హీరో నాని స్టాండ్ మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పడు ఆయన తొమ్మిది కోట్లకు కాస్త అటు ఇటు రేంజ్ హీరో. అంటే కనీసం ముఫై కోట్ల బిజినెస్ జరగాలి అన్నమాట. వసూళ్లు ఆ తరువాత సంగతి. నానికి తొమ్మిది కోట్లు అంటే ప్రొడక్షన్, కాస్టింగ్, డైరక్టర్ అన్నీ కలుపుకుని, ఇరవై కోట్ల నుంచి ఇరవై అయిదు కోట్ల వరకు అవుతుంది సినిమాకు. అందుకే ముఫై కోట్లు దాటి బిజినెస్ జరగాలి.
ఇప్పటికి నాని చేసిన ఒకటి రెండు సినిమాలు ఈ ఫీట్ చేసాయి. అందులో సందేహం లేదు. కానీ చిన్న డైరక్టర్లతో తరచు ఆ ఫీట్ చేయడం అంటే కష్టం. అందుకే ఇప్పుడు పెద్ద డైరక్టర్లపై నాని దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కిషోర్ తిరుమల సినిమా వదిలేసి, విక్రమ్ కుమార్ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఆ సినిమా నిర్మాత ఎవరు అన్నదాని దగ్గర ఆగి, ఆఖరికి మైత్రీకి ఫిక్సయింది. కానీ అనుకున్న స్క్రిప్ట్ ను తొలి నిర్మాత మంజుల ఘట్టమనేని దగ్గర వుండిపోవడంతో, మైత్రీ వాళ్ల కోసం విక్రమ్ కుమార్ కొత్త కథ తయారుచేయాల్సిందే. అందువల్ల అది ఇప్పట్లో పట్టాలు ఎక్కడం కష్టం.
అందుకే ఇప్పుడు మరో టాప్ డైరక్టర్ తో జట్టుకట్టేందుకు నాని రంగం సిద్దం చేసుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. కొరటాల శివ తన భరత్ అనే నేను తరువాత నానితో సినిమా చేసే అవకాశం వుందని ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. దీనికి నిర్మాతగా కొరటాల శివ మిత్రులే వుంటారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా దాదాపు ఖరారు అయినా, భరత్ అనే నేను విడుదల తరువాతే ప్రకటన వుంటుందని తెలుస్తోంది.
వాస్తవానికి కొరటాల ఓ సినిమా రామ్ చరణ్ తో చేయాలి. అయితే రామ్ చరణ్ ఇప్పుడు బోయపాటి సినిమా చేస్తూ, తరువాత రాజమౌళి సినిమా మీదకు వెళ్తారు. అందువల్ల కొరటాల శివకు మధ్యలో చాన్స్ లేదు. బహుశా నానితో సినిమా ప్లానింగ్ కు అది కూడా ఓ కారణం కావచ్చు.
ఇదిలా వుంటే దర్శకుడు త్రివిక్రమ్ కూడా నానితో ఓ సినిమా చేసే అవకాశం వున్నట్లు ఆ మధ్య గ్యాసిప్ లు వచ్చాయి. అది కూడా వాస్తవమే అని, అయితే అది మహేష్ సినిమాకు ముందుగానా? తరువాతనా? అన్నది క్లారిటీ లేదని తెలుస్తోంది. మహేష్ తో మైత్రీ సినిమా వుంటే నానితో సినిమా తరువాత వుంటుంది. ఏ కారణంగానైనా మహేష్-త్రివిక్రమ్ సినిమా వుండకపోతే, అప్పుడే నానితో సినిమా వుంటుందని తెలుస్తోంది.
మొత్తం మీద ముగ్గురు టాప్ లైన్ డైరక్టర్ల సినిమాలు 2019-20లో నాని కాంబినేషన్ లో రాబోతున్నాయి.