ఎన్టీఆర్ బయోపిక్ మరికాస్త వెనక్కి?

అదిగో బయోపిక్.. ఇదిగో బయోపిక్ అన్నట్లు తయారైంది ఎన్టీఆర్ సినిమా సంగతి. ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో ఏణ్ణర్థం కిందట తయారైంది. ఫుల్ గా పెర్ ఫెక్ట్ గా తయారైన స్క్రిప్ట్ ను తీసుకువచ్చి,…

అదిగో బయోపిక్.. ఇదిగో బయోపిక్ అన్నట్లు తయారైంది ఎన్టీఆర్ సినిమా సంగతి. ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో ఏణ్ణర్థం కిందట తయారైంది. ఫుల్ గా పెర్ ఫెక్ట్ గా తయారైన స్క్రిప్ట్ ను తీసుకువచ్చి, డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ చేతిలో పెట్టారు. దర్శకుడిగా తేజ పిక్సయ్యారు. కానీ సినిమా మాత్రం సెట్ మీదకు ఎంతకీ వెళ్లడంలేదు.

టీజర్ ముహుర్తాలు, ఉగాది ముహుర్తాలు సంగతి ఎలా వున్నా, సినిమా మాత్రం ఇప్పట్లో స్టార్ట్ కాదని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరో బాలకృష్ణ ఇప్పుడు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా వున్నారు. ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి మెగా అల్లుడు సినిమాతో బిజీగా వున్నారు. డైరక్టర్ తేజ తాను చేయబోయే వెంకీ సినిమాతో హడావుడిగా వున్నారు. ఆ సినిమా మార్చిలో ముహుర్తం జరుపుకుని, మే నాటికి పూర్తవుతుంది. అప్పటికే నిర్మాత, డైరక్టర్, బాలయ్య ఫ్రీ అవుతారు.

అప్పటి నుంచే ఎన్టీఆర్ సినిమా కాస్టింగ్ మీద పూర్తిగా దృష్టిపెట్టే అవకాశం వుంది. సినిమాలోని పాపులర్ క్యారెక్టర్లకు కొత్త వాళ్లను తీసుకోవాలన్నది తేజ అభిమతంగా వుంది. గురువు ఆర్జీవీ మాదిరిగా కొత్త వాళ్లను వెదికి పట్టుకుని, పాత్రలకు ఒరిజినల్ లుక్ తీసుకురావాలన్నది తేజ ఐడియాగా వుంది. అది అంత సులువు కాదు. అంటే ఇదిగో అదిగో అని జూలై నాటికి కానీ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ కాదని వినిపిస్తోంది.

ఈలోగా వెంకీ-తేజ సినిమా విడుదలవుతుంది. దాని ఫలితం బాగుంటే ఓకె. లేదంటే అది మళ్లీ ఈ బయోపిక్ ను ప్రభావితం చేయొచ్చు. అసలే టీజర్ చిత్రీకరణ తరువాత తేజ మీద బాలయ్య డవుట్ పడుతున్నారని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి.

మరోపక్క బాలయ్యను ఎలాగైనా ఓ మామూలు సినిమా చేయించడానికి ఒప్పించే ప్రయత్నంలో ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వున్నారు. అయితే సరైన కథ, డైరక్టర్ దొరకడంలేదు. కథ దొరికితే రెడీ అన్న ధోరణిలో బాలయ్య వున్నట్లు తెలుస్తోంది. అలా కథ, సినిమా కనుక సెట్ అయితే బయోపిక్ మళ్లీ వెనక్కు వెళ్తుంది. పొరపాటున డిసెంబర్ లో ఎన్నికలు కనుక వస్తే ఇక చెప్పనక్కరలేదు.

ఆ బయోపిక్ లు అంతే సంగతులా?

ఎన్టీఆర్ బయోపిక్ తో పాటే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ అంటూ వర్మ హడావుడి చేసారు. అదేమయిందో తెలియదు. తరువాత కడప అంటూ మరో హడావుడి. అదీ పక్కన వుంది. వీటితో పాటు ఆటలో అరటిపండు అంటూ లక్ష్మీస్ వీరగంథమ్ అంటూ ఇంకోటి. అదీ అంతే సంగతులేమో? వార్తే వినిపించడం లేదు. సో మొత్తంమీద బయోపిక్ లు అన్నీ అలా నత్తనడక నడుస్తున్నాయి.