రివ్యూ: అ
రేటింగ్: 2.5/5
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
తారాగణం: నాని (వాయిస్ ఓవర్), రవితేజ (వాయిస్ ఓవర్), కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, రెజీనా, శ్రీని అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ, ఇషా, రోహిణి, ప్రగతి తదితరులు
సమర్పణ: నాని
కూర్పు: గౌతమ్ నెరుసు
సంగీతం: మార్క్ కె. రాబిన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: ప్రశాంతి త్రిపిరినేని
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2018
''ఇదో తిక్క సినిమా!'' ఈ మాట అన్నది మరెవరో కాదు… యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన నచ్చి దీనిపై ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టిన నాని అన్న మాట ఇది. యస్… 'అ' గురించి సింపుల్‌గా ఒక్క మాటలో అంత కంటే చెప్పలేం. అందరి తలకెక్కే కాన్సెప్ట్ కాదిది. చాలా చిత్రమైన ఇతివృత్తంతో, అంతకంటే విచిత్రమైన కథనంతో రూపొందిన 'అ' ఇంకా చూడని వాళ్లతో డిస్కస్ చేస్తే వాళ్లు చూడబోయేది స్పాయిల్ చేసేస్తుంది. చూసిన వాళ్లతో డిస్కషన్‌కి కూర్చుంటే 'అ'దేంటి, 'అ'దెందుకు, 'అ'లా ఎలా అంటూ ఎంతకీ తెగనిది.
వచ్చిన అవకాశాన్ని 'క్యాష్' చేసేసుకోవడానికి కాకుండా, కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దామని అనుకున్నాడు ప్రశాంత్ వర్మ. అతని కథ ఏంటనేది తెలియడానికి, చూస్తున్నది ఎటు పోతుందో అర్థం కావడానికి, అసలు ఇందులో ఏముందో బోధ పడడానికి పతాక సన్నివేశం వరకు కూర్చోక తప్పని చాలా కాంప్లెక్స్ కథని రాసుకున్నాడు.
ఈ కథ విన్న నాని బౌల్డ్ అయి నిర్మాతగా మారిపోయాడంటేనే ప్రశాంత్ కథలో విషయం వుందనే సంగతి అర్థమవుతుంది. 'అ'యితే వచ్చిన చిక్కేమిటంటే… పతాక సన్నివేశం చూసిన తర్వాతే దర్శకుడి ప్రతిభని, ఆలోచనని మెచ్చుకుంటారెవరైనా. అంతవరకు చూసిన దాంట్లో 'అ'ద్భుతమనిపించేవి, 'అ'మోఘమనేట్టు చేసేవాటి కంటే 'అ'యోమయానికి గురి చేసేవి, 'అ'ర్థంలేనట్టు కనిపించేవే ఎక్కువ.
ఈ కథ మొత్తం పతాక సన్నివేశం మీద బేస్ అయి నడుస్తుంది. అప్పుడిచ్చే ట్విస్టుతో 'అ!' అంటూ షాక్ అయిపోతారు కనుక అంతకుముందు ఏం తీసినా చెల్లిపోతుందన్నట్టు ఆలోచనలకి రెక్కలు తొడిగి నేల విడిచి సాము చేయించారు. అసలేంటిది?, ఎందుకిది? అని రేకెత్తిన సందేహాలన్నిటికీ ఆ ట్విస్టులోనే సమాధానం చెప్పారన్నట్టుగా, 'ఊహ'లకి లాజిక్కులుండవనేదే సమాధానం అనుకోవాలి.
చూసిన వారందరూ ఈ ఆలోచనతో ఏకీభవించకపోవచ్చు కానీ మేథావి వర్గం మాత్రం ఈ యువ దర్శకుడి వినూత్న ఆలోచనలకి చిన్నపాటి ప్రశంస అయినా ఇచ్చి తీరుతుంది. ఒక వర్గం నుంచి తన ఐడియాతో మార్కులు స్కోర్ చేసేసిన ప్రశాంత్… ఆ ఐడియాని రివీల్ చేయడానికి ముందు చూపించినది మాత్రం అంత ఆసక్తి రేకెత్తించదు.
అయిదారు ఉప కథలున్న ఈ చిత్రంలో ఒకట్రెండు కథలు ఆసక్తికరంగా అనిపించినా కానీ చాలా వరకు గజిబిజి, గందరగోళంగా సాగుతుంటాయి. హారర్, థ్రిల్లర్, ఫాంటసీ, కామెడీ… ఇలా వివిధ జోనర్లని మిక్స్ చేసుకుంటూ తన అసలు కథ బయట పెట్టే వరకు దర్శకుడు గారడీ చేసాడు. చేప, చెట్టు మాట్లాడడం దగ్గర్నుంచి, దేవుడు-దెయ్యం వరకు తన 'ఊహా' ప్రపంచంలో దేనినీ విడిచి పెట్టలేదు.
షార్ట్ ఫిలిం మేకర్స్‌లో కనిపించే మరో లక్షణం… మెసేజ్ ఇవ్వడం. ఆడపిల్లలపై జరిగే లైంగిక దాడులపై అంతర్లీనంగా సమాజానికో స్ట్రాంగ్ మెసేజ్ కూడా వుందిందులో. ఇలాంటి మెచ్చుకోతగ్గ అంశాల మధ్య 'టైమ్ ట్రావెల్' కాన్సెప్ట్నే ఇంకాస్త కన్ఫ్యూజింగ్గా మారుస్తూ శ్రీని అవసరాల త్రెడ్, 'ఉత్తమ మాయగాడు' అంటూ మ్యాజిక్ పేరిట మురళి శర్మ త్రెడ్ లాంటివి అసలే కాంప్లికేటెడ్‌గా వున్న కాన్సెప్ట్ బోధపడడం ఇంకాస్త జఠిలం చేస్తాయి.
ఈ వివిధ కథల సమాహారాన్ని విసిగించకుండా నడిపించడానికి దర్శకుడు తెలివైన రూట్ ఎంచుకున్నాడు. చేపగా నాని, చెట్టుగా రవితేజ ఇచ్చిన గాత్రధారణ… వారికి రాసిన సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ఇద్దరూ తెరపై కనిపించకపోయినా కానీ వాళ్ల 'ప్రెజెన్స్' తెలిసేట్టు చేయడంతోనే వారి టాలెంట్ ఇంకోసారి తెలుస్తుంది. ముఖ్యంగా చెట్ల ప్రాముఖ్యత గురించి ఫన్నీగా రవితేజ తనదైన శైలిలో చెప్పే సుదీర్ఘమైన డైలాగ్ చప్పట్లు కొట్టిస్తుంది.
దర్శకుడి ఊహా ప్రపంచానికి జీవం పోస్తూ సంగీత దర్శకుడు, కళా దర్శకుడు, ఛాయాగ్రహకుడు ఇచ్చిన అవుట్‌పుట్ అద్భుతంగా వుంది. తెరపై తన పాత్రలని సజీవంగా నిలిపే టాలెంట్ వున్న నటీనటులు వుండడం మరో పెద్ద అడ్వాంటేజ్ అయింది. కాజల్, నిత్య, శ్రీని, మురళి శర్మ, రోహిణి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.
నటీనటవర్గం, సాంకేతిక వర్గం నుంచి మంచి అవుట్‌పుట్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ ఇలాంటి 'అవుట్ ఆఫ్ ది బాక్స్' ఐడియాని కన్విన్సింగ్‌గానే చెప్పగలిగాడు. అయితే కొత్తదనం పేరిట ఊహలకి రెక్కలు తొడగడం కాకుండా ఏకండా ఫ్లయిట్ ఎక్కించేసాడు. దీని వల్ల అతని ప్రయత్నానికి వచ్చే హర్షధ్వానాల కంటే అది సృష్టించిన గందరగోళం తాలూకు ఎఫెక్ట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది.
ముందే చెప్పినట్టు ఒక్కసారి కథ ఏమిటనేది తెలిసిన తర్వాత దర్శకుడి ప్రతిభ హైలైట్ అవుతుంది. కాకపోతే ఈ పాయింట్‌తో దర్శకుడిని మెచ్చుకునే వారి సంఖ్య తక్కువే వుంటుంది. మెజారిటీ ఆడియన్స్‌ని మెప్పించడంలో 'అ' సక్సెస్ కాకపోవచ్చు. ఐడియా బాగున్నా కానీ మెజారిటీ ప్రేక్షకులని మెప్పించేలా కాకుండా మరీ కాంప్లికేటెడ్‌గా కథని నడిపించడం దీని వ్యాపారానికి ప్రతిబంధకం కావచ్చు.
రొటీన్ మసాలాతో విసుగెత్తిపోయిన వారికి ఈ కొత్త తరహా సినిమా ఒకింత ఉపశమనం ఇస్తుంది. ఒక వినూత్నమైన, విచిత్రమైన ఆలోచనని వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా నిర్మాతగా వెనక వుండి నడిపించిన నాని అభిరుచికి 'అ'ద్దం పడుతుంది.
బాటమ్ లైన్: లిమిటెట్ 'అ'ప్పీల్!
– గణేష్ రావూరి