పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెసులో చేరిక విషయం ఎన్నడో ఖరారు అయింది. ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ జరిగినప్పుడు.. పొంగులేటితోకలిసి ఆయన కూడా జాయిన్ అవుతారనే ప్రచారం తొలుత వినిపించింది. అయితే ఖమ్మం వెళ్లి చేరడం కంటె, తన జిల్లాలోనే చేరడం రాజకీయంగా లాభం అని ఈ పాలమూరు నేత భావించారు. ఆ ప్రయత్నాలు పెండింగ్ లో పడి ఆయన ప్రస్తుతం ఢిల్లీలో పార్టీలో చేరిపోవడానికి నిశ్చయించుకున్నారు.
తన నియోజకవర్గంలో నిర్వహించే సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీని తీసుకువచ్చి తన బలం ఏమిటో ఆమె ఎదుట ప్రదర్శించుకోవాలని ఆయన పడిన ముచ్చట మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. కనీసం కొన్ని నెలల పాటు ఆ ముచ్చట వాయిదా పడే ప్రమాదం ఉంది.
ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోయే బహిరంగ సభకు ముందుగా ప్లాన్ చేసినట్లుగా ప్రియాంక గాంధీ రావడం లేదు. ఆమె ఎంపీ కాకపోయినప్పటికీ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా రావడం సాధ్యం కాదని పార్టీ వర్గాలు తేల్చి చెప్పేశాయి. జులై నెలలో 20, 30 తేదీలలో జూపల్లి చేరిక కోసం ప్రియాంక గాంధీ సమక్షంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా భారీ వర్షాల గురించిన హెచ్చరికల నేపథ్యంలో ఆ సభలను రద్దు చేసుకున్నారు.
ఇప్పుడు జూపల్లి కృష్ణారావు సహా వివిధ పార్టీల నుంచి కాంగ్రెసులో చేరడానికి ఉవ్విళ్లూరుతున్న నేతలందరూ ఢిల్లీకి క్యూ కట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో వీరందరూ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. తన బలప్రదర్శన కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి ప్రత్యేకంగా ఒక సభ తీరిగ్గా నిర్వహించవచ్చునని భావిస్తున్నారు.
చేరిక ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు హడావుడిగా జూపల్లి కృష్ణారావు తదితరులు అందరూ కలిసి మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోనే పార్టీలో చేరబోతున్నారు. అయితే ఈ పరిణామం తర్వాత అయినా సరే జూపల్లి కృష్ణారావు ప్రియాంక గాంధీని పాలమూరుకు తీసుకువచ్చి ఆమె ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తే తప్ప జూపల్లి పరువు నిలిచే అవకాశం లేదు.
అసలే ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పరువు కాపాడుకోవడానికి ఆయన ప్రియాంక గాంధీని ఎప్పుడు తమ జిల్లాకు తీసుకువస్తారో ఆయనే నిర్ణయించు కోవాల్సిన అవసరం ఉంది.