జగన్… ఒక వ్యూహాత్మక తప్పిదం!

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి బేషరతుగా మద్దతు ఇవ్వడం వెనుక సహేతుకత ఎంతైనా ఉండవచ్చు. కానీ… ఎన్డీయే భాగస్వామ పార్టీ ఏలుబడి సాగిస్తున్న రాష్ట్రంలో…

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి బేషరతుగా మద్దతు ఇవ్వడం వెనుక సహేతుకత ఎంతైనా ఉండవచ్చు. కానీ… ఎన్డీయే భాగస్వామ పార్టీ ఏలుబడి సాగిస్తున్న రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ.. అటు కేంద్రంలో మోడీ సర్కారు తీసుకునే నిర్ణయాలకు మాత్రం జై కొడుతుండడం సహజంగానే కొన్ని విమర్శలకు దారితీస్తుంది.

అయితే కేంద్రాన్ని సమర్థించిన ప్రతి సందర్భంలోనూ జగన్.. లాజికల్ వాదనలే నిర్మించుకుంటూ వచ్చారు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే.. అమిత్ షా నుంచి ఫోను రాగానే… ‘జీహుజూర్’ అని అప్పటికే సిద్ధంగా ఉన్నట్లుగా జగన్ తమ మద్దతును ప్రకటించడమే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఆ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకోవడం కష్టమే. ఏది ఏమైనప్పటికీ జగన్ ఈ విషయంలో వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను పాలక కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ వైఎస్ జగన్ మద్దతిచ్చారు. నోట్లరద్దు వ్యవహారంలో గానీ, జీఎస్టీ విషయంలో గానీ వారికి అండగానే నిలనిచారు. చాలాకాలంగా కేంద్రంతో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నారు. ఆయనంటే కిట్టనివారు.. ఇదంతా… తన కేసుల గురించిన భయంతోనే జగన్ కేంద్రానికి లోబడి ఉన్నారంటూ అనేక రకాలుగా విమర్శించినా జగన్ పట్టించుకోలేదు. నిజానికి జగన్ అభిమానులు కూడా పట్టించుకోలేదు. అవన్నీ దేశప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలుగా పరిగణనలోకి వచ్చాయి.

రాజకీయంగా.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తమ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రతిపాదించగానే జగన్ మద్దతిచ్చారు. దళిత అభ్యర్థిని పెడుతున్నారు గనుక మద్దతిస్తున్నాం అంటూ గట్టిగానే సమర్థించుకున్నారు. మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ప్రతిపాదించిన వెంటనే వీసమెత్తు పునరాలోచన కూడా లేకుండా, తమ మద్దతు ప్రకటించేశారు. తెలుగువాడు పెద్ద పదవిలోకి వెళుతున్నాడు అనే ఒక్క కారణం తప్ప.. జగన్ తన నిర్ణయాన్ని ఎలా సమర్థించుకోగలరనేది అభిమానులకే అర్థం కావడం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం జగన్ అలుపెరగని పోరాటం చేస్తుండగా.. ఆ పోరాటాన్ని చులకన చేస్తూ పలుమార్లు హేళన చేసిన నాయకుడు వెంకయ్యనాయుడు. పైగా ప్రత్యేకహోదా అనే డిమాండును పదేళ్లు కావాలంటూ.. విభజనకు ముందు ఊదరగొట్టి… తాము అధికారంలోకి రాగానే.. సునాయాసంగా దాన్ని పక్కకు నెట్టేసిన వైఖరి ఆయనది. రాష్ట్రప్రయోజనాల విషయంలో జగన్-వైసీపీ కి, వెంకయ్యనాయుడు వ్యవహార సరళికి మధ్య సిద్ధాంత వైరుధ్యం చాలానే ఉంది. అయినప్పటికీ జగన్ మద్దతివ్వడం చిత్రమే. అందుకే ఇది ఆయన తప్పిదం అని పలువురు అనుకుంటున్నారు.

ఏం చేసి ఉండాల్సింది…

అమిత్ షా ఫోను చేసినంత మాత్రాన ప్రతి విషయానికీ తలఊపి అంగీకరించాల్సిన అగత్యం వైఎస్ జగన్ కు ఎంతమాత్రమూ లేదు. ఆయన వెంకయ్య విషయంలో తన సొంత సిద్ధాంతభావజాలాన్ని ఆయన పక్కకు పెట్టినట్టుగా కనిపిస్తోంది. దళితకార్డు నేపథ్యంలో రామ్‌నాథ్ కోవింద్ కు మద్దతివ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు.

అంత ఏకపక్షంగా మద్దతివ్వడం కాకుండా.. తమ పార్టీ వారితో అంతరాత్మప్రబోధానుసారం ఓటు వేయిస్తానని చెప్పి… కావలిస్తే వెంకయ్యకు ఓట్లు వేసి ఉన్నా.. ఇంకాస్త గౌరవంగా ఉండేది. అది వ్యక్తిగతంగా ఇచ్చిన విలువ కింద ఉండేది. కానీ.. జగన్ వెంకయ్యకు మద్దతు ద్వారా తన పార్టీ పోరాటస్ఫూర్తిని, సిద్ధాంతాన్ని మరచిపోయారని అంతా అనుకుంటున్నారు.