కత్తి మహేష్ బాటలో ఆర్జీవీ

ఇలా అంటే ఆర్జీవీ అభిమానులకు అంతగా రుచించకపోవచ్చు. కానీ పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఆర్జీవీకి పబ్లిసిటీ అంటే భలే ఇష్టం. ప్రచారం ఎలాంటిదైనా దాన్ని ఆయన భలేగా ఆస్వాదిస్తారు. ట్విట్టర్ లో ఎలాంటి ప్రచారాన్నయినా…

ఇలా అంటే ఆర్జీవీ అభిమానులకు అంతగా రుచించకపోవచ్చు. కానీ పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఆర్జీవీకి పబ్లిసిటీ అంటే భలే ఇష్టం. ప్రచారం ఎలాంటిదైనా దాన్ని ఆయన భలేగా ఆస్వాదిస్తారు. ట్విట్టర్ లో ఎలాంటి ప్రచారాన్నయినా ఎదుర్కొని, దాన్ని వీడి వెళ్లిన ఆర్జీవీ, మళ్లీ చాలా తక్కువ కాలంలోనే ట్విట్టర్ లోకి వచ్చారు.

దానికి కారణం ఒక్కటే. ట్విట్టర్ లో హల్ చల్ ను, హడావుడిని ఆస్వాదించడం ఆయనకు మహా ఇష్టం కావడం వల్లనే. చాలా తక్కువ సమయంలో, హడావుడి చేయడం, వివాదాలకు కేంద్ర బిందువై వుండడం మహా సరదా అని క్లియర్ గా తెలిసిపోతూనే వుంటుంది. పైగా ఆయన దగ్గర ఓ టీమ్ వుంది. వాళ్లంతా రెడీ గా వుంటారు. ఒకటి రెండు రోజుల్లో ఓ పాటో, విడియోనో, టీజర్ నో అలా తీసి ఇలా వదిలేయగలరు.

అయితే ఇన్ని చేసినా, ఆర్జీవీ ఇన్నాళ్లు మీడియాకు మాత్రం అంత దగ్గరగా కాకుండా, అంత దూరంగా కాకుండా వుంటూ వచ్చారు. విచ్చలవిడిగా మీడియాలో కనిపించే వ్యవహారానికి మాత్రం ఇంతకాలం ఆర్జీవీ దూరంగానే వున్నారని చెప్పాలి. ఇలా మీడియాలో కన్నా, సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే ఆర్జీవీకి ఇష్టం.

అయితే ఇప్పుడు ఆయన రూటు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్జీవీ రూట్ లో కాకుండా, తనదైన వేరే రూట్ లో వెళ్లి కత్తి మహేష్ సూపర్ పాపులర్ అయ్యారు. ఇలా పాపులర్ కావడంతో ఆయన సోషల్ మీడియాను వాడుకుంటే, మీడియా ఆయనకు సహకరించింది. మీడియా ఒకందుకు సహకరిస్తే, ఆయన మరొకందుకు మీడియాను వాడుకున్నారు.

ఇప్పుడు ఇదే ఆర్జీవీ గమనించినట్లుంది. ఇదేదో బాగుందని అనుకున్నట్లుంది. అందుకే కత్తి మహేష్ విరామం ప్రకటించిన చోట ఆర్జీవీ మొదలు పెట్టారు. ఇందుకు ఆయన తన జిఎస్టీ సినిమాను ఆలంబన చేసుకున్నారు. చానెళ్లలో కనిపిస్తున్నారు. ఆ కనిపించడం ఒకసారితో సరిపెట్టడం లేదు. ఏదో కొత్త కొత్త మార్గాలు కనిపెట్టి మరీ కనిపిస్తున్నారు. వీలయినన్ని ఎక్కువ సార్లు కనిపించడానికి ఆయనే ప్రయత్నిస్తున్నట్లు, సహకరిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

దీనివల్ల జీఎస్టీ సినిమాకు వచ్చిన లాభం అంతగా వుండదు. ఎందుకంటే సెక్స్ షార్ట్ ఫిలిమ్ అనగానే అది ఆర్జీవీది అయినా, మరెవరిది అయినా చూసేవాళ్లు చూస్తారు. దూరంగా వుండేవారు వుంటారు. మహా అయితే ఆర్జీవీది అని అనుకున్నా, సెక్స్ ఫిలిం కాబట్టి చూసేవాళ్ల సంఖ్య మరీ అంతగా పెరిగిపోదు.

అయినా ఆర్జీవీ ఈ విషయాన్ని తన ప్రచారానికి వాడుకోవాలని చూస్తున్నట్లుంది. ఆయన ఎంతవరకు వెళ్లారంటే, షూటింగ్ లో నగ్న వర్కింగ్ స్టిల్స్ ను కూడా వాట్సప్ ల్లో వదిలేలా. అయితే సభ్యత దాటి వెళ్లలేక మీడియా ఆ స్టిల్స్ ను చూసి వదిలేసింది. చూపించకుండా ఊరుకుంది.

నిజానికి జీఎస్టీ వివాదాన్న ముగించే దిశగా కన్నా, కొనసాగించే దిశగానే ఆర్జీవీ పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కొనసాగింపు వ్యవహారం, ఇందుకోసం చానెళ్లలో ఆయన చేస్తున్న రకరకాల విన్యాసాలు అన్నీ చూస్తుంటే, కత్తి మహేష్ పాపులారిటీ పొందిన విధానం ఆయన అమితంగా నచ్చేసినట్లో, ఆయనను అద్భుతంగా ఆకట్టుకున్నట్లో కనిపిస్తోంది. ఆ దోవలోనే ఆయన ఇప్పుడు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక మన విజువల్ మీడియా సంగతి సరేసరి. జనాలు ఏమనుకుంటున్నారు అన్నది అనవసరం. తమకు ఎవరో ఒకరు దొరకాలి. హల్ చల్ చేసుకోవడానికి. కానీ చానెళ్ల క్రెడిబులిటీ ఏమవుతోందన్నది అక్కరలేదు. అయినా జనాలు కూడా అలాగే వున్నారుగా. సంసారపక్షంగా, పక్కా మీడియా విలువలకు కాస్తయినా కట్టుబడిని ఈటీవీ న్యూస్ ఎవరికీ పట్టదు. నిత్యం వీధి కుళాయిల పంచాయతీ టైపు కార్యక్రమాలతో కాలక్షేపం చేసే చానెళ్లే కావాలి.

అందుకే ఆర్జీవీ ఇప్పుడు వాటిని, వాటి అవసరాన్ని, ఈ అవకాశాన్ని హ్యాపీగా వాడేసుకుంటున్నారు.