14 ఏళ్లు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత తనకే దక్కుతుందని చంద్రబాబునాయుడు అనేక సందర్భాల్లో చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు ఏపీకి సీఎంగా పని చేసే అదృష్టం ఆయనకు దక్కడం, మన రాష్ట్రానికి పట్టిన దురదృష్టం అనే వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. దీన్ని బట్టి ఆయన ఏపీకి తనదైన ముద్ర వేసిందేమీ లేదనే విమర్శ బలంగా వుంది.
తాజాగా ఆయన సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు బయల్దేరారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌ను చంద్రబాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
“రాష్ట్రంలో 69 నదులు ఉన్నాయి. వీటిని అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరువు అనేది ఉండదు. నదుల అనుసంధానం చేస్తే గోదావరి నీళ్లు నేరుగా బనకచర్లకు వస్తాయి. దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా కర్నూలు. పోతిరెడ్డిపాడు ఎస్సార్బీసీ విస్తరణ అటకెక్కింది. అవుకు టన్నెల్ పనులు పూర్తి చేసి.. అవసరమైన మరో టన్నెల్ తవ్వి గండి కోటకు నీళ్లు ఇచ్చాం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకానికి మరో రెండు పంపులు పెట్టాలి. కర్నూలు జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్డీఎస్ గుండ్రేవుల ప్రాజెక్టుల కోసం జగన్ ప్రభుత్వం ఒక పైసా కూడా ఖర్చు చేయలేదు. నదుల అనుసంధానం చేస్తూనే నల్లమల అడవుల్లో ఓ టన్నెల్ నిర్మించి గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకురావడమే నా జీవిత లక్ష్యం” అని చంద్రబాబు అన్నారు.
మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేసినట్టు? ఇప్పుడు అధికారం ఇస్తే రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని బాబు భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు తన వాళ్లకు దోచి పెట్టడానికి హైదరాబాద్‌ను ఓ పథకం ప్రకారం అభివృద్ధి చేయడం నిజం కాదా? అనే ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెబుతారు? అలాగే గత ఐదేళ్లలో అమరావతి నామస్మరణ తప్ప, మరే ప్రాంత అభివృద్ధిని పట్టించుకోని ఘనత చంద్రబాబుది కాదా?
తన హయాంలో సీమకు సాగునీటిని ఇచ్చి వుంటే, ఇప్పుడు జగన్‌కు అధికారం దక్కేది కాదనేది వాస్తవం కాదా? అలాగే జగన్ ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని విమర్శిస్తున్న చంద్రబాబు, తన 14 ఏళ్ల పాలనలో అవన్నీ ఎందుకు విస్మరించారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీమను గుర్తుకు తెచ్చుకోని చంద్రబాబు, ఇప్పుడు మాత్రం ఓట్ల కోసం మొసలి కన్నీళ్లు కార్చడం ఆయనకు మాత్రమే చెల్లింది.