ఈరోజుల్లో 'స్మార్ట్'గా లేనివారు ఎవ్వరూ కనబడరు. కూలి పని చేసుకునేవారి నుంచి కార్పొరేట్ కంపెనీ అధిపతి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో స్మార్ట్‌గా ఉంటున్నారు. నిరక్షరాస్యుల నుంచి అత్యున్నత చదువులు చదువుకున్నవారివరకు స్మార్ట్‌గా ఉంటున్నారు. అలా లేనివారిని వింతగా చూస్తున్నారు. స్మార్ట్‌గా ఉండటమంటే సున్నితంగా ఉండటమా? అందంగా, నాజూకుగా ఉండటమా? అదేం కాదండీ…అందమైన, ఖరీదైన స్మార్ట్ మొబైల్ ఫోన్ కలిగి ఉండటమని అర్థం.
సెల్‌ఫోన్ మన జీవితంలోనే కాదు, శరీరంలోనూ భాగమైపోయింది. తిండి లేకుండా గడపొచ్చేమోగాని మొబైల్ లేకుండా గడపడం సాధ్యం కావడంలేదు. కొన్ని పనులు దాని ద్వారానే తప్పనిసరిగా చేయాల్సివస్తున్నందున దానికి దూరంగా ఉండటం కష్టంగా ఉంది.
ఎవ్వరి తోడూ లేకపోయినా సెల్‌ఫోన్ దగ్గరుంటే చాలు హాయిగా గడిపేయొచ్చనే భావనలో జనం ఉన్నారు. రోజు కూలీల దగ్గరే ఓ మోస్తరు ఖరీదైన సెల్‌ఫోన్ ఉన్నప్పుడు ఓ పెద్ద దేశాన్ని పరిపాలించే అధ్యక్షుడి దగ్గర ఉండదా? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు 'తప్పనిసరిగా లక్షల ఖరీదైన ఫోన్ ఉంటుంది'..అని చెబుతారు ఎవరైనా.
కాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పేది వింటే మనం డంగైపోతాం. 'ఈనాటికీ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు' అని పుతిన్ తాజాగా ఓ సమావేశంలో చెప్పారు. ప్రతి ఒక్కరి చొక్కా జేబులోనో, ప్యాంటు జేబులోనో స్మార్ట్ ఫోన్ ఉంటుందని, కాని తన దగ్గర ఏమీ లేదని అన్నారు. ఇంతేకాదు, ఏ సామాజిక మాధ్యమంలోనూ (ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వగైరా) లేరు.
మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా చాలామంది నాయకులకు, ఇతర రంగాల్లోని ప్రముఖులకు సోషల్ మీడియా ఖాతాలున్నాయి. ఇందుకు పుతిన్ వ్యతిరేకంగా ఉండటం ఆశ్చర్యమే. గతంలో ఓసారి పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ ఎప్పుడైనా ఇంటర్నెట్, కొద్దిగా తీరిక ఉంటే ఇన్స్టాగ్రామ్వంటివి చూస్తుంటానని పుతిన్ చెప్పారు. ఏదైనా అవసరమైతే తప్ప వాటి జోలికి వెళ్లనన్నారు. ఈ కాలంలో పుతిన్ వంటి దేశాధ్యక్షుడు ఉండటం అరుదే కాదు, వింత కూడా.