మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద గొడవగా, ఎన్నడూ లేని ఇబ్బందికరమైన ఫైట్ గా మారిన విడుదల తేదీల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసింది. బన్నీ- మహేష్ బాబు చిత్రాల రిలీజ్ కు ఒకే డేట్ లాక్ చేయడంతో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు విడుదల తేదీలు మారిపోయాయి. ఇద్దరు హీరోలకోసం వేర్వేరు తేదీలను నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఈ చిత్రాల డిస్ట్ర్రిబ్యూటర్లకు కూడా సమాచారం పంపేసినట్లుగా తెలుస్తోంది.
ఫైనలైజ్ అయిన రాజీ చర్చల ప్రకారం.. కొత్త తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో భరత్ అనే నేను చిత్రం విడుదల అవుతుంది. 27న కాలా చిత్రం విడుదల ఉంటుంది. నా పేరు సూర్య చిత్రాన్ని మే 5వ తేదీకి షెడ్యూలు చేశారు. మొత్తానికి ఇద్దరు అగ్రహీరోల మధ్య పోటీ, రెండు భారీ చిత్రాలు సేమ్ డేట్ విడుదల అయితే.. ఇండస్ట్రీ మీద, రెండు చిత్రాల కలెక్షన్ల మీద పడగల దుష్ప్రభావానికి చెక్ పడనట్లే.
ప్రధానంగా బన్నీ-మహేష్ చిత్రాల విడుదల విషయంలో చాలా రోజులుగా ప్రతిష్టంభన ఏర్పడిపోయిన సంగతి తెలిసిందే. ఇలాంటి గొడవ ఇండస్ట్ర్రీకి మంచిది కాదని.. దాదాపుగా పరిశ్రమ పెద్దలందరూ రంగంలోకి దిగారు. ఛాంబర్ రాజీ చర్చల వరకు వ్యవహారం వెళ్లింది. ఇండస్ట్రీ నిర్ణయాలను ప్రభావితం చేయగల దాదాపు అందరు పెద్దలూ.. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి.
వ్యవహారం ఇండస్ట్రీ ఎంత నష్టపోతుంది అనే దగ్గరి నుంచి ఇరువురు హీరోల వ్యక్తిగత ఇమేజి పోటీగా మారే సరికి.. పీటముడి బిగిసిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇండస్ట్రీ పెద్దలు మొత్తానికి ఇద్దరినీ బుజ్జగించి ఒప్పించారు. కొత్తగా కనీసం రెండు వారాల గ్యాప్ తో ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడుదల అయ్యేలా తేదీలను సెట్ చేశారు. ఆ మేరకు ఆయా చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ఇప్పటికే సమాచారం కూడా వెళ్లిపోయింది.
ఎంతవరకు ముదురుతుందో.. అని చాలా మంది భయపడిన ఈ గొడవ స్మూత్ గానే సమసిపోయిందని అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.