ట్విట్టర్ లో పెట్టేయ్.. ట్విట్టర్ లో పెట్టేయ్

సినిమాకు ప్రచారం అన్నది ఓ కీలక విషయం. దీనికి ఎవరి ప్లానింగ్ వారికి వుంటుంది. సాధారణంగా తెలుగు సినిమాలకు విడుదలకు నెల రోజుల ముందు నుంచి వివిధరకాల ప్రచారం సాగిస్తారు. అయితే రాను రాను…

సినిమాకు ప్రచారం అన్నది ఓ కీలక విషయం. దీనికి ఎవరి ప్లానింగ్ వారికి వుంటుంది. సాధారణంగా తెలుగు సినిమాలకు విడుదలకు నెల రోజుల ముందు నుంచి వివిధరకాల ప్రచారం సాగిస్తారు. అయితే రాను రాను పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు ప్రచారం అంటే కేవలం ట్విట్టర్ నే నమ్ముకుంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పెద్ద సినిమాల ప్రచారం అంతా డైరక్టర్ల గుప్పిట్లో బిగుసుకుపోతోంది. డైరక్టర్ లు చివరి నిమిషం వరకు చెక్కుళ్లు చెక్కుకుంటూ కూర్చుంటున్నారు. యంగ్ హీరోలకు ట్విట్టర్ లో ట్రెండింగ్ అయితే చాలు. దాంతో బేసిక్ పబ్లిసిటీ మిస్సవుతోంది.

మొన్నటికి మొన్న అజ్ఞాతవాసి సినిమాకు ఇదే జరిగింది. పబ్లిసిటీ ఏం చేయాలి? అన్న దాంట్లో నిర్మాతకు స్వేచ్చ లేదు. పవన్ ఇంటర్వూలు లేవు. మీడియా మీట్ లు లేవు. త్రివిక్రమ్ మీడియా ముందుకు రారు. అనిరుధ్, ఇద్దరు హీరోయిన్లు వున్నా వాడుకోరు.. అదీ పరిస్థితి.

ఇక రంగస్థలం పరిస్థితీ డిటో డిటో మాదిరిగా కనిపిస్తోంది. హీరో రామ్ చరణ్, 'ఎంపిక చేసిన' ఆ నాలుగయిదు దినపత్రికలకు ఇంటర్వూలు ఇచ్చారు. అలాగే ఎంపిక చేసిన మరో రెండు ఛానెళ్లకు ఇంటర్వూలు ఇచ్చారు. అంతే ప్రచారం అయిపోయింది. మిగిలిన ఛానెళ్లను పక్కన పెట్టారు. మిగిలిన దినపత్రికలను పక్కన పెట్టారు. ఇటీవల మొబైళ్లలో జనం ఎక్కువగా ఫాలో అవుతున్న మాధ్యమం అయిన వెబ్ మీడియా ఊసే లేదు. ఇక యూట్యూబ్ చానెళ్లు సరేసరి.

పోనీ హీరో కదా అనుకుంటే, దర్శకుడు సుకుమార్ ఓ దినపత్రికతో మాట్లాడి, ప్రచారం అయిపోయింది అనిపించేసుకున్నారు. సినిమాకు భారీ తారాగణం, సాంకేతిక సిబ్బంది వున్నారు. కానీ వాళ్లెవరు మీడియా ముందుకు రానే లేదు.

రత్నవేలు, ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ, హీరోయిన్ సమంత, మ్యూజిక్ డైరక్టర్ దేవీ, రచయిత చంద్రబోస్, వీళ్లవెరని మీడియా ముందకు తీసుకురానే లేదు. ఎంత సేపూ ట్వీట్ లు పడ్డాయా లేదా? యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోందా? లేదా?

సరే, అయితే ఏమయింది? సినిమాకు బజ్ రాలేదా? సూపర్ బజ్ వచ్చింది. కదా. అది చాలదా? అని అనేయచ్చు. అదీ నిజమే. కానీ ఇక్కడో సమస్య వుంది. సినిమా సూపర్ హిట్, యునానిమస్ టాక్ వస్తే ఓకె. సాగిపోతుంది వ్యవహారం. కానీ కాస్త డివైడ్ టాక్ నో, ఏవరేజ్ టాక్ నో వస్తేనే పెద్ద సినిమాలకు సమస్య వస్తోంది.

ఇలాంటి ఏవరేజ్ లేదా డివైడ్ టాక్ సినిమాలకు విడుదల తరువాత కావాల్సింది మళ్లీ మీడియా సహకారమే. కానీ విడుదల ముందు 'ఆ నలుగురు' తప్ప మిగిలిన వారు అక్కర్లేదని టోటల్ ప్రింట్ మీడియాను, 'ఆ ఇద్దరు' తప్ప మిగిలిన చానెళ్లు వద్దు అని విజువల్ మీడియాను, అసలు వెబ్ మీడియా అక్కరేలేదని పక్కన పెట్టేయడటంతో, విడుదల తరువాత మాత్రం తామెందుకు అని సైలెంట్ అవుతున్నారు. అజ్ఞాతవాసి సినిమాకు జరిగింది ఇదే.

పోనీ సినిమా విడుదలయిపోయిన తరువాత ఏమయినా సాయం చేస్తారా? హీరోలు డైరక్టర్ లు అంటే అదీ లేదు. అజ్ఞాతవాసి ఫలితం నెగిటివ్ కాగానే త్రివిక్రమ్ ఎక్కడున్నారో తెలియదు. పవన్ ఏం చేస్తున్నారో తెలియదు. పోనీ ఏదో ఒకటి మీడియా ముందు మాట్లాడి, సినిమాను నిలబెట్టడానికి ట్రయ్ చేద్దాం అన్న థ్యాసే వుండదు. ఈ విషయంలో నిఖిల్ లాంటి మీడియం హీరోలే బెటర్. కిందా మీదా పడి తమ సినిమాలను నిలబెట్టుకుంటున్నారు.

ఈ సంగతులు అన్నీ నిర్మాతలకు తెలియవా అంటే తెలియక కాదు. కానీ డైరక్టర్లను, హీరోలను కాదని, స్వంతంగా ఏమీ చేయలేని పరిస్థితి. సినిమా ఒప్పుకున్నపుడే హీరోలు, డైరక్టర్లు పబ్లిసిటీని తమ చేతుల్లోకి తీసేసుకుంటున్న రోజులు ఇవి. ఆ విధంగా ఓకె అన్న తరువాతే సినిమా నిర్మాణం ప్రారంభం అవుతోంది. ఇంక డబ్బులు పెట్టుబడి పెట్టడం మినహా నిర్మాతలు ఏం చేస్తారు?