తిట్టినోళ్లను అందలం ఎక్కించిన జగన్

రాజకీయ నాయకులు చాలా మంచోళ్ళు. వారికి చాలా విశాల హృదయం ఉంటుంది. ప్రయోజనం ఉందనుకుంటే శత్రువులను కూడా చేరదీస్తారు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. శత్రుత్వాన్ని తొందరగా మర్చిపోతారు. మొహం మీద ఉమ్మేసినా, బండబూతులు తిట్టినా అన్నీ…

రాజకీయ నాయకులు చాలా మంచోళ్ళు. వారికి చాలా విశాల హృదయం ఉంటుంది. ప్రయోజనం ఉందనుకుంటే శత్రువులను కూడా చేరదీస్తారు. రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. శత్రుత్వాన్ని తొందరగా మర్చిపోతారు. మొహం మీద ఉమ్మేసినా, బండబూతులు తిట్టినా అన్నీ మర్చిపోయి కడుపులో పెట్టుకుంటారు. కాలం కలిసొస్తే అంటే అధికారంలోకొస్తే అందలం ఎక్కిస్తారు.

ఇందుకు భిన్నంగా పార్టీకి, అధినేతగా విధేయంగా ఉన్నవారికి ఎలాంటి ప్రయోజనం దక్కదు. వారికి పదవులు రావు. పాపం వారు విధేయులేగానీ రాజకీయ సమీకరణాల్లో, కులాల కూడికలు, తీసివేతల్లో వారిని పక్కకు పెట్టేస్తారు. వారు సమర్థులు కావొచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాలకు పనికిరారు. రాజకీయ చదరంగంలో ఎవరు అడుగుకు పడిపోతారో, ఎవరు అందలం ఎక్కుతారో చెప్పలేం.

ఇంత చెప్పుకునేది ఎందుకంటే … ఏపీలో తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం వైసీపీలో మాత్రం అసంతృప్తి పేరుకు పోయంది. ప్రత్యర్థి పార్టీలో ఉండి అధినేతపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఆ తరువాత పార్టీ మారి వచ్చిన వారికి కీలక పదవులు దక్కడంపై పలువురు నేతలు తమ ఆగ్రహాన్ని సైలెంటుగా వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచీ పార్టీలో ఉండి.. అధినేతకు విధేయంగా మెలిగిన వారిని కాదని, పార్టీ మారి వచ్చిన వారికి పదవుల అందలాలు దక్కడం పట్ల అంతర్గత సంభాషణల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు అయితే పార్టీ కార్యక్రమాలలో నామమాత్రంగా పాల్గొంటున్నారు. కొందరు ఇంచు మించు సైలెంట్ అయిపోయారు.

తొలి మంత్రి వర్గంలో బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబులకు కీలక పోర్ట్ పోలియోలు కేటాయించారు. వారిరువురూ కూడా గతంలో జగన్ పై విమర్శనాస్త్రాలూ, వ్యంగ్యాస్త్రాలూ సంధించినవారే. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ సీఎం జగన్ అదే సూత్రాన్ని పాటించారు. తన కేబినెట్ లో కీలక పదవులలో నియమించిన ముగ్గరు మహిళా మంత్రులూ ఒకప్పుడు తననూ, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డినీ విమర్శించిన వారే. జగన్ తన కేబినెట్ లో కీలక పోర్టు పోలియోలు కేటాయించిన ముగ్గురు మహిళలూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరిన వారే.

ఆ ముగ్గురూ ఆర్కే రోజా, విడదల రజనీ, తానేటి వనితలు. 

వారు గతంలో జగన్ పై విమర్శలను ఇప్పుడు వైసీపీ నాయకులు (ఒరిజినల్ నాయకులు) గుర్తు చేసుకుని ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవ్వడమంటే ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ముగ్గురు మహిళా మంత్రులూ కూడా తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరించిన వారే. పసుపు కండువా కప్పుకుని జగన్ పై నిప్పులు చెరిగిన వారే. ఆ తరువాత పార్టీ మారి ఫ్యాన్ గాలికి సేదతీరుతున్నవారే. 

కేబినెట్ లో తానేటి వనితకు కీలకమైన హోంశాఖ, విడదల రజనికి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్కే రోజాకు పర్యాటక శాఖ దక్కిన సంగతి తెలిసిందే కదా. వీరిలో తానేటి వనిత 2009లో పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే మూడేళ్లలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరారు.

2014 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జవహర్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

జగన్ తొలి కేబినెట్ లో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేసిన తానేటి వనతి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రమోషన్ పొంది హోం మంత్రి అయ్యారు. ఇక విడదల రజనీ విషయానికి వస్తే.. 2018లో ఇలా జగన్ పార్టీలో చేరి.. అలా ఎమ్మెల్యే టికెట్ అందుకొని చిలకలూరి పేట ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 

విడదల రజినీ 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం తరఫున చురుకుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత జగన్ పై విమర్శల బాణాలను గురిపెట్టారు. అప్పట్లో జగన్‌పై విడదల రజినీ విమర్శల నిప్పులు చెరిగారు. ఆ తరువాత నాలుగేళ్ల లోనే వైసీపీ గూటికి చేరారు. తాను అంతగా విమర్శించిన జగన్ చేతుల మీదుగా పార్టీ టికెట్ అందుకుని అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని సాధించారు. ఇక రాజకీయ నాయకురాలిగా మారిన నటి ఆర్కే రోజా జగన్ పై చేసిన విమర్శల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆమె ప్రత్యేకత ఏమిటంటే … టీడీపీలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎంతగానే తిట్టారో, వైసీపీలో చేరాక చంద్రబాబును అంతకంటే ఎక్కువగా తిట్టారు. ఏ పార్టీలో ఉన్నా రోజా చెలరేగిపోతుంటుంది. అధినేతనూ అదేవిధంగా ప్రశంసిస్తుంది. ఆర్కే రోజా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలి హోదాలో జగన్ రెడ్డిపైనే కాదు, ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఆ తరువాత కొద్దికాలానికే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కాంగ్రెస్ లో ఆమె ఉన్నది చాలా కొద్ది కాలమే.

ఆ కొద్ది కాలం కూడా ఆమె ఉనికి కాంగ్రెస్ లో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఆ తరువాత రోజా జగన్ తో పాటే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో వైసీపీ విపక్షానికే పరిమితం అయ్యింది. ఆర్కే రోజా మాత్రం నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో తెలుగుదేశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆమె విమర్శలన్నీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు టార్గెట్ గానే ఉండటంతో జగన్ ఆమెను బాగా ప్రోత్సహించారు.

2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినా జగన్ తొలి కేబినెట్ లో ఆమెకు స్ధానం దక్కలేదు. ఆమె జగన్ మీద కోపం తెచ్చుకోవడంతో శాంతింప చేయడానికి ఏపీ ఐఐసీసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఆమె ఏనాడు చిత్తశుద్ధితో ఆ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. ఇక తాజా కేబినెట్ విస్తరణలో రోజాకు కీలకమైన పర్యాటక శాఖ మంత్రిగా పదవి దక్కింది. మొత్తం మీద టీడీపీలో ఉన్నప్పుడు ఆయన్ని తిట్టినోళ్లంతా మంత్రులయ్యారు. ఇక్కడ మనం చెప్పుకునేది జగన్ ఒక్కడి గురించేకాదు. చంద్రబాబు కూడా మినహాయింపు కాదు. పార్టీల అధినేతల తీరే ఇంత. మరి మనుగడ సాగించాలంటే ఇలాంటి సర్దుబాట్లు తప్పవు.