రామ్ గోపాల్ వర్మ ఏమి చేస్తున్నా కానీ జనం కొంతకాలంగా పట్టించుకోవడం మానేసారు. ఎలాగో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీయడం మానేసాడు కనుక అతడు ఎలాంటి చిత్రాలు చేసుకుంటున్నా, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ అంటూ ఎలాంటి రచ్చ చేసినా పట్టించుకోలేదు. అయితే ప్రస్తుతం అతను నాగార్జునతో ఒక సినిమా తీస్తున్నాడు.
తనని హీరోగా నిలబెట్టాడనే కృతజ్ఞతతో ఈ టైమ్‌లో వర్మకి నాగార్జున అవకాశమిచ్చాడనేది జగమెరిగిన సత్యం. అయితే వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తన దృష్టి మొత్తం అదే సినిమాపై పెట్టి, ఈ చిత్రంతో బౌన్స్‌బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశిస్తే, వర్మ మాత్రం ఏదో సామెత చెప్పినట్టు మళ్లీ పాత రీలే వేస్తున్నాడు.
వివాదాలతో పొద్దు గడుపుతూ, ఎందుకూ కొరగాని చర్చలతో టీవీ ఛానల్స్‌లో కాలం వెల్లదీస్తున్నాడు. జిఎస్టీ పేరిట మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్‌తో తీసిన వీడియోకి వర్మ చేసుకుంటోన్న ప్రచారం అతని ప్రమాణాలని మరింతగా కిందకి తొక్కేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి మైండ్‌సెట్‌తో వున్న వర్మ ఇప్పుడు నాగార్జునతో ఎలాంటి సినిమా తీస్తున్నాడో, అది ఏ విధంగా వుండబోతుందోనని అక్కినేని అభిమానులు వణికిపోతున్నారు.
అమితాబ్‌బచ్చన్‌ని చేతిలో పెడితేనే సర్కార్ 3 చిత్రాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసిన వర్మ ఎక్స్ట్రా టైమ్ ఇచ్చి, రీషూట్ల కోసం సమయం కేటాయించినా కానీ దానిని ఒక దారికి తీసుకురాలేకపోయాడు. ఈ సినిమా కనుక తను అనుకున్న స్టాండర్డ్స్‌లో లేకపోతే రిలీజ్‌కి క్లియరెన్స్ ఇవ్వననే విధంగా నాగార్జున మాట్లాడారు. ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుని వర్మని వంచుతాడా లేక వర్మ లాజిక్కులతో పడలేక ఏదైతే అదేనంటూ తలవంచుతాడా అనేది చూడాలి.