నిఖిల్ మళ్లీ హ్యాపీడేస్

యూత్ ఫుల్ సినిమాల టైమ్ వచ్చింది మళ్లీ. అర్జున్ రెడ్డి, ఫిదా లాంటి సినిమాలు పెద్ద హిట్ లుగా నిలిచాయి. అయితే పూర్తిగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చి చాలా కాలం…

యూత్ ఫుల్ సినిమాల టైమ్ వచ్చింది మళ్లీ. అర్జున్ రెడ్డి, ఫిదా లాంటి సినిమాలు పెద్ద హిట్ లుగా నిలిచాయి. అయితే పూర్తిగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చి చాలా కాలం అయింది. అర్జున్ రెడ్డి కొంతవరకు ఆ లోటు తీర్చింది. ఇప్పుడు పూర్తిగా క్యాంపస్ నేపథ్యంలో సినిమాను అందిస్తున్నట్లు కనిపిస్తోంది కిర్రాక్ పార్టీ టీజర్ ట్రయిలర్ చూస్తుంటే.

కన్నడ సినిమా కిర్రిక్ పార్టీ రీమేక్ అయిన ఈ సబ్జెక్ట్ కు సహజంగానే మనకు తెలిసిన సినిమాల లుక్ కొంత వుంది. అది ఈ సినిమా కోసం తెచ్చిపెట్టింది కాదు, కిర్రాక్ పార్టీలో వున్నదే. అందువల్లే కిర్రాక్ పార్టీ టీజర్ ట్రయిలర్ లో కూడా హ్యాపీడేస్, ప్రేమమ్ ఛాయలు కాస్త కనిపిస్తాయి.

టీజర్ లో అన్నింటికన్నా చెప్పుకోవాల్సింది నిఖిల్ గురించే. టీనేజ్ బాయ్ గా, కాస్త గ్రోనప్ యూత్ గా, కాలేజీ లీడర్ గా ఇలా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు టీజర్ లో. ఏ లుక్ కు ఆ లుక్ లో పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.

అయితే టీజర్ అంటే మామూలుగా చిన్న చమక్కునో, చురుక్కునో వుండడం మనకు అలవాటు. అలాంటిది మాత్రం ఇందులోలేదు. కిర్రాక్ పార్టీ సబ్జెక్ట్ అలాంటిది కావడం వల్ల కావచ్చు. మొత్తానికి ఇది టీజరే కాబట్టి, ట్రయిలర్లో అన్నీ వుంటాయని అనుకోవడమే.