రివ్యూ: ఇంటిలిజెంట్
రేటింగ్: 1.5/5
బ్యానర్: సికె ఎంటర్‌టైన్‌మెంట్స్
తారాగణం: సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాజర్, రాహుల్ దేవ్, దేవ్ గిల్, సప్తగిరి, బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్ధి, సయాజీ షిండే తదితరులు
కథ, మాటలు: ఆకుల శివ
కూర్పు: గౌతంరాజు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఎస్. విశ్వేశ్వర్
నిర్మాత: సి. కళ్యాణ్
కథనం, దర్శకత్వం: వివి వినాయక్
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2018
ఇంటర్నేషనల్ ఫ్లయిట్‌లో ట్రావెల్ చేస్తున్న ఒకడిని కిడ్నాప్ చేయాలి. దానికోసం ఒక డ్రోన్‌ని రన్‌వే మీదకి పంపిస్తే ఏదో ప్రమాదం వుందని భావించి ఫ్లయిట్‌ని వేరే విమానాశ్రయానికి పంపించేస్తారు. అంతేకాదు… ఆ విమానం బ్యాక్‌గ్రౌండ్‌లో వుండగానే ఈ డ్రోన్‌ని గన్‌తో సెక్యూరిటీ షూట్ చేసేస్తారు!
ఇదేదో స్పూఫ్ సీన్ కాదు. 'ఇంటిలిజెంట్' సినిమాలోని ఒక ఇంటిలిజెంట్ సీన్ ఇది. మరో సీన్లో… ఒక వెబ్‌సైట్ రన్ చేస్తున్న హీరో ఆచూకీ కనిపెట్టడం కోసం హ్యాకర్లని రంగంలోకి దించుతాడు విలన్. దాంతో హీరో రకరకాల జంతువుల పేర్లు చెప్పి ఒక మనిషి ఫోటో తయారు చేయమంటాడు. బ్రహ్మానందం ఫోటో తయారవుతుంది. ఈ ఫోటోని ఆ హ్యాకర్స్‌కి పంపిస్తే వాళ్లు వాడికోసం గాలిస్తుంటారు. మనం మనపని చేసుకోవచ్చు అంటాడు హీరో. 'వాహ్ బ్రిలియంట్… శభాష్' అంటూ ఆ ఐడియాకి ఉబ్బితబ్బిబ్బయిపోతారు. ఇలాంటి తెలివితేటలు ఈ సినిమా నిండా కోకొల్లలు!
హీరో ఏం చేసినా కానీ 'వాడు తెలివిగా ఆలోచిస్తున్నాడు', 'వాడు ఇంటలెక్చువల్', 'వాడో ఇంటిలిజెంట్' అంటూ సైడ్ క్యారెక్టర్స్ అన్నీ ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారనే సంగతి గుర్తు చేస్తుంటాయి. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం కూడా ఇంటిలిజెంట్ ఐడియా అని అంటున్నారంటే… ఫేస్‌బుక్ వాడే వాళ్లంతా సైంటిస్టులే అనుకోవాలి. మామూలుగా డీసెంట్ రైటర్ అయిన ఆకుల శివ రచన ఈ సినిమాలో తన 'నటన' అంత గొప్పగా వుంది. అసలు ఈ సినిమాకి పనిచేసిన వారిలో ఎవరైనా కాస్త బుర్ర పెట్టారా లేక ఆకుల శివ ఏదిరాసిస్తే అదే మహా ప్రసాదం అంటూ తీసేసారా అనిపిస్తుంది.
యాక్షన్, కామెడీని మిక్స్ చేసి మాస్‌కి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్ ఇవ్వగల వినాయక్ ఈ చిత్రంలో తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ కాస్తయినా చూపించలేకపోయాడు. ఏ సీన్‌కి ఆ సీనే మరో దానితో సంబంధం లేకుండా వచ్చి అలా సుదీర్ఘంగా సాగిపోతూ వుంటుంది. ప్రతి కామెడీ సీన్ పది నిమిషాలకి పైగా నిడివితో 'నవ్వుతారా ఛస్తారా' అన్నట్టు మనం 'కట్' అంటే తప్ప ఆగదేమో అన్నట్టు నిరాటంకంగా సాగిపోతుంది.
అసలు కథేమిటంటే… ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులకి ఇస్తోన్న రాయితీలకి ఉన్నపళంగా బ్రేక్ వేయాలని, లేదంటే మిగతా కంపెనీలకి దానివల్ల నష్టం వస్తుందని మరో కంపెనీ వాళ్లు ఒక డాన్‌ని ఆశ్రయిస్తారు. దాంతో ఆ కంపెనీ తనకి రాసేయమని ఆ డాన్ సదరు ఓనర్‌ని కిరాతకంగా చంపేస్తాడు. దాంతో రగిలిపోయిన ఆ కంపెనీలోని ఉద్యోగి ధర్మాభాయ్‌గా అవతరిస్తాడు. ఆ డాన్‌ని దెబ్బతీయడానికి అతని అనుచరుల బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఖాళీ చేసేసి అతని దురాగతాన్ని బయటపెడతాడు.
ఈ కథలో ఏముందని అనుకుంటారని అనుకున్నారో ఏమో… అప్పట్లో న్యూస్‌లో వచ్చిన 'స్నేక్ గ్యాంగ్' సీన్‌ని ఇందులోకి బలవంతంగా ఇరికించారు. ఏం చేసినా కానీ రక్తి కట్టించలేని ఈ కథని వినాయక్ ఎలా ఓకే చేసారనేది అతనికే తెలియాలి. ఈ కథ వింటున్నపుడో, దానికి స్క్రీన్‌ప్లే రాస్తున్నపుడో, షూటింగ్ చేస్తున్నపుడో, లేదా పూర్తయ్యాక స్క్రీన్‌పై చూస్తున్నపుడో అయినా ఇదెంత దారీ తెన్నూ లేకుండా వుందో అర్థంకాలేదంటే ఆశ్చర్యమనిపిస్తుంది. పైగా అంతా చూసుకుని మరీ దీనికి 'ఇంటిలిజెంట్' అని నామకరణం చేసారంటే అది సెల్ఫ్ సెటైర్ అనుకోవాలో లేక సీరియస్‌గానే తెలివైన సినిమా అని ఫీలయ్యారనుకోవాలో అర్థంకాదు.
ఎంత బ్యాడ్ సినిమాలో అయినా ఒకటో రెండో హై పాయింట్స్ వుంటాయి. వినాయక్‌లాంటి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అంటే అలాంటి ఎలివేషన్లు, గ్రాఫ్‌ని పైకి తీసుకెళ్లే సీన్లు కొన్ని అయినా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ మొదలైన దగ్గర్నుంచి చివరి వరకు హై పాయింట్ అనిపించేది ఒక్కటీ లేకపోగా, నవ్వులపాలయ్యే సన్నివేశాలయితే లెక్కలేనన్ని పెట్టేసారు. విషయం లేదని బోధ పడడం వల్లేనేమో ప్రతి కామెడీ సీన్‌ని పొడిగించి అలాంటివి కనీసం అరడజను వుండేట్టు చూసుకున్నారు. అసలు కథలోనే ఒక్క తెలివైన సీన్ లేని సినిమాలో ఇరికించిన కామెడీ సీన్లు మాత్రం సవ్యంగా, నవ్యంగా ఎలా వుంటాయి చెప్పండి?
సాయిధరమ్ తేజ్ అయినా మరో హీరో అయినా ఇందులో చేయడానికంటూ ఏమీలేదు. కేవలం వినాయక్ చెప్పింది చేసుకుపోయినట్టున్నాడు. తన పరిధిలో తాను చేయగలిగిన డాన్సులతో అలరించినా కానీ నటుడిగా ఈ డొల్ల కథని నిలబెట్టడం తన శక్తికి మించిన పని కనుక ప్రేక్షకపాత్ర వహించాడు.
హీరోయిన్‌ని పాటలకి పరిమితం చేసారు. విక్కీభాయ్… అంటూ బిల్డప్ ఇచ్చిన విలన్‌ని ఇంటర్వెల్ సీన్లో ఇంట్రడ్యూస్ చేస్తే… పాపం ఇతనికి విటమిన్ టాబ్లెట్లు అవసరమనేంత వీక్‌గా వున్నాడు విలన్ రాహుల్ దేవ్. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, పృధ్వీ, దువ్వాసి… ఇలా అందరికీ చెరో సుదీర్ఘమైన కామెడీ సీన్ ఇచ్చేసారు. హీరోనే ఏమీచేయలేని సినిమాలో పాపం కమెడియన్లు మాత్రం ఏం చేయగలరు. చేతికిచ్చిన సీన్‌ని చేతనైనట్టు చేసిపోయారు.
సందర్భం కూడా లేకుండా ఇక్కడో పాట కావాలంటూ తమన్‌ని అడిగితే అతను మాత్రం ఏం చేస్తాడు. ఎక్కడో రిజెక్టెడ్ ట్యూన్లని ఇందులో పడేసినట్టున్నాడు. సెంటిమెంట్‌గా కలిసి వస్తుందని చిరంజీవి పాట రీమిక్స్ పెట్టేసారు. అంతోఇంతో విషయం వున్న సినిమాలో అయినా చిరంజీవి రీమిక్స్ వర్కవుట్ అవుద్ది కానీ సెంటిమెంట్‌గా పెట్టేసుకుంటే ఏమవుద్ది? ఎప్పుడైనా కీలకమైన సమయంలో వాడుకోవడానికి పనికొచ్చే బ్రహ్మాస్త్రం కూడా వేస్టయిపోయింది. విజువల్‌గా సైతం ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రంలో ఫైట్ సీన్లు మాత్రం ఒకింత మెప్పిస్తాయి.
అఖిల్‌తో వినాయక్ అంతగా డిజప్పాయింట్ చేసినపుడు 'బెనిఫిట్ ఆఫ్ డవుట్' ఇచ్చేసారు కానీ 'ఇంటిలిజెంట్'తో ఒక విషయం అయితే స్పష్టమైపోయింది. వినాయక్ డైరెక్షన్లో మునుపటి మెరుపులు లేవు. మాస్ పల్సు మీదున్న గ్రిప్పూలేదు. అన్నిటికీ మించి కథలో విషయం వుందో లేదో కనిపెట్టడం, తీస్తున్న సన్నివేశాలు దారి తప్పుతున్నాయనే సంగతి గ్రహించడం కూడా మిస్సింగ్. కొన్ని పవర్‌ఫుల్ హిట్లు ఇచ్చిన వినాయక్ కెరీర్లోని బ్యాడ్ ఫిలింస్‌లో ఫస్ట్ ప్లేస్‌కి స్ట్రాంగ్ కంటెండర్ ఇంటిలిజెంట్. వరుస ఫ్లాప్స్‌లో వున్న సాయిధరమ్ తేజ్ చేసిన మరో కాస్ట్‌లీ మిస్టేక్!
బాటమ్ లైన్: ఇంత తెలివి మన వల్లకాదండీ!
– గణేష్ రావూరి