తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి సినిమాలు, రాజకీయాలు రెడింటా ప్రవేశం ఈనాటిది కాదు. స్వయంగా కరుణానిధి సినిమా రచయిత. ద్రవిడ కళగం రాజకీయంలో ఉంటూ, సినీ రచయితగా తమ భావాలకు ప్రచారం కల్పించుకున్న వారిలో కరుణానిధి ముందుంటారు.
డీఎంకే ఏర్పాటు తర్వాత, తను రాజకీయాల్లో పదవులను అధిష్టించిన తరువాత కూడా కరుణానిధి సినిమాలను వదల్లేదు. అడపాదడపా రాస్తూనే వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే కరుణానిధి వృద్ధుడయ్యాకా కూడా సినిమాలకు కథలు, పాటలూ రాశారు.
ఇక ఒక తనయుడిని హీరోగా నిలబెట్టడానికి కూడా కరుణానిధి తీవ్రంగా ప్రయత్నించి, విఫలం అయ్యారు. అది వేరే కథ. ఇక కరుణ మరో తనయుడు, ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా సినిమా జనాలతో సన్నిహితంగా మెలిగిన వాడే. స్టాలిన్ తనయుడు కొన్నేళ్లుగా నటుడిగా చేస్తూ వస్తున్నాడు. హీరోగా పలు సినిమాల్లో చేశాడు. వాటిల్లో ఏవో కొన్ని మాత్రమే తమిళ జనాన్ని ఆకట్టుకున్నాయి.
కామెడీ బేస్డ్ గా తీసిన ఉదయనిధి స్టాలిన్ సినిమాలు తెలుగులోకి కూడా అనువాదం అయ్యాయి. వాటిల్లో ఒక్క సినిమానేమో తెలుగులో కాస్త పాజిటివ్ రివ్యూస్ పొందింది. అంతకు మించి కరుణానిధి మనవడు తెలుగు వారిని ఆకట్టుకోలేకపోయాడు.
ఇక గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గిన ఉదయనిధి స్టాలిన్ ఇక పూర్తి స్థాయిలో రాజకీయాల్లో బిజీ అవుదామనుకుంటున్నాడట. ఇప్పటికే డీఎంకేలో ఉదయనిధి స్టాలిన్ కు పార్టీ పదవి కూడా ఉన్నట్టుంది. రాజకీయ వారసత్వం ఎలాగూ రెడీగా ఉంటుంది. ఆ పై ఎమ్మెల్యేగా కూడా నెగ్గేశాడు. స్టాలిన్ వయసు 70కు దగ్గర పడింది.
ఉదయనిధికి కూడా 44 యేళ్ల వయసుంది. మరి ఇక సినిమా సరదాలను చాలించి, రాజకీయంలో బిజీ అయ్యి, తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకునేందుకు ఉదయనిధి ప్రయత్నాలు ప్రారంభించినట్టున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా తర్వాత సినిమాలకు విరామం ప్రకటించేసి, రాజకీయ నేతగా ఇతడు సెటిల్ కానున్నాడట.