దిల్ రాజు అజ్ఞాతవాసి లెక్క తేలింది

టాలీవుడ్ లో హారిక హాసిని బ్యానర్ కు ఓ వాల్యూ వుంది. దాని అధినేత చినబాబు (రాధాకృష్ణ)కు మంచి పేరు వుంది. అజ్ఞాతవాసి సినిమా అంత దారుణ పరాజయం అయిన తరువాత ఒక్క బయ్యర్…

టాలీవుడ్ లో హారిక హాసిని బ్యానర్ కు ఓ వాల్యూ వుంది. దాని అధినేత చినబాబు (రాధాకృష్ణ)కు మంచి పేరు వుంది. అజ్ఞాతవాసి సినిమా అంత దారుణ పరాజయం అయిన తరువాత ఒక్క బయ్యర్ కూడా బహిరంగంగా గొంతు ఎత్తలేదంటే కారణం చినబాబు మీద వున్న గౌరవమే.

ఎన్నో భయంకరమైన డిజాస్టర్లు వున్నాయి టాలీవుడ్ లో. అలా ఫ్లాపులు వచ్చినపుడల్లా హీరో కొంత మొత్తం వెనక్కు ఇచ్చారని వదంతులే తప్ప ఇచ్చింది లేదు. ఇప్పుడు అజ్ఞాతవాసి కూడా అంతే. దాంతో ఏ నిర్మాత కూడా వెనక్కు డబ్బులు ఇచ్చిన సంఘటనలు లేవు.

అఖిల్ సినిమా టైమ్ లో డైరక్టర్ వినాయక్ మాత్రం కొంత మొత్తం వెనక్కు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అలా వెనక్కు ఇచ్చిన మరో డైరక్టర్ లేరు. 

వర్తమానానికి వస్తే, అజ్ఞాతవాసి అక్కౌంట్లు సెటిల్ చేసి, తమ శక్తి మేరకు బయ్యర్లను ఆదుకునే ఆలోచన చినబాబు చేస్తున్నారని ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. సినిమా విడుదలైన నెల రోజుల్లోనే అన్నీ సెటిల్ చేసే ఆలోచన చేస్తున్నారన్నది ఆ వార్తలు సారాశం.

ఈమేరకు ఒక్కో ఏరియా లెక్కలు తేలుస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కలు తేల్చి, నష్టం లెక్క కట్టి, తాము ఎంత ఆదుకోగలం అన్నది హారిక హాసిని సంస్థ క్లియర్ చేస్తోంది. ఆ మేరకు ముందు అక్కౌంట్ సెటిల్ చేస్తారు. ఆపై వన్ బై వన్ అమౌంట్ సెటిల్ మెంట్ లు కావాలంటే చేయడం లేదూ, తరువాత సినిమాలకు అడ్వాన్స్ లు గా వుంచమంటే వుంచడం వంటి కార్యక్రమం మొదలెడతారని తెలుస్తోంది.

తొలుతగా నైజాం అక్కౌంట్ సెటిల్ అయిందని, 7కోట్లు దిల్ రాజుకు వెనక్కు ఇవ్వాలని ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. మొత్తం రాబడి, ఖర్చులు పోను నష్టం 14కోట్లుగా దిల్ రాజు లెక్క చూపించినట్లు తెలుస్తోంది. అందులో సగం భరించడానికి చినబాబు అంగీకరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇప్పటకిప్పుడు క్యాష్ రూపంలో చెల్లిస్తారా? లేక ప్రస్తుతానికి రికార్డుల్లో వుంచుతారా? అన్నది ఇంకా తెలియాల్సివుంది.