ఆ’పరేషాన్’ మాజీ-ఓ డిజాస్టర్

హిట్ కొట్టాలని తాపత్రయం. హిట్ కొట్టి లైమ్ లైట్ లోకి రావాలన్న తపన. ఇది అవసరమే. కానీ కాస్త నిజాయతీ, టాలెంట్ వుండాలి. దేనికైనా. అబద్దం ఆడిన గోడకట్టినట్లు వుండాలన్నారు. దొంగతనం కూడా అంత…

హిట్ కొట్టాలని తాపత్రయం. హిట్ కొట్టి లైమ్ లైట్ లోకి రావాలన్న తపన. ఇది అవసరమే. కానీ కాస్త నిజాయతీ, టాలెంట్ వుండాలి. దేనికైనా. అబద్దం ఆడిన గోడకట్టినట్లు వుండాలన్నారు. దొంగతనం కూడా అంత వీజీ కాదు. కానీ ఏం చేయాలి. అన్ని వైపుల నుంచి దాడి. కేంద్రం ఏం చేస్తుందో అన్న భయం, ప్రజలను మోసం చేయడానికి, అమాయకులను సోషల్ నెట్ వర్క్ లో ఏదో ఒకటి పోస్ట్ చేసి మభ్య పెట్టడానికి కంటెంట్ కావాలి.

అలా చేయాలంటే ఏదో ఒకటి రచించాలి. అర్జెంట్ గా స్క్రిప్ట్ తయారుచేసేయాలి. ఓకె అనిపించేసుకోవాలి. సినిమా జనాల్లో చాలా మందికి ఇదే వ్యవహారం. ఆయన కూడా పాపం సినిమా మనిషే. మంచోడే. అమాయకుడే. పాపం ఆయనకూ ఏమీ తెలియదు. తను వాళ్లకు కీలకమైన వ్యక్తి అనుకుంటున్నాడు.

కానీ వాళ్లే తనను వాడుకుంటున్నారని అతనికి తెలియదు. వాడుకుని పక్కన పెడతారని అంతకన్నా తెలియదు. వాళ్లేమో ‘ఆపరేషన్ మాజీ’ అని ఓ ప్లాన్ వేసారు. మాజీ సినిమా మనిషి కనుక ఆ పేరు పెట్టారు. ఆ మాజీ చేత, తాము తయారుచేయించిన స్క్రిప్ట్ టీజర్ ను ఉదయం వదిలి, సాయంత్రానికి సినిమా చూపించేసే ప్రయత్నం చేయించారు.

కానీ ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు. మార్నింగ్ షో పడిన పావుగంటకే ఫలితం చెప్పేసి, పెదవి విరిచేసి, మాట్నీకే సినిమాను వెనక్కు పంపేస్తున్నారు. పైగా సినిమా చూడగానే, అది హాలీవుడ్ నుంచి కొట్టుకు వచ్చిందో? బాలీవుడ్ నుంచి దొంగిలించుకు వచ్చిందో ఇట్టే చెప్పేస్తున్నారు. అందుకే ఈ ‘ఆపరేషన్ మాజీ’ స్క్రిప్ట్ మొత్తం ఎక్కడ పుట్టి వుంటుందో? ఎలా పుట్టి వుంటుందో? ఎందుకు పుట్టి వుంటుందో ఇట్టే కనిపెట్టేసారు.

ఇదంతా తెలుగుదేశం పార్టీ భయంలోంచి పుట్టిందని అర్థం అయిపోయింది. ఆ పార్టీని 2019 ఎన్నికల్లొ ఏం చేసైనా, ఎలాగైనా, అధికారంలోకి తీసుకురావాలన్న సామాజిక వర్గ తహ తహలోంచి ఇది పుట్టిందని జనాలకు అర్థం అయిపోయింది. ఆ సామాజిక వర్గ పత్రికలు ఈ స్రిప్ట్ ను నెత్తిన పెట్టుకుని, పెద్ద రాతలు రాసాయి కానీ, జనం మాత్రం సోషల్ నెట్ వర్క్ లో చీల్చి, చీల్చి చెండాడేసారు. దీని వెనుక వున్న సామాజిక కోణం మీద టార్చి లైట్ కాదు పెద్ద ఫ్లడ్ లైట్ నే వేసి చూపించేసారు.

దాంతో పాపం, అంత గంభీరంగా, హీరోకి సినిమా కథ చెప్పడానికి డైరక్టర్లు ఎంతలా కష్టపడతారో, అంతలా హావభావాలు చూపించి, ఆహార్యం సరిపోయేలా చూసుకుని, అంత కష్టపడినా, ఆపరేషన్ మాజీ ఫ్లాప్ అయిపోయింది. ఆపరేషన్ గరుడ స్క్రిప్ట్ ను జనం, చచ్చిఫోయిన బొద్దింక మీసాలు సుతారంగా పట్టుకుని, అలా తీసి పక్కన చెత్తలో పడేసిన రీతిలో పడేసారు.

మొత్తానికి ఆపరేషాన్ గరుడ.. పరేషాన్ లోంచి పుట్టి, పరేషాన్ లో పడిపోయింది.