రాజకీయాల్లో ఏం చేసినా, అది రాజకీయ లబ్దికోసమే అయివుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 'అబ్బే, మేం రాజకీయ లబ్దికోసం చేయలేదు..' అని ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు చెప్పినా, అది హాస్యాస్పదమే అవుతుంది. రాజకీయాల్లో అంతే, ఎవరైనాసరే చెయ్యాల్సింది రాజకీయమే. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అలా తగలడింది మరి.!
ఇక, అసలు విషయానికొస్తే, రెండు దశాబ్దాలుగా 'ఉద్దానం' పేరు మార్మోగిపోతోంది.. అదీ దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా.! ఒకప్పుడు ఉద్దానం అంటే, కోనసీమతో, కేరళతో పోటీ పడే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనూ దూరంగా విసిరివేయబడినట్లుండే శ్రీకాకుళం జిల్లాలోని ప్రాంతమిది. ఈ 'ఉద్దానం' ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం, ఇక్కడి ప్రజలు కిడ్నీ వ్యాధిగ్రస్తులు కావడమే.
ప్రపంచంలో ఈ తరహా ప్రాంతాలు గట్టిగా అంటే ఒకటో రెండో వుంటాయేమో. అంత తీవ్రత కలిగిన ప్రాంతం ఉద్దానం. దురదృష్టవశాత్తూ రాష్ట్ర పాలకులు, దేశ పాలకులు ఈ ఉద్దానం ప్రాంతాన్ని పట్టించుకోలేదు.. అందూ పట్టించుకున్నట్టు నటించారంతే. ఇప్పుడు సీన్ మారింది.. కాదు కాదు, మారినట్లు కన్పిస్తోంది. హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి ఓ బృందం ఉద్దానం పర్యటనకు నడుం బిగించింది. అలా ఆ బృందం అక్కడికి వెళ్ళడానికి కారణమెవరో కాదు, సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.
మొన్నీమధ్యనే హార్వార్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు వెళ్ళిన పవన్, అక్కడి వారితో ఉద్దానం సమస్య గురించి చర్చించారు. దాంతో, ఓ బృందం పవన్ విజ్ఞప్తి మేరకు ఉద్దానంలో పర్యటించి, పరిశోధించాలని నిర్ణయించుకుంది. దానికి, చంద్రబాబు సర్కార్ తోడ్పాటు అందిస్తోంది. ఉద్దానంలో పర్యటన అనంతరం హార్వార్డ్ బృందం పవన్‌కళ్యాణ్‌తో భేటీ అవుతుంది. ఆ తర్వాత, పవన్‌కళ్యాణ్‌తో కలిసి ఆ బృందం, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతుంది.
ఇంకేముంది, ఇక్కడితో ఉద్దానం కష్టాలు తీరిపోతాయనుకునేరు.! ఈ స్థాయిలో కాకపోయినా, ఇలాంటి పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు గతంలోనూ కొన్ని జరిగాయి గనుక, ఈసారి ఈ 'ప్రక్రియ' ఎంతవరకు ఉద్దానం ప్రజలకు ఉపయోగపడ్తుందన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
సుమారు ఐదారు నెలల క్రితం పవన్‌కళ్యాణ్, ఉద్దానం ప్రాంతంలో పర్యటించడం, ఆ తర్వాతే ఈ మొత్తం తతంగం చోటు చేసుకోవడం.. వెరసి, క్రెడిట్ పూర్తిగా పవన్ ఖాతాలోకి వెళుతోంది. ఇటు టీడీపీ, ఇంకోపక్క టీడీపీ మిత్రపక్షం బీజేపీ కూడా క్రెడిట్‌ని పవన్ ఖాతాలోనే వేస్తున్నాయి. మరి, పవన్ ఈ రకంగా తనకు దక్కిన పొలిటికల్ మైలేజీని ఎలా ఉపయోగించుకుంటారు.? వేచి చూడాల్సిందే.
చివరగా: రాజకీయ పార్టీ అధినేతగా, సినీ నటుడిగా పవన్ సంగతి పక్కన పెడితే, 'వ్యవస్థ కోసం..' అని పదే పదే చెప్పే పవన్, విలక్షణ వ్యక్తిత్వంగలవాడిగా, ఉద్దానం సమస్య పట్ల వ్యక్తిగతంగా చూపుతున్న ఈ శ్రద్ధ చిత్తశుద్ధితో కూడుకున్నదే అయితే, ఉద్దానం ప్రజానీకం ఆయనకు ఎంతో రుణపడిపోతారు.! అదే సమయంలో, ఇది కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అయితే, ఉద్దానం ప్రజల దృష్టిలో 'గుంపులో గోవిందం' అయిపోతాడంతే.!