మనుషుల్లో ఎక్కువమందికి ఏదో ఒక సెంటిమెంటు ఉంటుంది. కొందరికి ఏదో ఒక సెంటిమెంటు ఉంటే, ఇంకొందరికి ఒకటి కంటే ఎక్కువా ఉంటాయి. కొన్ని సెంటిమెంట్లు బయటకు కనిపించేవిధంగా ఉంటే, మరికొన్ని ఎదుటివారికి తెలియనివిధంగా ఉంటాయి. సెంటిమెంట్లు సామాన్యుల్లోనే కాదు, ప్రతి రంగంలోని ప్రముఖుల్లో (సెలబ్రిటీలు అంటాం కదా) ఉంటాయి. సామాన్యుల సెంటిమెంట్లు వారికే పరిమితమవుతాయి.
సెలబ్రిటీలకు జనం ఫాలోయింగ్, మీడియాలో ప్రచారం ఉంటాయి కాబట్టి వారి సెంటిమెంట్లు చర్చనీయాంశమవుతాయి. ముఖ్యంగా ఈ విషయంలో జనం దృష్టి ఎక్కువగా సినిమా తారలపై ఉంటుంది. ఇప్పుడు టీవీ ఛానెళ్లు పెరిగిపోయాయి కాబట్టి తారలు రోజంతా ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ తెరపై కనబడుతూనే ఉంటారు. ప్రింట్ మీడియాలోనూ వారి గురించి ఎక్కువే రాస్తుంటారు. సినిమా తారల గురించి చెప్పుకునేటప్పుడు వారి సెంటిమెంట్ల ప్రస్తావన కూడా వస్తుంటుంది. ఇది జనానికి ఆసక్తికరమైన విషయం.
ప్రస్తుతం ఓ సెంటిమెంటు గురించి తెలుగు టీవీ ఛానెళ్లు (ఒకటి రెండు ఛానెళ్లు) తరచూ ప్రస్తావిస్తున్నాయి. ఏమిటీ సెంటిమెంటు? ఎందుకీ ప్రస్తావన వచ్చింది? ఈ సెంటిమెంటు 'తెల్ల చొక్కాల సెంటిమెంటు'. ప్రస్తుతం మాదక ద్రవ్యాల కేసులో పలువురు సినిమా ప్రముఖులను ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్) ప్రతి రోజూ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు దర్శకుడు పూరీజగన్నాథ్, ఫోటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్‌ను విచారించారు. ఈరోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నా అలియాస్ ధర్మారావు విచారణ కొనసాగుతోంది. వీరిలో శ్యామ్ కె.నాయుడు మినహా మిగిలినవారు తెల్ల చొక్కాలు (ప్యాంట్ రంగు ఏదైనా) ధరించి వచ్చారు. ప్రస్తుతం చిన్నా కూడా తెల్ల చొక్కా వేసుకొని విచారణకు వచ్చారు. ఇది గమనించిన టీవీ ఛానెళ్లు విచారణకు వస్తున్నవారు తెల్ల చొక్కాలు వేసుకొస్తున్నారని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. ఈ రోజూ ఆ ప్రస్తావన వచ్చింది.
ఓ ఛానెల్ తెల్ల చొక్కాలు ఎందుకేసుకొస్తున్నారు? ఇది సెంటిమెంటా? అందరూ కూడబలుక్కునే ఇలా వేసుకొస్తున్నారా? లేక యాదృచ్ఛికంగా జరుగుతోందా? ప్రశ్నలు లేవనెత్తింది. తెల్ల చొక్కాలు ఎందుకేసుకొస్తున్నారో ఎవరికేం తెలుస్తుంది? విచారణకు వచ్చేవారు పుట్టెడు కష్టాల్లో ఉన్నారు. అలాంటప్పుడు అందరూ ఒక దగ్గర చేరి సెంటిమెంటుగా ఉంటుందని తెల్లచొక్కాలు వేసుకొస్తారా? ఇదో మూర్ఖపు ఆలోచన.
సినిమావారు బాధతో విచారణకు వస్తున్నారు తప్ప ఆనందంగా శుభకార్యానికి రావడంలేదు కదా. శుభకార్యమైతే రంగురంగుల డ్రస్సులతో ఫ్యాషన్‌గా వచ్చేవారు. సాదాసీదా దుస్తులు ధరించి వస్తున్నారు. అవి ధరించేటప్పుడు సెంటిమెంటుగా ఉంటుందనో, మంచి జరుగుతుందనో, స్వచ్ఛమైన వ్యక్తినని చెప్పుకోవడానికనో తెల్ల చొక్కాలు వేసుకోరు. తెలుపు సెంటిమెంటైతే హీరోయిన్ ఛార్మి, ముమైత్ ఖాన్ కూడా తెల్ల దుస్తులు ధరించి రావాలి కదా.
నిజానికి విచారణ గురించి ఛానెళ్లలో ఎంతని చెబుతారు? లోపల జరిగే విచారణ గురించి గోరంత తెలియగానే కొండంత చేసి చెబుతున్నారు. జనాలకు మరీ బోరు కొట్టకుండా తెల్ల చొక్కాల సెంటిమెంటు కథ కూడా చేర్చారు. సిట్ విచారణకు వచ్చేవారి విషయం ఎలా ఉన్నప్పటికీ ప్రముఖులు చాలామంది పూర్తిగా వైట్ డ్రస్ (ప్యాంట్, షర్ట్) వేసుకుంటారు.
ముఖ్యంగా రాజకీయ నాయకులు. కొందరు బూట్లు కూడా తెల్లవే తొడుగుతారు. ఉదాహరణకు.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు, పత్రికాధిపతి రామోజీరావు మొదలైనవారు. తెలంగాణ సీంఎం కేసీఆర్ తెల్ల దుస్తులే ధరిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒకవిధమైన క్రీం కలర్ దుస్తులు వేసుకుంటారు. వీరెవరూ దశాబ్దాలుగా ఆహార్యం మార్చుకోలేదు. ఇది సెంటిమెంటా? అని ప్రశ్నిస్తే కాదంటారు. అదలా అలవాటైంది. అంతే…!
విచారణకు హాజరయ్యే సినిమా ప్రముఖుల ఇంటి ముందు పొద్దున్నే పడిగాపులు కాస్తున్న ఛానెళ్ల విలేకరులు సినిమా ప్రముఖులు ముహూర్తం చూసుకొని (వర్జం, దుర్మూహర్తం వగైరా) విచారణకు బయలుదేరుతున్నారని చెబుతున్నారు. ఈ విషయం ఎంత వరకు నిజమో చెప్పలేంగాని ఇప్పటివరకు సిట్ విచారణకు వచ్చిన వారందరూ ఠంచనుగానే కాదు, నిర్దేశిత సమయం కంటే ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. సినిమా షూటింగులకైనా ఇంత త్వరగా వస్తారో రారోగాని ఇక్కడికి మాత్రం స్పీడుగా వచ్చేస్తున్నారు. వారు తప్పు చేశారో చేయలేదోగాని పంక్చువాలిటీ బాగా పాటిస్తున్నందుకు అభినందించాల్సిందే.