తాత్కాలిక ‘అద్భుత’ అమరావతి…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో అద్భుత భవనాల నిర్మాణం కోసం గతంలో సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా మాట్లాడినప్పుడు 'రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించమని దేవుడు…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో అద్భుత భవనాల నిర్మాణం కోసం గతంలో సింగపూర్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా మాట్లాడినప్పుడు 'రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించమని దేవుడు నన్ను ఆదేశించాడు' అన్నారు. రానున్న కాలంలో ప్రపంచంలోని ఐదు టాప్‌ నగరాల్లో అమరావతి కూడా ఉంటుందన్నారు.

'అమరావతిని భూతల స్వర్గం చేస్తా. స్వర్గంలో దేవతలు ఉంటారు. వారి రాజధాని అమరావతి. ఆ నగరానికి రాజు దేవేంద్రుడు. అలాంటి భూతల స్వర్గాన్ని మనం నిర్మించుకోబోతున్నందుకు మనం గర్వపడాలి' అన్నారు. ఈ గర్వమంతా కేవలం మాటల్లోనే మిగిలిపోయింది. ఆయన గొప్పగా వర్ణించిన అద్భుత అమరావతి ఈ టర్మ్‌లో సాధ్యం కాదని తేలిపోయింది.

నగరమంతా నిర్మించడం ఎలాగూ సాధ్యం కాదనుకోండి. కనీసం ఒకటో రెండో భవనాలు ఎన్నికలనాటికి పూర్తవుతాయని, ఆ భవనాలను చూపించి గొప్ప రాజధాని నిర్మించానని బాబు ప్రచారం చేసుకుంటాడని జనం అనుకున్నారు. కాని వారికి ఆ అవకాశం దక్కలేదు.

బాబు అమరావతిని భూతల స్వర్గం ఎప్పుడు చేస్తారో తెలియదుగాని వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నిర్మించి వీటిని రికార్డు టైమ్‌లో అద్భుతంగా నిర్మించామని ఊదరగొట్టారు. టీడీపీ నేతలు, మంత్రులు, అనుకూల మీడియా ఆహా ఓహో అంటూ భజన చేశారు. సరేలే…నిధులు లేక తాత్కాలిక నిర్మాణలు చేశారు కదా. త్వరలోనే శాశ్వత భవనాలు కడతారని ప్రజలు భావించారు. వాటి డిజైన్ల తయారీకే బోలెడు సమయం, డబ్బు ఖర్చయ్యాయి.

అమరావతిలో స్టార్టప్‌ ఏరియాలో భవనాల నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలైన అసెండాస్‌, సింగ్‌ బ్రిడ్జి, సెంబ్‌ కార్ప్‌ అనేవాటికి అప్పగించినా అవి ఇప్పటివరకు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలియదట.

ఈ నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు విభజన పెద్ద వివాదంగా మారింది. రాష్ట్ర విభజన జరగ్గానే హైకోర్టును విభజించాలంటూ తెలంగాణ నాయకులు గొడవ ప్రారంభించారు. ఇప్పటివరకు ఏదోలా నెట్టుకొచ్చినా ఇక ఆపే పరిస్థితి లేదు. సరే..శాశ్వత హైకోర్టు భవనాలు నిర్మించేంతవరకు అద్దె భవనాల్లో హైకోర్టు ఏర్పాటు చేద్దామనుకుంది సర్కారు. కాని దీనికి వ్యతిరేకత వస్తోంది. మరేం చేయాలి?

తాత్కాలికంగా హైకోర్టు భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేరుకు తాత్కాలికం. కాని ఖర్చు ఎంతో తెలుసా? 108 కోట్లు. ఇది ఇప్పటి అంచనా మాత్రమే. రంగంలోకి దిగితే ఇంకెంత ఖర్చు చేస్తారో…! జీ-ప్లస్‌ 2 పద్ధతిలో నాలుగు ఎకరాల్లో హైకోర్టు భవనం నిర్మిస్తారు. సుమారు ఎని పనిమిది నెలల్లో ఈ భవనాలు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అంటే సాధారణ ఎన్నికలకు ముందే హైకోర్టును ఆంధ్రాకు తరలిస్తారన్నమాట. తాత్కాలిక సంబరం ఇంతటితో అయిపోలేదు. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఓ ప్రతిపాదన చేశారు. ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ భవనం సరిపోవడంలేదట.

కాబట్టి దానికి అనుబంధంగా ఓ తాత్కాలిక భవనం కట్టాలని సర్కారుకు చెప్పారాయన. శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణం ఆలస్యమవుతుంది కాబట్టి ఈ భవనం నిర్మించడం అవసరమన్నారు. ఈ కొత్త భవనంలోనే మీడియా పాయింటు, ఇతర వసతులు ఉంటాయట. ప్రజల సొమ్మే కదా..ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. అడిగేవారెవ్వరు? ఇదివరకు అసెంబ్లీ భవనం కట్టేటప్పుడు అది సరిపోతుందో లేదో చూసుకోవాల్సిన అవసరంలేదా? గొప్ప విజన్‌ ఉన్న చంద్రబాబు నాయుడుకు ఏ భవనం ఎంత మేరకు కట్టాలో తెలియదా? తాత్కాలికం పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు పరిపాలనా సామర్థ్యం ఏమిటో అర్థమవుతోంది.