అఖిల్ మొదటి సినిమా ఫ్లాప్ అయినపుడు రెండవ చిత్రంపై చాలా శ్రద్ధ తీసుకున్నారు. కథ ఓకే చేయడానికే సంవత్సరం పైగా సమయం తీసుకుని, సరయిన ప్రాజెక్ట్ సెట్ అయ్యే వరకు వేచి చూసారు. ఎన్నో కథలు విన్న తర్వాత 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన కథకి ఓకే చెప్పారు. ఒక మామూలు కథకే చిన్న ట్విస్ట్ ఇచ్చి 'హలో' చిత్రాన్ని విక్రమ్ తనదైన శైలిలో తెరకెక్కించాడు.
హలో చిత్రం బాగుందనే టాక్ తెచ్చుకున్నప్పటికీ 'ఎంసిఏ' ధాటికి నిలబడలేకపోయింది. ఇగోకి పోయి క్లాష్‌కి సై అనడంతో కొత్త హీరో అయిన అఖిల్ చిత్రానికి సెకండ్ ఇంపార్టెన్స్ దక్కింది. ఊపు మీదున్న నాని, దిల్ రాజులు భారీ వసూళ్లు రాబట్టుకోగా, అఖిల్ 'హలో' మాత్రం కాస్ట్ ఫెయిల్యూర్ అయింది.
అఖిల్ చిత్రంపై ఎంత పెట్టుబడి పెడితే కరక్ట్ అనేది నాగార్జున ఎస్టిమేట్ చేయలేకపోయారు. ఇరవై కోట్ల పెట్టుబడితో తీసినట్టయితే హలో సేఫ్ ప్రాజెక్ట్ అయివుండేది. బడ్జెట్ ముప్పయ్ అయిదు కోట్లు అయిపోవడంతో థియేటర్స్ నుంచి అందులో సగం కూడా వసూలు కాలేదు.
ఈ నేపథ్యంలో అఖిల్ కాన్ఫిడెన్స్‌పై మరో దెబ్బ పడింది. హలో రిలీజ్‌కి ముందే ఒక కథ ఓకే చేసిన అఖిల్ ఇప్పుడు దానిని పక్కన పెట్టేసి ఎవరైనా ప్రముఖ దర్శకుడి కోసం చూస్తున్నాడు. అందరు దర్శకులు బిజీగా ఉన్న సమయంలో అఖిల్ మూడో సినిమా మెటీరియలైజ్ అయ్యేది ఎప్పటికో?