ఎక్కువగానే వుంటుందని టాక్ వినిపిస్తున్నా, ప్రస్తుతానికి అయితే వాగ్దానాలు, కర్తవ్యాలు, అంతశోధన వంటి వాటితో ఓ సీరియస్ సినిమా లుక్ ఇస్తున్నారు. ఇదంతా కావాలనే చేస్తున్నారని తెలుస్తోంది. పోలిటికల్ టచ్ ముందుగా ఇచ్చి లవ్ స్టోరీ చూపిస్తే వేరుగా వుంటుంది. లవ్ స్టోరీ అని చెప్పి, పోలిటికల్ టచ్ వుండే వేరుగా వుంటుంది అని, భావించి, ఇలా రివర్స్ లో వెళ్తున్నారని తెలుస్తోంది.

మొత్తం మీద రంగస్థలం హిట్ తరువాత అందరి దృష్టి భరత్ అనే నేను మీద పడింది. దాంతో పాటే భరత్ కు బాధ్యతా పెరిగింది.