అందరూ జై కొడుతోంటే మోడీదే గెలుపు!

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారుల బదిలీలను కేంద్రం నిర్ణయించే విధంగా రూపొందిన ఢిల్లీ సర్వీసుల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బదిలీలు గవర్నరు చేతిలో ఉండడం…

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారుల బదిలీలను కేంద్రం నిర్ణయించే విధంగా రూపొందిన ఢిల్లీ సర్వీసుల బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బదిలీలు గవర్నరు చేతిలో ఉండడం అనేది ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి పెద్ద షాక్ అని చెప్పాలి. 

కేంద్రం ఈ మేరకు ఆర్డినెన్సు ద్వారా నిర్ణయం తీసుకున్నప్పటినుంచి.. ఆప్ పార్టీ, కేజ్రీవాల్ సర్కారు ఈ అంశంపై అలుపెరగని పోరాటం చేస్తోంది. భాజపా వ్యతిరేక పార్టీల మద్దతు మాత్రమే కాకుండా, తటస్థ పార్టీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేసింది. ఎన్ని చేసినప్పటికీ.. సదరు ఆర్డినెన్సు ఇప్పుడు బిల్లురూపంలో సభ ఎదుటకు వచ్చేసరికి.. ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉన్న లోక్ సభలో మాత్రమే కాదు, అటు వారికి చాలినంత మెజారిటీ లేని రాజ్యసభలో కూడా గట్టెక్కే అవకాశం కనిపిస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసింది. విపక్షాలు అన్నీ ఇండియా కూటమిగా ఆవిర్భవించడం వెనుక ఆప్ పార్టీ పెట్టిన కండిషన్ గా కూడా ఇది నిలిచింది. ఈ ఆర్డినెన్సును ఆప్ కోరిక మేరకు వ్యతిరేకించడానికి తొలుత కాంగ్రెస్ అంగీకరించలేదు. దాంతో ఇండియా కూటమి సమావేశాలకు తాము రాబోమంటూ కేజ్రీవాల్ తెగేసి చెప్పారు. దాంతో ప్రధానంగా మోడీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టడం ఒక్కటే టాప్ ప్రయారిటీగా భావిస్తున్న కాంగ్రెస్ ఒక మెట్టు దిగి వచ్చింది. ఆ ఆర్డినెన్సును వ్యతిరేకించింది. అలాగే ఇండియా కూటమి మొత్తం పార్టీలు దానిని వ్యతిరేకించాయి. 

ఇండియా కూటమిలో లేకపోయినప్పటికీ.. తెరాస వంటి పార్టీల మద్దతును కేజ్రీవాల్ సంపాదించగలిగారు. దీనిని కేసీఆర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే.. ఒదిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ పార్టీ తొలుత ఆప్ విజ్ఞప్తి పట్ల సుముఖంగా కనిపించినప్పటికీ.. తాజాగా ఆ పార్టీ నేత నవీన్ పట్నాయక్ తాము కేంద్రానికే మద్దతు ఇవ్వబోతున్నట్టు చెప్పడంతో.. బిల్లు నెగ్గడం తథ్యమని తేలిపోయింది.

లోక్ సభలో ఎన్డీయే కు సంపూర్ణ మెజారిటీ ఉంది. ఏ బిల్లు అయినా లోక్ సభ గడప దాటడం పాలక పక్షానికి కష్టం కాదు. అదే సమయంలో 245 మంది సభ్యులున్న రాజ్యసభలో వారికి పూర్తి బలం లేదు. ఈ నెంబర్ లో 7 ఖాళీలు కాగా, మొత్తం 238 మంది సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. అంటే బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాలంటే.. వారికి 120 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీయే కూటమి పార్టీల బలం 103 మాత్రమే. బిజూ జనతాదళ్ కు 9 మంది సభ్యులున్నారు. దానికి తోడు వైసీపీ, తెదేపా లతో పాటు, ఐదుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతు తెలిపే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో ఆప్ వ్యతిరేకిస్తున్న ఈ కీలక బిల్లు.. పార్లమెంటులో ఆగే అవకాశం లేదని, కేజ్రీవాల్ కు అశనిపాతం తప్పదని పలువురు అంటున్నారు.