చూడబోతే మంత్రి ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు అండ్ కో బాగానే తలంటు పోసినట్టుంది. సర్కారు సీక్రెటుగా భావిస్తున్న వ్యూహాన్ని బయటపెట్టేసినందుకు ఆయన చాలా త్వరగానే నాలిక్కరుచుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. మార్చి 5వ తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్రమంత్రులు రాజీనామా చేసేయబోతున్నారని, అదేరోజున తమ పార్టీ మద్దతు కూడా ఉపసంహరించేసుకుంటుందని తొలుత ప్రకటించిన ఆయన వెంటనే మీడియాకు ఓ ప్రకటన పంపారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమే అని సెలవిచ్చారు.
ఈలోగానే ఆయనకు తలంటు కార్యక్రమం పూర్తయిందని ప్రజలు ఊహించుకుంటున్నారు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత కాస్తా.. మాట జారనేల.. దిద్దుపాటు పడనేల అన్నట్లుగా తయరైంది మంత్రి గారికి. ఇంతకూ ఆయన ప్రకటించడమూ, తర్వాత ఖండించడమూ ఎన్ని జరిగినప్పటికీ.. అసలు తెలుగుదేశం వాళ్లు రాజీనామాలు చేయడం అంటూ సాధ్యమేనా అనే అనుమానం కూడా ప్రజలకు లేకపోలేదు.
ఎందుకంటే.. మార్చి 5వ తేదీలోగా.. ఆంధ్రప్రదేశ్ కు అందించబోయే సాయం విషయంలో ఏదోఒక అధికారిక ప్రకటన కేంద్రం నుంచి రావడం మాత్రం తథ్యం. అలా.. కేంద్రనుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా అదే మహా ప్రసాదం అని.. దానిని తమ ఉద్యమాలే సాధించాయని టముకు కొట్టుకుంటూ.. ఆ రకంగా తెలుగురాష్ట్రం జనాల్ని మరోసారి మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ.. కూటమిలోనే కొనసాగిపోయి.. తమ తమ వ్యక్తిగత ప్రయోజనాలకు భంగం రాకుండా చూసుకోవడం అనేది తెలుగుదేశానికి ప్రథమ ప్రాధాన్యం అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
అయినా.. మార్చి 5న రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు, ఆ రకంగా కేంద్రానికి సంకేతం ఇవ్వదలచుకున్నట్లు… చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్ల సమావేశంలో వెల్లడించినప్పుడే.. చాలామంది మీడియా వారికి సంగతి లీక్ అయిపోయింది. కాకపోతే.. ఆఫ్ ది రికార్డ్ గా అందరితోనూ పంచుకోకుండా… బహిరంగంగా మాట్లాడినందుకే.. పాపం… మంత్రి ఆదినారాయణ రెడ్డి.. తన ప్రకటనని తానే ఖండంచుకోవాల్సి వచ్చింది..!