అంబ‌టి రాంబాబు చేయాల్సిందేంటి? చేస్తున్న‌దేంటి?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రాజ‌కీయంగా ప‌నికొచ్చే వాళ్లు క‌రువ‌య్యారు. జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నోళ్ల‌కు ప‌ద‌వులొచ్చాయే త‌ప్ప‌, వారి వల్ల న‌యాపైసా రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం లేద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. తాజాగా చంద్ర‌బాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి రాజ‌కీయంగా ప‌నికొచ్చే వాళ్లు క‌రువ‌య్యారు. జ‌గ‌న్‌ను న‌మ్ముకున్నోళ్ల‌కు ప‌ద‌వులొచ్చాయే త‌ప్ప‌, వారి వల్ల న‌యాపైసా రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ద‌క్క‌డం లేద‌న్న విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. తాజాగా చంద్ర‌బాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు బ‌య‌ల్దేరారు. మొద‌టి రోజు నంద్యాల జిల్లాలోని ప్రాజెక్టుల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

రాయ‌ల‌సీమ‌కు తాగు, సాగునీటిని అందించేందుకు త‌న హ‌యాంలో ఎన్నో ప‌నులు చేశాన‌ని చెప్పుకొచ్చారు. సీమ ద్రోహి జ‌గ‌న్ అని విమ‌ర్శించారు. క‌ర‌వు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ స‌స్య‌శ్యామ‌లం కావాలంటే త‌న‌ను గెలిపించాల‌ని ఆయ‌న కోరారు. చంద్ర‌బాబు అబ‌ద్ధాల‌ను చ‌క్క‌గా చెప్ప‌గ‌ల నేర్ప‌రి. రాయ‌ల‌సీమ‌కు జ‌గ‌న్ హ‌యాంలో ఏమీ జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న క‌ళ్లార్ప‌కుండా, నీళ్లు న‌మ‌ల‌కుండా చెబుతుంటే… అమాయ‌క జ‌నం ఔన‌ని న‌మ్మే ప‌రిస్థితి.

రాయ‌ల‌సీమ‌కు త‌మ హ‌యాంలో ఏం జ‌రిగిందో చెప్పాల్సిన బాధ్య‌త సంబంధిత‌శాఖ మంత్రిపై వుంది. ప్ర‌స్తుతం జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రిత్వ బాధ్య‌త‌ల్ని అంబ‌టి రాంబాబు నిర్వ‌ర్తిస్తున్నారు. ఒక‌వైపు నంద్యాల జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏ విధంగా సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్న‌దో ఏకిపారేస్తుంటే… మంత్రి అంబ‌టి రాంబాబు ఏం చేస్తున్నార‌నే ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌వుతుంది.

అంబ‌టి రాంబాబు మీడియా స‌మావేశం నిర్వ‌హించి చంద్ర‌బాబుకు కౌంట‌ర్ ఇవ్వ‌డం మాని, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప‌డి ఏడ్వ‌డాన్ని చూడొచ్చు. అంబ‌టి రాంబాబు మీడియా ముందుకొచ్చారంటే చాలు… ప‌వ‌న్ పెళ్లిళ్లే ప్ర‌ధాన అంశంగా వుంటుంది. రెండు రోజుల క్రితం అంబ‌టి మాట్లాడుతూ బ్రో సినిమాలో త‌న‌పై ఒక క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేసి వెట‌క‌రించార‌ని మండిప‌డ్డారు. అంత‌టితో ఆ ఎపిసోడ్‌కు ముగింపు ప‌ల‌కాల్సి వుంది. అయినా ఆయ‌న విడిచి పెట్ట‌డం లేదు.

మ‌ళ్లీ మీడియా ముందుకొచ్చి… పాడిందే పాడ‌రా పాచిప‌ళ్ల దాస‌రా అనే చందంగా ప‌వ‌న్‌పై అదే వెట‌కారాన్ని ప్ర‌ద‌ర్శించారు. అంబ‌టి ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“చంద్ర‌బాబు ముఠా అమెరికాలో డ‌బ్బు వ‌సూలు చేసి బ్రో సినిమా నిర్మాత విశ్వ‌ప్ర‌సాద్‌ కి ఇస్తే… ఆ మొత్తాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో అందించారు. న‌న్ను కించ‌ప‌రిచేలా బ్రో సినిమాలో ఓ పాత్ర పెట్టి ప‌వ‌న్‌క‌ల్యాణ్ శున‌కానందం పొందుతున్నారు. బ్రో సినిమాలో శ్యాంబాబు అని ఒక పాత్ర‌కు పేరు పెట్టి ప‌వ‌న్ కించ‌ప‌రిచి దూషించారు కాబ‌ట్టే నేను మాట్లాడుతున్నా. శ్యాంబాబు ఎందుకు సంబ‌రాల రాంబాబు అని నేరుగా పెట్టుకోవ‌చ్చు. ప‌వ‌న్‌పై మేము కూడా సినిమా తీయాల‌ని అనుకుంటున్నాం. ఈ క‌థ‌కు నిత్య పెళ్లి కొడుకు, పెళ్లిళ్లు – పెటాకులు, తాళి-ఎగ‌తాళి, మూడు ముళ్లు -ఆరు పెళ్లిళ్లు తదిత‌ర పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. పేర్లు, క‌థ‌లో మార్పుల‌కు సంబంధించి ఎవ‌రైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వొచ్చు”

సాగునీటి ప్రాజెక్టుపై మాట్లాడే విష‌య ప‌రిజ్ఞానం అంబ‌టి రాంబాబుకు లేదు. ప‌వ‌న్ మూడు పెళ్లిళ్లు, బ్రో సినిమా లాంటి వాటిపై మాట్లాడేందుకు ప‌రిజ్ఞానం అవ‌స‌రం లేదు. అందుకే సులువుగా ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి వాటితో వైసీపీకి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం లేక‌పోగా మ‌రింత న‌ష్ట‌మే. త‌న శాఖ‌కు సంబంధించి చంద్ర‌బాబు ఊరూరా తిరుగుతూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే, బాధ్య‌త గ‌ల మంత్రిగా వాటిని తిప్పి కొట్టాల్సిందిపోయి, చిల్ల‌ర విష‌యాలు మాట్లాడ్డం అంబ‌టి రాంబాబుకే చెల్లిందన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

జ‌ల‌వ‌న‌రుల‌శాఖ మంత్రికే ఏమీ తెలియ‌న‌ప్పుడు, ఇక ఆ శాఖ‌లోని న‌లుగురు స‌ల‌హాదారుల‌కు మాత్రం ఏం తెలుసు? మంత్రితో పాటు స‌ల‌హాదారుల నియామ‌కాల‌న్నీ ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌న్న ఉద్దేశంతో నియ‌మించిన‌వే. అంతే త‌ప్ప‌, వీళ్లెవ‌రూ జ‌గ‌న్‌కు ప‌నికొచ్చేవాళ్లు. అందుకే టీడీపీ సులువుగా అధికార పార్టీని ఆడుకుంటోంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మ‌హాదేవ అని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు.