ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్ విభాగంలోనే కొనసాగిన షియోమీ సంస్థ ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలోకి కూడా ప్రవేశించింది. స్మార్ట్ ఫోన్ల విభాగంలో శాంసంగ్ కు గట్టిపోటీనిచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు స్మార్ట్ టీవీ విభాగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్ లో కూడా కొరియాకు చెందిన శాంసంగ్ కు గట్టిపోటీనిస్తూనే సోనీని కూడా టార్గెట్ చేసింది షియోమీ.
భారత్ లో తన మొట్టమొదటి స్మార్ట్ టీవీ “ఎమ్ఐ ఎల్ఈడీ టీవీ-4″ను ఆవిష్కరించింది చైనాకు చెందిన షియోమీ. దీని ప్రారంభ ధరను 40వేల రూపాయలుగా నిర్ణయించింది. ప్రస్తుతం భారత్ లో అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులో ఉన్న 80వేల రూపాయల ఖరీదైన టీవీల్లో ఉన్న ఫీచర్లన్నీ ఈ 40 వేల రూపాయల ఎంఐ స్మార్ట్ టీవీలో ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచంలోనే అత్యంత పల్చటి (సన్నటి) టీవీ ఇదే.
అయితే స్మార్ట్ టీవీ విభాగంలో షియోమీ సంస్థ, భారతీయుల్ని నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే మొబైల్స్ రంగంలో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు అందించి ధరల యుద్ధానికి తెరదీసింది షియోమీ. దీని దెబ్బకు శాంసంగ్ తో పాటు మిగతా అన్ని కంపెనీలు తమ మొబైల్ ఫోన్ల ధరలు తగ్గించాయి.
సరిగ్గా ఇదే పోటీ స్మార్ట్ టీవీ విభాగంలో కూడా వస్తుందని భారతీయులు భావించారు. దాదాపు 20-25వేల రూపాయల రేంజ్ లో మంచి ఫీచర్లు, పెద్ద ఎల్ఈడీ తెర, హై-రిజల్యూషన్ తో స్మార్ట్ టీవీ అందుబాటులోకి వస్తుందని ఆశించారు. కానీ షియోమీ మాత్రం ధర కంటే ఫీచర్లపైనే ఎక్కువగా దృష్టిపెట్టింది. అయినప్పటికీ ఆ ఫీచర్లు అందిస్తున్న ఇతర కంపెనీ టీవీలతో పోల్చుకుంటే, షియోమీ స్మార్ట్ టీవీ రేటు తక్కువే.