సినిమా రివ్యూ: ఛలో

రివ్యూ: ఛలో రేటింగ్‌: 3/5 బ్యానర్‌: ఇరా క్రియేషన్స్‌ తారాగణం: నాగశౌర్య, రష్మిక మందాన, సత్య, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, ప్రవీణ్‌, నరేష్‌, పవిత్ర తదితరులు కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు సంగీతం: మహతి స్వర…

రివ్యూ: ఛలో
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: ఇరా క్రియేషన్స్‌
తారాగణం: నాగశౌర్య, రష్మిక మందాన, సత్య, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, ప్రవీణ్‌, నరేష్‌, పవిత్ర తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: మహతి స్వర సాగర్‌
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాత: ఉష మూల్పూరి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2018

రెండు ఊర్ల మధ్య వైరం… దాంట్లో చిక్కుకున్న ప్రేమజంట! ఎనభైల కాలం నాటి సెట్టింగ్‌ ఇది. కానీ యువ దర్శకుడు వెంకీ కుడుముల ఈ రొటీన్‌ సెటప్‌కి తెలివైన స్క్రీన్‌ప్లే జత చేసాడు. కడుపుబ్బ నవ్వించే హాస్యంతో నింపేసి ఈ కథలోని ఆ రొటీన్‌ ఫీలింగ్‌ని కూడా మాయం చేయగలిగాడు.

తిరుప్పురం అనే కల్పితమైన ఊరు ఆంధ్రా, తమిళనాడు బోర్డర్‌లో వుంటుంది. రాష్ట్ర విభజనలో ఊరు మధ్యనుంచి సరిహద్దు రేఖ వెళ్లడంతో ఒకవైపు తమిళులు, మరోవైపు తెలుగువాళ్లు ఒకరిపై ఒకరు పగతో రగిలిపోతూ వుంటారు. వాళ్లనో జమీందారు కంట్రోల్‌ చేస్తుంటాడు.

చిన్నతనం నుంచి గొడవలంటే ఇష్టం పెంచుకున్న కొడుకుని (నాగశౌర్య) దార్లో పెట్టడానికి ఈ ఊరికి పంపిస్తాడతని తండ్రి (నరేష్‌). తిరుప్పురం కాలేజీలో తేలిన ఆ కుర్రాడు చూసీ చూడంగానే ఒకమ్మాయి (రష్మిక) ప్రేమలో పడతాడు. ప్రాంతీయ విబేధాలతో రగిలిపోతున్న ఆ జనం మధ్య తన ప్రేమని ఎలా సక్సెస్‌ చేసుకుంటాడు? అసలు విభజనలో విడిపోయిన గ్రామంలో అంతగా కక్షలెందుకు పెరిగినట్టు?

ఈ కథని కాస్త మాస్‌ ఫాలోయింగ్‌ వున్న హీరోతో చేస్తే ఒకలా, నాగశౌర్యలాంటి అప్‌కమింగ్‌ హీరోతో చేస్తే ఒకలా డీల్‌ చేయవచ్చు. అప్‌కమింగ్‌ హీరోతోను మాస్‌ హీరోతో చేసినట్టే చేసి పప్పులో కాలేసే ప్రమాదం వుంది కూడా. అయితే యువ దర్శకుడు వెంకీ కుడుముల ఈ విషయంలో క్లారిటీతో వున్నాడు. ఎక్కడా యాక్షన్‌ పరంగా 'బోర్డర్‌' దాటకుండా ఈ బోర్డర్‌లో సెట్‌ అయిన లవ్‌స్టోరీని కామెడీతో నడిపించాడు.

కథ మొదలవడమే ఫన్‌ టోన్‌లో స్టార్ట్‌ అవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ని విపులంగా ఎక్స్‌ప్లెయిన్‌ చేసిన తర్వాత అతడిని తిరుప్పురం పంపిస్తారు. దాంతో కథ జోరందుకుంటుంది. కాలేజ్‌లో తెలుగు, తమిళ విద్యార్థుల మధ్య జరిగే సైలెంట్‌ వార్‌, తెలుగువాడు అని తెలియక హీరోకి క్లోజ్‌ అయిపోయే ఒక క్యారెక్టర్‌ (సత్య) అంతా వినోదాత్మకంగా సాగుతుంటుంది. ఇంతలో హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ స్టార్ట్‌ అవుతుంది. ప్రధమార్థంలో వినోదం పాళ్లు ఎక్కువైనా కానీ ఈ ప్రేమకథ మాత్రం విసుగెత్తిస్తుంది. ఇంత కామెడీ చేసిన దర్శకుడు ఈ లవ్‌స్టోరీని కూడా కొత్తగా చెప్పడానికి ట్రై చేయాల్సింది.

ఈ కథకి బేస్‌ లవ్‌స్టోరీ కనుక ఆ పార్ట్‌ని ఇంత తేలికగా తీసుకుని వుండాల్సింది కాదు. ప్రేమకథ మెప్పించకపోయినప్పటికీ నాగశౌర్య, రష్మిక జంట బాగుంది. ఇంటర్వెల్‌ ట్విస్టు ఊహించగలిగేదే అయినా కానీ మిస్‌లీడ్‌ చేస్తూ ఇచ్చిన బిల్డప్‌ బాగా కుదిరింది. ఓవరాల్‌గా ఇంటర్వెల్‌ టైమ్‌కే 'ఛలో' పైసా వసూల్‌ అనిపించేస్తుంది.

ఇంటర్వెల్‌ తర్వాత కథని అదే గ్రిప్‌తో ముందుకు తీసుకెళ్లడంలో వెంకీ తడబడ్డాడు. సెకండ్‌ హాఫ్‌ ముందుకు సాగే కొద్దీ స్టీమ్‌ కోల్పోతున్న ఫీల్‌ పెరుగుతుంది. సరిగ్గా అలాంటి టైమ్‌లో తన గురువు త్రివిక్రమ్‌ స్టయిల్లో ఒక కొత్త క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసి దర్శకుడు మళ్లీ సినిమాని ట్రాక్‌ ఎక్కించేస్తాడు. తన లవర్‌ తనని వదిలేసి పోయిందని, ఇప్పుడు అలాంటి బాధనే మరో లవర్‌కి ఇచ్చి రివెంజ్‌ తీర్చుకోవాలనే క్యారెక్టర్‌ వెన్నెల కిషోర్‌ది. 'నిన్నెవరో మోసం చేస్తే నా మీద రివెంజ్‌ తీర్చుకోవడమేంటి' అని అడిగితే 'ఒక దోమ కుట్టిందని ఆల్‌ అవుట్‌ పెట్టి దోమలన్నిటినీ చంపేయట్లేదా… ఇదీ అంతే!' అంటూ తిక్క లాజిక్కులు మాట్లాడుతూ వెన్నెల కిషోర్‌ సెకండ్‌ హాఫ్‌నే సేవ్‌ చేసే పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు.

'పట్టుదల వుంటే కానిది లేదు' అంటే చేతిలోని వాటర్‌ బాటిల్‌లో నీళ్లు కింద ఒలకబోసి 'నీ పట్టుదలతో ఈ నీళ్లని మళ్లీ బాటిల్‌లోకి ఎక్కించు' లాంటి పంచ్‌లతో వెన్నెల కిషోర్‌ ఫుల్‌ ఫామ్‌లో చెలరేగిపోయాడు. సత్య కూడా తన కెరీర్‌లో మరో గుర్తుండిపోయే క్యారెక్టర్‌ చేసాడు. వీళ్లిద్దరి కామెడీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పతాక సన్నివేశాన్ని యాక్షన్‌ కాకుండా కామెడీతో డీల్‌ చేయడం కోసం వేసిన ఎత్తు మిక్స్‌డ్‌ రియాక్షన్స్‌ రాబడుతుంది. మరీ అంత సిల్లీగా ఎండ్‌ చేసి వుండాల్సింది కాదని ఎక్కువ మంది అభిప్రాయపడతారు. అయితే ఇలా ఎండ్‌ చేయడం ద్వారా యాక్షన్‌కి స్కోప్‌ లేకుండా చేసి ప్యూర్‌ కామెడీగా దీనిని మలచగలిగారు.

నాగశౌర్య ఎక్కడా హీరోలా బిహేవ్‌ చేయకుండా పాత్రకి అనుగుణంగా బాగా నటించాడు. రష్మిక మంచి నటి కానీ ఆమె క్యారెక్టర్‌ని ఇంకా బాగా తీర్చిదిద్దాల్సింది. నరేష్‌, రఘుబాబు సపోర్టింగ్‌ రోల్స్‌లో ఆకట్టుకున్నారు. పాటల ప్లేస్‌మెంట్‌ కుదర్లేదు. 'చూసీ చూడంగానే' పాట తప్ప మిగతావి వినసొంపుగానూ లేవు. మహతి నేపథ్య సంగీతం మాత్రం మెప్పిస్తుంది. విజువల్‌గా సినిమా కలర్‌ఫుల్‌గా వుంది.

సినిమాటోగ్రాఫర్‌ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చాడు. నిర్మాతలు రాజీ పడకుండా క్వాలిటీ ప్రోడక్ట్‌ అందించారు. యువ దర్శకుడు వెంకీలో మంచి హాస్య చతురత వుంది. చక్కని సంభాషణలతో ఎప్పటికప్పుడు వీక్షకుల ముఖాలపై నవ్వు చెదిరిపోకుండా చూసుకున్నాడు. గ్రాఫ్‌ పడిపోతుందనిపించిన ప్రతి సారీ ఒక మంచి కామెడీ సీన్‌ వేసి మళ్లీ లిఫ్ట్‌ చేసాడు. ఒక పూర్తిస్థాయి కమర్షియల్‌ హీరోతో చేస్తే తనపై రిస్ట్రిక్షన్స్‌ వుండవు కనుక ఇంకా ఫ్రీగా కామెడీ, యాక్షన్‌ పండించగలడనే నమ్మకం కలుగుతుంది.

ఎక్కువ అంచనాలు రేకెత్తించని ఈ చిత్రం చక్కని హాస్యంతో, ఆకట్టుకునే సెట్టింగ్‌తో పైసా వసూల్‌ అనే ఫీల్‌నైతే ఖచ్చితంగా ఇస్తుంది. కామెడీ లవర్స్‌ని ఆకట్టుకునే ఈ చిత్రం మెజారిటీ ఆడియన్స్‌ నుంచి థమ్స్‌ అప్‌ అందుకుంటుంది. నాగశౌర్య ఏ నమ్మకంతో అయితే ఈ చిత్రాన్ని నిర్మించాడో అందుకు తగ్గ ప్రోడక్టే తెరకెక్కింది కనుక బాక్సాఫీస్‌ పరంగాను సక్సెస్‌ ఖాయమనిపిస్తోంది.

బాటమ్‌ లైన్‌: కామెడీ కోసం ఛలో!

– గణేష్‌ రావూరి