థియేటర్ ఫీడింగ్ కోసమేనా?

గత ఏడాదికి నూటా అరవైకి పైగా సినిమాలు విడుదలయ్యాయి. అంటే ప్రతివారం కనీసం మూడు సినిమాలకు పైనే అన్నమాట. వీటిలో బంపర్ హిట్ లు, సూపర్ హిట్ లు, హిట్ లు అన్నీ కలిపి…

గత ఏడాదికి నూటా అరవైకి పైగా సినిమాలు విడుదలయ్యాయి. అంటే ప్రతివారం కనీసం మూడు సినిమాలకు పైనే అన్నమాట. వీటిలో బంపర్ హిట్ లు, సూపర్ హిట్ లు, హిట్ లు అన్నీ కలిపి లెక్కపెట్టినా డజనకు మించి వుండవేమో? పోనీ కాస్త జనం గుర్తించారు అనుకునే సినిమాలు వదిలేసినా, అసలు ఎవరికీ తెలియకుండా ఇలా వచ్చి అలా పోయే సినిమాలు కనీసం వంద వరకు వుంటున్నాయి. 

రాను రాను సినిమాలు తెగ వస్తున్నాయి. కొన్ని సినిమాలు చూస్తుంటే పాపం, ఎందుకు తీస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే ప్రేక్షకుల అభిరుచి చూసుకోవాలి. నిర్మాత దన్ను, బయ్యర్ల మద్దతు ఇంకా చాలా వుండాలి. ఇవేవీ లేకుండా వదిలేస్తున్నారు. షోకి రెండు వేలు, మూడు వేలు వసూలు చేసి, ఓ వారం థియేటర్లలో వుండి వెళ్లిపోతున్నాయి. ప్రతి వారం ఇలాంటి సినిమాలు విడుదలవుతున్నాయి. అసలు కొన్నయితే విడుదల అవుతున్నాయా అన్నది కూడా తెలియడం లేదు. 

ఎంత కాదన్నా కోటి నుంచి రెండు కోట్లు లేకుండా సినిమా తయారు కాదు. కానీ కనీసం క్యూబ్ ఖర్చులు కూడా రాని సినిమాలే ఎక్కువగా వుంటున్నాయి. ఈవారం నాని అ… సినిమా, మహేష్ సోదరి మంజుల మనసుకు నచ్చింది సినిమాలు విడుదలవుతున్నాయి. ఈరెండింటికి కాస్త గట్టి బ్యాకింగ్ వుంది.

ఇవి కాక ఇంకో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. రచయిత అని ఓ సినిమా. ఈసినిమా నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. అలాగే సోడా గోలీ సోడా అనే మరో సినిమా కూడా విడుదలవుతోంది. ఇప్పటికే థియేటర్లలో తొలిప్రేమ, భాగమతి, ఛలో, వున్నాయి. గాయత్రి, ఇంటిలిజెంట్ పరిస్థితి రేపు తెలుస్తుంది.

ఇలాంటి టైమ్ లో ఇలా తామర తంపరగా సినిమాలు విడుదలవ్వడం వల్ల థియేటర్లకు అయితే బాగుంటోంది కానీ, నిర్మాతలకు కాదు. ఏదో ఫ్యాషన్ తో సినిమాలు తీసేస్తున్నారు. విడుదల కష్టాలు, విడుదల తరువాతి వ్యవహారాలపై అవగాహన వుండడం లేదు. దాంతో పెట్టిన పెట్టుబడి గోడకు వేసిన సున్నంలా వుంటోంది.

ఒక్కో వారం అయితే అరడజను చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. అవన్నీ ఎక్కడ విడుదలవుతున్నాయో కూడా తెలియదు. కొన్ని సీ సెంటర్లలో కనిపించిన పోస్టర్లు బి సెంటర్లలో కనిపించవు. కొన్ని బి, సి సెంటర్లలో కనిపించే పోస్టర్లు ఏ సెంటర్లలో కనిపించవు. కొన్ని పోస్టర్లు చూస్తే ఎప్పుడు తీసారో? ఎప్పుడు వేసారో?ఎప్పుడు తీసేసారో కూడా తెలియదు. థియేటర్లు రాను రాను పెరుగుతున్నాయి. సినిమాలు కూడా పెరుగుతున్నాయి. కనీసం పోస్టర్ ఖర్చులు తెచ్చుకోని సినిమాల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది.