తిరుప‌తిలో టీడీపీ మాస్ట‌ర్ యూట‌ర్న్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి యూట‌ర్న్ తీసుకోవ‌డం కొత్త కాదు. చంద్ర‌బాబును తిరుప‌తి టీడీపీ నాయ‌కులు స్ఫూర్తిగా తీసుకుని ఆ న‌గ‌ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌నంతా అర‌చేతిలో వైకుంఠాన్ని త‌ల‌పించడం గురించి ప్ర‌త్యేకంగా…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి యూట‌ర్న్ తీసుకోవ‌డం కొత్త కాదు. చంద్ర‌బాబును తిరుప‌తి టీడీపీ నాయ‌కులు స్ఫూర్తిగా తీసుకుని ఆ న‌గ‌ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌నంతా అర‌చేతిలో వైకుంఠాన్ని త‌ల‌పించడం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అధికారం నుంచి దిగిపోవ‌డానికి ఆరు నెల‌ల్లో జీవోలు, శంకుస్థాప‌న‌లు, నిరుద్యోగ భృతి, అన్నా క్యాంటీన్లు, ఆడ‌బిడ్డ‌ల‌కు పసుపు కుంకుమ కింద నిధుల జ‌మ ..ఇలా ఎన్నైనా చెప్పుకోవ‌చ్చు.

టీడీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఎలాంటి అభివృద్ధి ప‌నులు చేయ‌కుండా, చివ‌రి నిమిషంలో మ‌రోసారి అధికారం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. ఈ నేప‌థ్యంలో 2019, మార్చి 8న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం జీవో నంబ‌ర్ 112 జారీ చేసింది. ఈ జీవో ప్ర‌కారం తిరుప‌తిలో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్లు వేయ‌డం ల‌క్ష్యం. శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ విద్యాల‌యంలో కూడా మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను వేస్తామ‌ని పేర్కొన్నారు.

త‌న‌కు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చిన‌, అలాగే విద్యాబుద్ధులు నేర్పిన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ విద్యాల‌యం రూపు రేఖ‌లు మార్చ‌డానికి చంద్ర‌బాబు విజ‌న‌రీ నుంచి మాస్ట‌ర్ ప్లాన్ రోడ్లు రూపుదిద్దుకున్నాయ‌ని అప్ప‌ట్లో టీడీపీ నీతులు చెప్పారు. నిజ‌మే కాబోలు అని అప్ప‌ట్లో ప్ర‌జ‌లంతా న‌మ్మారు. అయితే రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. తిరుప‌తిలో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అభ్య‌ర్థి భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి గెలుపొందారు.

తిరుప‌తి కార్పొరేష‌న్‌కు సుదీర్ఘ కాలం త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపొందింది. డిప్యూటీ మేయ‌ర్ భూమ‌న అభిన‌య్‌రెడ్డి తిరుప‌తి మెట్రో సిటీని తల‌పించేలా అభివృద్ధి చేసేందుకు టీడీపీ రూపొందించిన మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను వేయాల‌ని సంక‌ల్పించారు. ఈ క్ర‌మంలో తిరుప‌తి న‌గ‌రంలో సుమారు 17 మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు స‌త్వ‌రం రూప‌క‌ల్ప‌న చేశారు. వీటిలో ఐదారు రోడ్లు వాడుక‌లోకి కూడా వ‌చ్చాయి. మ‌రికొన్ని నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి.

తాజాగా శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ విద్యాల‌యంలో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్లను వేసేందుకు తిరుప‌తి కార్పొరేష‌న్ ముందుకొచ్చింది. అయితే విశ్వ విద్యాల‌యంలో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను వేయ‌డంపై టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నేత‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. చంద్ర‌బాబు మాస్ట‌ర్ మైండ్‌ను ప్ర‌తిబింబించేలా రూప‌క‌ల్ప‌న అయ్యాయ‌ని మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌పై గొప్ప‌లు చెప్పుకున్న టీడీపీ, ఇప్పుడు యూట‌ర్న్ తీసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తిరుప‌తి జ‌నాభా 4.5 ల‌క్ష‌లు. క‌నీసం అంటే 2.5 ల‌క్ష‌ల కార్లు ఉన్నాయి. ఇక ట్యాక్సీలు, ఆటోలు, ద్విచ‌క్ర వాహ‌నాల సంఖ్య చాలా ఎక్కువే. తిరుప‌తి న‌గ‌రంలో స‌గం భూవిస్తీర్ణం తిరుప‌తి యూనివ‌ర్సిటీలోనే వుంది. ఈ విశ్వ‌విద్యాల‌యం వెయ్యి ఎక‌రాల్లో కొలువుదీరింది. తిరుప‌తి న‌గ‌ర అభివృద్ధిని విశ్వ‌విద్యాల‌యానికి అతీతంగా చూడ‌లేం. అందుకే చంద్ర‌బాబు దూర‌దృష్టితో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. అయితే ఆయ‌న హ‌యాంలో ప‌నులు చేయ‌లేద‌నే విమ‌ర్శ త‌ప్ప‌, ఆయ‌న ప్ర‌ణాళిక‌ను ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌స్తుతం వైసీపీ ప్ర‌భుత్వం వేస్తున్న మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌న్నీ త‌న ప్ర‌భుత్వ ఘ‌న‌త అని చెప్పుకున్నా ఎవ‌రికీ అభ్యంత‌రం లేదు.

నిజానికి తిరుప‌తి న‌గ‌రంలో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌తో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అభిన‌య్‌కి మంచి పేరు వ‌చ్చింది. దీన్ని ప్ర‌తిప‌క్షాలు జీర్ణించుకోలేకున్నాయి. దీంతో విశ్వ‌విద్యాల‌యంలో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను వేస్తూ, దాని అస్తిత్వాన్ని దెబ్బ తీస్తున్నార‌నే సాకుతో వైసీపీని బ‌ద్నాం చేయాల‌నే కుట్ర‌ల‌కు తెర‌లేపార‌నే ఆరోప‌ణ‌లు ఆ పార్టీ నుంచి వ‌స్తున్నాయి.

నిజానికి విశ్వ‌విద్యాల‌యంలో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్లు వేస్తార‌నే మాటే గానీ, ఇప్ప‌టికే అక్క‌డ ర‌హ‌దారులున్నాయి. కాక‌పోతే తాజాగా వాటిని మ‌రింత‌గా విస్త‌రించ‌డం ఒక్క‌టే చేస్తామ‌ని కార్పొరేష‌న్ చెబుతోంది. తిరుప‌తి శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ విద్యాల‌యంలో మొత్తం మూడు మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌ను వేయడానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఎస్వీయూ మొద‌టి గేట్ నుంచి రెండు కిలోమీట‌ర్లు చొప్పున 80 అడుగుల విస్తీర్ణంతో రోడ్డు విస్త‌ర‌ణ చేప‌ట్టాల‌ని అనుకుంటున్నారు. ఇప్ప‌టికే 20 అడుగుల రోడ్డు వుంది. అత్య‌వ‌స‌రంగా స్విమ్స్‌కు వెళ్లాల‌ని అనుకునేవారు ఈ మార్గంలో ప‌య‌నిస్తుంటారు.

ఎస్వీయూ మూడో గేటులో మాస్ట‌ర్ ప్లాన్ రోడ్డు వేయాల‌ని అనుకుంటున్నారు. ఇది ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్‌కు స‌మీపంలో వుంటుంది. ఈ గేటు ఎప్ప‌టికీ మూసే వుంటారు. ఈ గేటుకు స‌మీపంలో అమ్మాయిల హాస్ట‌ల్ వుంటుంది. ప్ర‌స్తుతం 40 అడుగుల రోడ్డు వుంది. ఈ రోడ్డులో వేద విశ్వ విద్యాల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌యాణించి జూపార్క్ రోడ్డులోకి చేరుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం 1.7 కి.మీ చొప్పున‌ 80 అడుగుల రోడ్డు విస్త‌రించాల‌ని అనుకుంటున్నారు.

ఎస్వీయూ 6వ గేటు స‌మీపంలోని ప్ర‌కాశం న‌గ‌ర్ స్టాఫ్ క్వార్ట‌ర్స్ నుంచి జూపార్క్ వ‌ర‌కు మ‌రో రోడ్డును విస్త‌రించాల‌ని ప్ర‌తిపాదిస్తున్నారు. ప్ర‌స్తుతం గేటుకు ఆనుకుని వున్న నేష‌న‌ల్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ లేబొరేట‌రీ నుంచి ప్ర‌స్తుతం 20 అడుగుల రోడ్డు వుంది. కొంత దూరం వెళ్లాక రెండుగా చీలిపోతుంది. ఎడ‌మ వైపు వెళితే జూపార్క్ రోడ్డులో, కుడివైపు వెళితే ఎస్వీయూ క్యాంప‌స్‌లోనే క‌ల‌వొచ్చు. న‌గ‌రంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని, మ‌రింత సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో …అది కూడా గ‌త ప్ర‌భుత్వం రూపొందించిన మాస్ట‌ర్ ప్లాన్ రోడ్స్‌కు ఒక రూపం తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌తిప‌క్షాలు అడ్డు త‌గ‌ల‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ఆక్స్‌ప‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యం, అలాగే మ‌న దేశంలో పేరెన్నికగ‌న్న జేఎన్‌యూ, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో, ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి వుండ‌డాన్ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. అక్క‌డ లేని ఇబ్బందులు మ‌న తిరుప‌తిలోనే ఎందుక‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. 

ఇదే ఎస్వీయూలో అంత‌ర్గ‌త రోడ్లు సుమారు 60 ఎక‌రాల్లో విస్త‌రించాయి. ఒక్క చెట్టును కూడా తొల‌గించ‌కుండా రోడ్లు వేశామ‌ని ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రా? ఇప్పుడు విస్త‌రిస్తున్న రోడ్లు కేవ‌లం నాలుగైదు కిలోమీట‌ర్లే. కావున పాల‌క ప్ర‌తిప‌క్షాలు ఇగోల‌కు వెళ్ల‌కుండా తిరుప‌తి న‌గ‌ర అభివృద్ధికి ప‌ర‌స్ప‌రం స‌హ‌కారం అందించుకోవాల్సిన అవ‌స‌రం వుంది. రాజ‌కీయం కంటే సామాజిక ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా భావిస్తేనే తిరుప‌తి మ‌రింతగా అభివృద్ధి చెందుతుంది.