కొన్ని రోజులుగా చంద్రబాబునాయుడు పోలవరం పూర్తి చేస్తే గోదావరి నీటిని బనకచర్లకు తరలించడం ద్వారా రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని మాట్లాడుతున్నారు. ఈ ప్రయత్నం పరిమిత ప్రయోజనంతో పాటు అపరిమిత ఖర్చుతో కూడుకున్నది. రాయలసీమకు న్యాయం జరగాలంటే పోలవరం నుంచి కుడి కాల్వ ద్వారా, ఎత్తిపోతల ద్వారా బనకచర్ల వద్దకు నీటిని తరలించడం కాదు. దమ్మగూడెం ప్రాజెక్టును చేపడితే రాయలసీమకు తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
దుమ్మగూడెం-టేల్ పాండ్ పథకం నేపథ్యం
రాయలసీమ ప్రాజెక్టులకు నీటి సరఫరా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చిమర్రి ద్వారా జరుగుతుంది. పై మూడు మార్గాలలో పోతిరెడ్డిపాడు కీలకం. కాకపోతే శ్రీశైలంలో 854 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు నీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం 315 TMC ల సామర్థ్యంతో నిర్మాణం చేసినా, పూడిక వల్ల 200 TMC లకు పడిపోయింది.
రాయలసీమకు నీరు విడుదల చేయడం కోసం నీటి నిల్వను ఏపీ ప్రభుత్వం చేసినా, తెలంగాణకు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 99 TMC ల నికరజలాల వాటా కలిగి ఉంది. ఆ నీటిని కూడా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు తరలించాలి. అంటే పోలవరం పూర్తి అయినా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని డ్రా చేయకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వం డ్రా చేస్తుంది. అంటే పోలవరం పూర్తి అయితే కృష్ణా డెల్టాకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది కానీ రాయలసీమకు కాదు.
దుమ్ముగూడెం టెల్ పాండు ప్రయోజనం…
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గోదావరి నదీజలాలను రాయలసీమకు సైతం ఉపయోగించాలన్న దూరదృష్టితో ఈ పథకాన్ని ముందుకు తెచ్చారు. కృష్ణాలో నీటి లభ్యతకు పరిమితులు ఏర్పడ్డాయి. అందుకే పుష్కలంగా నీరు ఉండి సముద్రంలో వేల టీఎంసీలు కలిసి పోతున్న నేపథ్యంలో దాదాపు 165 టీఎంసీల సామర్థ్యంతో దుమ్ముగూడెం ప్రాజెక్టును నిర్మించి గోదావరి నీటిని నాగార్జున సాగర్‌కు తరలిస్తారు.
తెలంగాణకు శ్రీశైలం నుంచి ఇవ్వవలసిన 99 TMC లను గోదావరి నీటితో ఇవ్వొచ్చు. నాగార్జున సాగర్‌కు దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా గోదావరి నదీ జలాలను మళ్లించడం వలన శ్రీశైలం ప్రాజెక్టును రాయలసీమ, దక్షిణ తెలంగాణకు గరిష్టంగా ఉపయోగించుకునే దూరదృష్టితో వారు ఆ పథకాన్ని రూపకల్ప చేశారు. దాదాపు 500 కోట్లు ఖర్చు చేసి ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి చేశారు.
జగన్ ముందడుగు వేయాలి
ఎన్నికలకు ఒక నెల ముందు విపక్ష నేతగా తిరుపతిలో తటస్తులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ప్రతినిగా పాల్గొన్న నేను దుమ్ముగూడెం పథకాన్ని ప్రస్తావించాను. విపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించడమే కాదు దుమ్ముగూడెం ఆవశ్యకతను ప్రత్యేకంగా పేర్కొన్నారు.
పోలవరానికి ఇది అదనం అవుతుందని, అలా దుమ్ముగూడెం మరో పోలవరం లాంటిది తన మనస్సులో కూడా ఉందని, కచ్చితంగా ప్రాజెక్టు చేద్దామని హామీ ఇచ్చారు. విపక్ష నేతగా నాడు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి హోదాలో నేడు నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత విపక్ష నేత చంద్రబాబు కూడా ఆచరణలో పరిమితులు, వ్యయప్రయాసలతో కూడి పరిమిత ప్రయోజనం ఉన్న గోదావరి నీటిని సీమకు తరలించడం కాకుండా పరిమిత ఖర్చుతో శాశ్వత పరిష్కారం అయిన దుమ్ముగూడెం టేల్ పాండ్ గురించి ఆలోచించాలి.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం.