ఐపీఎల్.. క్రికెటర్లపై మళ్లీ కోట్ల వర్షం!

పది సీజన్లను ముగించుకుని.. పదకొండో సీజన్ లోకి అడుగుపెడుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మళ్లీ సంచలన నంబర్లు వినిపిస్తున్నాయి. క్రికెటర్లపై మళ్లీ కోట్ల రూపాయల వర్షం కురుస్తోంది. ఒక్కొక్క సీజన్ ఆడటం కోసం…

పది సీజన్లను ముగించుకుని.. పదకొండో సీజన్ లోకి అడుగుపెడుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మళ్లీ సంచలన నంబర్లు వినిపిస్తున్నాయి. క్రికెటర్లపై మళ్లీ కోట్ల రూపాయల వర్షం కురుస్తోంది. ఒక్కొక్క సీజన్ ఆడటం కోసం ఆటగాళ్లు ఐపీఎల్ స్థాయి తగ్గ మొత్తాలకు అమ్ముడు పోతున్నారు. ఇంకా కొనసాగుతున్న వేలం ప్రక్రియలో ఇప్పటికే కొంతమంది క్రికెటర్లు భారీ మొత్తాలకు అమ్ముడయ్యారు.

ఇప్పటి వరకూ ఉన్న వివరాల ప్రకారం.. ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ బెన్ స్టోక్స్ 12.5 కోట్ల రూపాయల మొత్తానికి సేల్ అయ్యాడు. రీ ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్ స్టోక్స్ కు ఈ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ సారి ఐపీఎల్ ఆక్షన్ లో మరో సంచలనం మనీష్ పాండే. ఈ భారత ఆటగాడిని ఏకంగా 11కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది హైదరాబాద్ బేస్డ్ సన్ రైజర్స్ ప్రాంచైజ్.

మనీష్ పాండే ఐపీఎల్ రెండో సీజన్ నుంచి ఆడుతూ ఉన్నాడు. ఐపీఎల్ టీ20ల్లో తొలి సెంచరీ చేసిన భారతీయ బ్యాట్స్ మన్ గా కూడా ఈ ఆటగాడికి రికార్డు ఉంది. మనీష్ కు 11కోట్ల రూపాయలు సంచలన మొత్తమే అని చెప్పాలి. ఇదే మొత్తానికే అమ్ముడయ్యాడు కేఎల్ రాహుల్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాహుల్ ను 11కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.

క్రిస్ లియాన్ 9.6 కోట్లకు, మిచెల్ స్టార్క్ 9.4 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ కు అమ్ముడయ్యారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ కోసం తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించింది ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు. రవిచంద్రన్ అశ్విన్ 7.6 కోట్ల రూపాయలకు పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. విండీస్ ఆల్ రౌండర్ బ్రావోను 6.4 కోట్లకు కొనుక్కొంది చెన్నై యాజమాన్యం.

ఇక విండీస్ సంచలన ఆటగాడు క్రిస్ గేల్ ను కొనుగోలు చేయడానికి ఏ జట్టూ మొగ్గుచూపకపోవడం విశేషం. మరో భారత ఆటగాడు కరణ్ నాయర్ 5.6 కోట్లకు అమ్ముడయ్యాడు. గౌతమ్ గంభీర్ ధర కేవలం రెండు కోట్ల రూపాయలు మాత్రమే పలికింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను హైదరాబాద్ జట్టు మూడు కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశీ షకీబ్ ను కూడా రెండు కోట్ల మొత్తానికి ఈ జట్టుకొనుగోలు చేసింది. యువరాజ్ ధర కేవలం రెండు కోట్ల రూపాయలే పలకడం గమనార్హం.