మొత్తానికి అనుకున్నంత అయ్యింది. అయితే ఒకలా అవుతుంది అనుకుంటే, మరోలా అయింది. ఇండస్ట్రీలోని బిగ్ ఫ్యామిలీలకు చెందిన అల్లు అర్జున్, రానాల పేర్లు నేరుగా కాకుండా అన్యాపదేశంగా డ్రగ్స్ కేసులో మొదట్నించీ వినిపిస్తూ వచ్చాయి. అయితే వాళ్లకు ఎక్సయిజ్ శాఖ నోటీసులు అయితే ఇవ్వలేదు. దీంతో వాళ్ల ఫ్యామిలీలకు వున్న పలుకుబడితో మేనేజ్ చేసారన్న వదంతులు గుప్పుమన్నాయి.
అయితే ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణలో వాళ్ల పేర్లు కూడా బయటకు వచ్చాయని, త్వరలో వాళ్లకు కూడా నోటీసులు ఇస్తారని వార్తలు ఈ రోజు బయటకు వచ్చాయి. కానీ అవి నిజమో కాదో అన్నది తెలియకుండానే, నోటీసులు రాకుండానే, అల్లుఅర్జున్, రానాల పేర్లు వేరే విధంగా బయటకు వచ్చాయి.
డ్రగ్స్ కేసులో తెలంగాణ యూత్ ఫోర్స్ సంస్థ అనే సంస్థ కేవియెట్ దాఖలు చేసింది. సాధారణంగా ఏదైనా చర్య తీసుకునే అయిడియా వున్నపుడు, అవతలి వాళ్లు ఎక్కడ కోర్టుల ద్వారా బ్రేక్ వేస్తారో అన్న అనుమానం వుంటే, కేవియట్ వేస్తారు. కానీ ఇక్కడ ఎక్సయిజ్ శాఖ కేవియట్ వేయలేదు. ఓ యూత్ సంస్థ కేవియట్ దాఖలు చేసింది.
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ తారల వాదనను హైకోర్టు వినేముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆ సంస్థ కోరింది. కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలంగాణ యూత్ ఫోర్స్ సంస్థ వాదిస్తోంది. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన ఈ సంస్థ అల్లు అర్జున్, రానా, నవదీప్, రవితేజలను ప్రతివాదులుగా చేసింది.
అంటే ఇప్పుడు ఎక్సయిజ్ శాఖ నోటీసులు ఇచ్చినా వాళ్లు కోర్టు మెట్లు ఎక్కలేరు. కానీ ఎక్సయిజ్ శాఖ ఏమీ చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా, కేవియట్ అని అడిగితే, అది కూడా మూడోపార్టీ అడిగితే కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏమైనా ముందుగా రానా, అల్లు అర్జున్ ల పేర్లు మాత్రం ఈ విధంగా బయటకు వచ్చేసాయి.