జనసేనాని పవన్‌కల్యాణ్ తన అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఏ మాత్రం సిగ్గుపడరు. ఇదే ఆయన గొప్పతనం. రాజకీయాల్లో నోరు జారడం సహజం. దాని వల్ల నష్టం జరుగుతుందని గ్రహించినప్పుడు విజ్ఞులెవరైనా సరి చేసుకుంటుంటారు. జనసేనాని పవన్‌కల్యాణ్ మనస్తత్వం అందుకు పూర్తి భిన్నం.
ఉదాహరణకు వలంటీర్లపై ఆయన నోరు జారారు. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన వారిపై అవాకులు చెవాకులు పేలారు. పవన్‌తో అంటకాగుతున్న తమకు రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని టీడీపీ కీలక ప్రకటన చేసింది. తామొస్తే వలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటించింది.
తాజాగా పవన్ అజ్ఞానానికి మరో మచ్చు తునక లాంటి కామెంట్. తండ్రి లేని పిల్లాడు కాబట్టే జగన్‌ను సీఎం చేశారనేది ఆయన అభిప్రాయం. ఏడాది నుంచి పాదయాత్ర చేస్తున్నాడనే జాలితో జగన్‌ను ఆదరించారనేది పవన్ అభిప్రాయం. రాజకీయంగా విమర్శలు చేయడానికైనా ఎంతోకొంత లాజిక్ వుండాలి. ఆ మాటకొస్తే పవన్‌కు కూడా తండ్రి లేడు కదా? మరి తననెందుకు ప్రజలు ఆదరించలేదో పవన్ సమాధానం చెప్పగలరా?
చంద్రబాబు విషయానికి వస్తే… తల్లిదండ్రులిద్దరూ లేరు. మరెందుకు ఆయనపై జనం సానుభూతి చూపలేదు. రాజకీయ విధానాలే తప్ప, వ్యక్తిగత సానుభూతులు అధికారాన్ని తెచ్చి పెట్టవని పవన్ గుర్తించాలి.
ఏడాదంతా తాను షూటింగ్‌ల్లో బిజీగా వుంటూ, మిగిలిన సమయాల్లో చంద్రబాబు పల్లకీ మోస్తుంటే జనం ఆదరిస్తారా? జగన్‌కు ప్రజాదరణకు తన ఫెయిల్యూర్ కారణమని ఎందుకు ఆయన అనుకోరనే ప్రశ్న ఉత్పన్నమైంది.
జగన్‌ను జనం ఊరికే అభిమానించలేదు. నిత్యం ప్రజల్లో వుంటూ, కష్టనష్టాల్లో అండగా ఉంటాననే భరోసా కల్పించారు. కావున జగన్ సీఎం అయ్యారని అసూయ చెందకుండా, ప్రజల ప్రేమాభిమానాలు చూరగొనేందుకు పవన్ ప్రయత్నించాలి. పొంతనలేని, నవ్వులపాలయ్యే కామెంట్స్ చేయడం మానేసి, తన పార్టీ ఎదుగుదల కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విషయాన్ని గ్రహించి ముందుకు సాగడమే పవన్ ముందున్న తక్షణ కర్తవ్యం.