రివ్యూ: గాయత్రి
రేటింగ్: 2.5/5
బ్యానర్: లక్ష్మీప్రసన్న పిక్చర్స్
తారాగణం: మోహన్‌బాబు, మంచు విష్ణు, శ్రియా శరన్, నిఖిలా విమల్, అనసూయ, శివప్రసాద్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, రఘుబాబు, బ్రహ్మానందం తదితరులు
కథ, మాటలు: డైమండ్ రత్నబాబు
కథనం: మోహన్‌బాబు
కూర్పు: ఎం.ఆర్. వర్మ
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
నిర్మాత: మోహన్‌బాబు
దర్శకత్వం: మదన్ రామిగాని
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2018
విలన్ పాత్రలని మోహన్‌బాబు ఎంతగా రక్తి కట్టిస్తారనే దానికి విశ్లేషణలు అక్కర్లేదు. విలక్షణ నటుడిగా కీర్తి గడించి ఎన్నో అద్భుతమైన పాత్రలని పోషించిన మోహన్‌బాబు చాలా కాలం తర్వాత మళ్లీ నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించడం 'గాయత్రి' చిత్రానికి ప్రధానాకర్షణగా మారింది. ఈ సినిమా మార్కెటింగ్‌కి, హైప్ బిల్డ్ చేయడానికి ఆ క్యారెక్టరే బాగా పనికొచ్చింది. టైటిల్ కూడా ఆ క్యారెక్టర్ పేరునుంచే పుట్టింది. అయితే విచిత్రంగా ఈ కథ ఆ క్యారెక్టర్ చుట్టూ నడిచేది కాదు.
ఇది ఒక స్టేజీ ఆర్టిస్టు అయిన శివాజీ (మోహన్‌బాబు) కథ. స్టేజ్ ఆర్టిస్ట్‌గా కుటుంబాన్ని పోషించలేక చిన్న చిన్న నేరాల్లో ఇరుక్కున్న వారికి బదులుగా వారి గెటప్‌లో వెళ్లి జైల్లో గడిపి వస్తుంటాడు. ఆ వచ్చిన డబ్బులతో తానొక ఆశ్రమాన్ని నడుపుతూ వేరే శరణాలయాలకి కూడా సాయం చేస్తుంటాడు. కంటిచూపుకి కూడా నోచుకోని కన్న కూతురు (నిఖిల) కోసం ఎదురు చూస్తుంటాడు.
తండ్రి గురించి నిజం తెలియని ఆమె అతడిని ద్వేషిస్తుంటుంది. అతని మంచితనం తెలుసుకునే సరికి శివాజీని గాయత్రి పటేల్ (మోహన్‌బాబు) అనే క్రిమినల్ కిడ్నాప్ చేస్తాడు. తనకి బదులుగా ఒక కేసులో తన వేషంలో వెళ్లమని బెదిరిస్తాడు. గత్యంతరం లేని పరిస్థితిలో శివాజీ అతని గెటప్‌లో జైలుకెళతాడు. ఆ కేసులో ఉరిశిక్ష విధిస్తారు. మరి అక్కడ్నుంచి శివాజీ ఎలా బయటపడతాడు?
మార్కెటింగ్‌లో అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన టైటిల్ రోల్ సెకండ్ హాఫ్‌లో సగమయ్యాక కానీ ఎంటర్ అవదు. అంతవరకు చూపించేదంతా కూడా ఎనభైల కాలం నాటి సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామాలని తలపిస్తుంది. గెటప్స్ మార్చుకుని నేరాలు ఒప్పుకునే యాంగిల్ బాగున్నా కానీ దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌ని పండించడం మీదే దృష్టి పెట్టడం వల్ల మిగతా అంశాలకి స్పేస్ లేకుండా పోయింది.
ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా డ్రామాని తలపిస్తూ సాగే కథ ఎమోషనల్ బ్లాక్‌తో ఇంటర్వెల్‌కి చేరుతుంది. అటుపై శివాజీ (యంగ్ ఏజ్ క్యారెక్టర్‌లో విష్ణు నటించాడు) లవ్‌స్టోరీ (శ్రియతో), నాటకాల్లో అతని ప్రావీణ్యం తదితర అంశాల గురించి సవివరమైన ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ప్రేమకథలో ఆకట్టుకునే అంశాలేం లేకపోగా, డ్రామా కూడా అంతగా పండలేదు. పుణ్యకాలం అంతా వృధా అయిపోయిన తర్వాత కానీ గాయత్రి పటేల్‌గా విలన్ మోహన్‌బాబు ఎంటర్ కాడు.
ఆ పాత్రలో తన ఆహార్యం, వాచకం ఇన్‌స్టంట్‌గా మెప్పిస్తాయి. మోహన్‌బాబు నట ప్రావీణ్యం తెలియని ఈతరం వారికి ఈ పాత్ర ద్వారా ఆయనలోని విలక్షణ నటుడిని చూసే అవకాశం దక్కుతుంది. అయితే మోహన్‌బాబు ఇంతకంటే గొప్ప పాత్రలనే పలు సినిమాల్లో పోషించడం వల్ల ఈ పాత్ర బాగున్నప్పటికీ ఒక ల్యాండ్‌మార్క్ రోల్ అని మాత్రం అనిపించదు. క్లయిమాక్స్‌కి ముందు వచ్చే సన్నివేశాల వరకు కథనం ఆసక్తిగా నడుస్తుంది. చివర్లో రేకెత్తించిన ఆసక్తిని మొదట్నుంచీ మెయింటైన్ చేసినట్టయితే, గాయత్రి పటేల్ కోణంలోనే కథ నడిపించినట్టయితే ఇది రసవత్తరంగా మారేది.
'ఎం. ధర్మరాజు ఎంఏ' చిత్రంలో మోహన్‌బాబు పోషించిన పాత్రకి ధీటైన సత్తా వున్న క్యారెక్టరైజేషన్ అయినా కథని శివాజీ లాంటి ప్యాసివ్ క్యారెక్టర్ నేపథ్యంలో నడిపించడం వల్ల కొత్తదనానికి ఆస్కారం లేకుండాపోయింది. అదీ కాక ఈ జనరేషన్ వాళ్లకి నచ్చని ఓవర్ సెంటిమెంటల్ డ్రామాగా తయారైంది. దర్శకుడు మదన్ టేకింగ్ కూడా మోహన్‌బాబు పాత సినిమానేదో చూస్తోన్న భావన కలిగేట్టు చేస్తుంది. సాంకేతికంగా కానీ, నెరేషన్ పరంగా కానీ ముప్పయ్యేళ్ల నాటి పోకడలు ఎక్కువ కనిపిస్తాయి.
ఈ చిత్రానికి మోహన్‌బాబు నటనే మెయిన్ హైలైట్. శివాజీ పాత్రలో కరుణ రసాన్ని హృద్యంగా పండించిన మోహన్‌బాబు గాయత్రి పటేల్ పాత్రలో తనదైన మార్కు విరుపులతో అదరగొట్టారు. ఈ పాత్ర నిడివి తక్కువ వుండడం మాత్రం నిరాశ కలిగిస్తుంది. విష్ణు కనిపించేది కాసేపే అయినా తన పరిధిలో బాగానే చేసాడు. శ్రియ కూడా అంతే. కీలక పాత్రలో నిఖిలా విమల్ కూడా మెప్పించింది. అనసూయ, శివప్రసాద్ సహాయక పాత్రల్లో కనిపించారు.
తమన్ తన రొటీన్ శైలికి భిన్నమైన అవుట్‌పుట్ ఇచ్చిపప్పటికీ ఒకట్రెండు పాటలతో మెప్పించాడు. సంభాషణలు అక్కడక్కడా ఆకట్టుకున్నా కానీ కన్సిస్టెన్సీ లేదు. దర్శకుడు మదన్ పాత పోకడలే చూపించాడు తప్ప ట్రెండుకి తగ్గట్టు ప్రోడక్ట్‌ని తీర్చిదిద్దలేకపోయాడు. పాత తరహా సెంటిమెంట్ డ్రామాలని ఇష్టపడే వారిని ఈ చిత్రం కొంతమేర మెప్పించవచ్చు. లేదంటే గాయత్రి పాత్రలో మోహన్‌బాబు నటన మినహా ఈ చిత్రంలో చెప్పుకోతగ్గ అంశమేం లేదు.
కాకపోతే మాస్ ఎంటర్‌టైనర్ల పేరిట వస్తోన్న తల తోక లేని సినిమాల మధ్య ఒక కథని పద్ధతి ప్రకారం చెప్పుకుంటూ వెళ్లిన విధానం దీనికి మార్కులేయిస్తుంది. ఎలాంటి కథ చెప్పినా కానీ బేసిక్స్ పాటించడం విస్మరించకూడదని ఇది ఓల్డ్ స్కూల్ స్టయిల్లోనే చాటి చెప్తుంది. ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయే సామర్ధ్యం వున్న స్టోరీ లైన్ అయినా కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడానికి సాహసించకపోవడం ఈ గాయత్రిని సగటు ఆరు పాటలు, ఆరు ఫైట్ల ఛట్రంలోకి ఇరికించేసింది.
బాటమ్ లైన్: నటప్రపూర్ణ వన్ మ్యాన్ షో!
– గణేష్ రావూరి