మొహం చాటేసిన త్రివిక్రమ్?

సాగినంత కాలం తమంత వారు లేరందురు. సాగకపోతే ఊరక చతికల పడిపోవుదురు అన్న లైన్ గుర్తుకు వస్తుంది సినిమా ఇండస్ట్రీలో కొందరిని చూస్తే. నిర్మాతను శాసించి, సినిమా ప్రచారాన్ని శాసించి, తన చిత్తానికి వ్యహరించి,…

సాగినంత కాలం తమంత వారు లేరందురు. సాగకపోతే ఊరక చతికల పడిపోవుదురు అన్న లైన్ గుర్తుకు వస్తుంది సినిమా ఇండస్ట్రీలో కొందరిని చూస్తే. నిర్మాతను శాసించి, సినిమా ప్రచారాన్ని శాసించి, తన చిత్తానికి వ్యహరించి, సినిమా చేసే స్టేజ్ కు ఎదిగారు దర్శకుడు త్రివిక్రమ్. ఎక్కడెక్కడి నుంచో సీన్లు ఎత్తేస్తూ, ఆఖరికి మీనా సినిమానే హక్కులున్న వాళ్లకు చెప్పకుండా ఎత్తేసే రేంజ్ కు ఎదిగారు. ఆఖరికి చివరి నిమిషంలో డబ్బులు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకున్నట్లు బోగట్టా. అజ్ఞాతవాసి సినిమా కోసం హాలీవుడ్ చిత్రాన్నే లేపేసారు. అదంతా ఓ గొడవ.

ఇలాంటి టైమ్ లో అజ్ఞాతవాసి లాంటి ఘోర పరాజయం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అమాంతం కిందకు లాగి నేల మీద నిల్లో పెట్టింది. అప్పటి వరకు ఎక్కడ చూసినా, పవన్ కళ్యాణ్ పక్కన్నేను అన్నట్లు వుండేవి స్టిల్స్. అజ్ఞాతవాసి తరువాత పవన్ తో కలిసిన త్రివిక్రమ్ ఎవరికీ కనిపించలేదు.

లేటెస్ట్ గా త్రివిక్రమ్-పవన్ నిర్మాణ భాగస్వాములుగా, త్రివిక్రమ్ కథతో నిర్మాణమైన ఛల్ మోహన్ రంగ సినిమా ఆడియో ఫంక్షన్ ఈరోజు జరిగింది. ఈ ఫంక్షన్ కు త్రివిక్రమ్-పవన్ ఇద్దరూ హాజరవుతారని ప్రచారం జరిగింది. పైగా దర్శకుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం త్రివిక్రమ్ క్యాంప్ లో వున్నారు. త్రివిక్రమ్ గీసిన గీతకు లోపలే వుంటున్నారని టాక్. కృష్ణ చైతన్య ఏ సినిమాలు చేయాలి? ఏ బ్యానర్ కు చేయాలి? అన్నిది కూడా త్రివిక్రమ్ నే డిసైడ్ చేస్తున్నారని టాక్ వుంది.

అలాంటి శిష్యుడి సినిమా, తన కథతో తయారైన సినిమా, తన నిర్మాణ భాగస్వామ్యంతో వస్తున్న సినిమా ఆడియో ఫంక్షన్ కు డుమ్మా కోట్టేసారు త్రివిక్రమ్. పవన్ వచ్చే సినిమా ఫంక్షన్లకు త్రివిక్రమ్ కూడా రావడం అన్నది చాలా కాలంగా టాలీవుడ్ లో కామన్. అలాంటిది పవన్ తో కలిసి రావాల్సిన ఫంక్షన్ కు త్రివిక్రమ్ రాలేదు. అదీ చిత్రం.

తివిక్రమ్ రాకపోవడంతో పవన్ ను సరిగ్గా పొగిడేవారే లేకపోయారు ఫంక్షన్ లో. అదే త్రివిక్రమ్ అయితే దేవుడు, ఇలా అలా అంటూ ఓరేంజ్ లో లేపేవారు. ఈ సభలో పవన్ ను అలా లేపేవారే లేకపోయారు. దాంతో పాపం, ఆయన కూడా ముక్తసరిగా, డిప్లమాటిక్ గా రెండుమాటలు మాట్లాడి వెళ్లిపోయారు.

పాపం త్రివిక్రమ్.. మళ్లీ హిట్ కొడితే తప్ప, జనం ముందుకు రారేమో? ఎన్టీఆర్ సినిమాతో ఆ కోరిక నెరవేరుతుందేమో చూడాలి. అయినా విజయాలు జనానికి దగ్గర చేయాలి. అలా అని అపజయాలు దూరం చేయకూడదు.

ఛల్ మోహన్ రంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి