ప్లాన్ ప్రకారం విశాఖకు అన్యాయం

రాష్ట్ర విభజన జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా వెల్ ప్లాన్డ్ గా ఒక్కో సంస్థను కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించడం ప్రారంభించింది. రాజధానినే అక్కడ ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రాంతంలో అనుకున్న…

రాష్ట్ర విభజన జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా వెల్ ప్లాన్డ్ గా ఒక్కో సంస్థను కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించడం ప్రారంభించింది. రాజధానినే అక్కడ ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రాంతంలో అనుకున్న ఎయిమ్స్ ను మంగళగిరికి మార్చారు. ఇలా అన్నీ కృష్ణ, గుంటూరు జిల్లాలకు స్మూత్ గా మారుస్తూ వచ్చారు. 

అప్పట్లోనే విజయవాడ రైల్వేజోన్ అన్న సన్నాయి నొక్కలు ప్రారంభమయ్యాయి. విశాఖ రైల్వేజోన్ అంటే ఒరిస్సా అంగీకరించడం లేదు కాబట్టి, అటు రాయలసీమలోని గుంతకల్ ప్రాంతం నుంచి ఇటు విశాఖ వరకు ఓ జోన్ చేసి, దాన్ని సెంట్రల్ గా విజయవాడను కేంద్రం చేయాలన్న ప్రతిపాదనను అప్పట్లో ఒకరిద్దరు తెలుగుదేశం ఎంపీలు వెలిబుచ్చారు. దానిపై విశాఖ జనాలు మండిపడ్డారు కూడా. అప్పట్లో తెలుగుదేశం అనుకూల మీడియా ఈ ప్రతిపాదన మంచిదే అనే టైపులో వార్తలు కూడా వండివార్చింది.

ఇప్పుడు మళ్లీ దాన్నే తెరపైకి తీసుకువచ్చి, కేంద్రం చేత ఆ ప్రతిపాదనను చేయించి, తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించినట్లు సీన్ క్రియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు రైల్వేజోన్ రాకపోవడం కన్నా, విజయవాడ జోన్ అయినా మంచిదే అన్నప్రచారం ఇకపై తెలుగుదేశం ప్లస్ బెజవాడ అనుకూల మీడియా ప్రారంభిస్తుంది.

అస్సలు లేనిదానికన్నా, ఏదో ఒకటి మంచిది కదా అనే భావన తీసుకువచ్చి, జనాల చేత బలవంతంగా మమ అనిపించేస్తారు. ఆ విధంగా విజయవాడ ప్రాంతానికే అన్నీ పంపేయడం విజయవంతంగా పూర్తవుతుంది. విశాఖ వాసులకు డిమాండ్ మాత్రమే మిగుల్తుంది.

ఎందుకంటే విశాఖ తరపున పూర్తిగా గొంతెత్తేవారు లేరు కదా? ఎందుకంటే అక్కడి ప్రజాప్రతినిధులంతా తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని కృష్ణ, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వలస వచ్చి, అక్కడ వ్యాపారాలు ప్రారంభించి, ఆపై ప్రజాప్రతినిధులు అయినవారే కదా? మిగిలిన ఒకరిద్దరి గొంతు ఎవరు వినిపిస్తారు?