వివేక్ కూడా ఎమ్మెల్యే బరిలోకేనా?

భారతీయ జనతా పార్టీకి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ.. ఎలాంటి హామీల ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావాలో నిర్దేశించాల్సిన స్థానంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ జీ వివేక్, హఠాత్తుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిపోయిన…

భారతీయ జనతా పార్టీకి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ.. ఎలాంటి హామీల ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావాలో నిర్దేశించాల్సిన స్థానంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ జీ వివేక్, హఠాత్తుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిపోయిన వైనం అందరికీ తెలుసు. సాధారణంగా ఎంపీ పదవిని కోరుకునే ఆయన వచ్చే ఎంపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఫిరాయించారని కొందరు ఊహించారు. వారి అంచనాలు తప్పని నిరూపిస్తూ ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ బరిలోనే ఉన్నారు.

చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ను సిపిఐకు కేటాయించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అప్పటికే.. చెన్నూరు కాంగ్రెస్ శ్రేణుల నుంచి అసంతృప్తి కూడా చాలా సహజంగా వ్యక్తమైంది. తర్వాతి పరిణామాల్లో అసలు కాంగ్రెసుతో వామపక్షాల పొత్తు అనేదే జరగని పని అని తేలిపోతున్నది. సీపీఎం ఇప్పటికే పొత్తు కాదనుకుని.. తాము పోటీచేయబోతున్న స్థానాలను కూడా ప్రకటించేసింది. సీపీఐ కూడా ఇంచుమించు అదేమాదిరి కసరత్తుతో.. తుదినిర్ణయం కేంద్ర కమిటీ అంటూ.. వారి హైకమాండ్ చేతుల్లో పెట్టింది.

అయితే స్థానికంగా వాతావరణాన్ని గమనిస్తే.. సీపీఐతో కూడా పొత్తులు తెగతెంపులు అయిపోయినట్టే భావిస్తూ కాంగ్రెస్ పార్టీ తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. చెన్నూరు స్థానానికి ఎవరిని బరిలోకి దించాలో, ఎవరెవరి అసంతృప్తులను బుజ్జగించాలో వారు కసరత్తు చేస్తున్నారు. 

చెన్నూరు నుంచి అధికార భారాస తరఫున బాల్క సుమన్ బరిలో ఉన్నారు. కాంగ్రెసు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే స్థానికంగా కూడా కొందరు ఇతర నాయకులు.. అసలు సీపీఐకు ఇవ్వనే వద్దని వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో  చెన్నూరు నుంచి కొత్తగా పార్టీలోకి ఫిరాయించిన జి వివేక్ ను బరిలోకి దించాలని కాంగ్రెస్ తలపోస్తున్నది. అదే జరిగితే.. అసమ్మతి రాగం వినిపించకుండా బుజ్జగింపుల కమిటీ సారథి నల్లాల ఓదెలును పిలిపించి మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. ఇతర నాయకులను కూడా బుజ్జగించి.. జివివేక్ కు ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. 

మొత్తానికి వివేక్ కూడా ఎమ్మెల్యే బరిలోకి దిగడానికే నిర్ణయించుకోవడాన్ని గమనిస్తే.. ఈ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యం అనే నమ్మకం కాంగ్రెసులో పుష్కలంగా ఉన్నదని, అందుకే సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారని పలువురు భావిస్తున్నారు.