విరాట్ కోహ్లీకి 'ఇగో' వుంది.. అది కాస్తా శాటిస్ఫై అయ్యింది. ఎలాగంటే, కోచ్ పదవికి కుంబ్లే గుడ్ బై చెప్పాడు కాబట్టి. కుంబ్లే స్థానంలోకొచ్చిన రవిశాస్త్రికీ 'ఇగో' వుంది. అది కూడా ఇప్పుడు శాటిస్ఫై అయ్యింది. ఎలాగంటే, బౌలింగ్ కోచ్‌గా తనక్కావాల్సిన వ్యక్తిని నియమించుకున్నాడు కాబట్టి. అసలేమయ్యింది ఇండియన్ క్రికెట్‌కి.?
క్రికెట్‌ని జెంటిల్మెన్ గేమ్ అంటుంటాం. పాకిస్తాన్‌తో కొన్నాళ్ళ క్రితం ఇండియా వరల్డ్‌కప్ పోటీల్లో తలపడ్తున్నప్పుడు, సచిన్ టెండూల్కర్‌కి తొడ కండరాలు పట్టేశాయి. బాధతో విలవిల్లాడిపోయాడు. కానీ, ఆ బాధతోనే మైదానంలో నిలబడ్డాడు, మ్యాచ్‌ని గెలిపించాడు. అక్కడ సచిన్ గెలిపించింది టీమిండియా జట్టుని మాత్రమే కాదు.. భారతదేశంలో వున్న కోట్లాదిమంది క్రికెట్ అభిమానుల్ని.
ఇంకో మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే తలకి తీవ్రగాయమయ్యింది. ఆ పరిస్థితుల్లో బౌలింగ్ చేయడానికి ఏమాత్రం సహకరించలదతని శరీరం. కానీ, మ్యాచ్ గెలిపించాలి. ఆ భారం కూడా తనమీదే వుందని గ్రహించాడు. నెత్తురోడుతూనే, బౌలింగ్ చేశాడు, మ్యాచ్‌ని గెలిపించాడు కుంబ్లే. చెప్పుకుంటూ పోతే, ఇలాంటి సంఘటనలు చాలానే కన్పిస్తాయి. క్రికెట్‌కి వున్న గొప్పతనం అది.
కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎవరి 'ఇగో' శాటిస్ఫై చేసుకోవడానికే వారు ప్రాధాన్యతనిస్తున్నారు. పాకిస్తాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో, విరాట్ కోహ్లీ తన ఇగో నెగ్గించుకున్నాడు.. మ్యాచ్‌ని తగలెట్టేశాడు. అది కుంబ్లే మీద కోహ్లీకి వున్న కోపం. అలాంటి కోహ్లీకి, రవిశాస్త్రి నచ్చాడు. రవిశాస్త్రికి మళ్ళీ, కమిట్మెంట్ వున్న జహీర్‌ఖాన్ నచ్చలేదు. జహీర్ఖాన్కి బదులు భరత్ అరుణ్‌ని తీసుకొచ్చాడు రవిశాస్త్రి. ఈక్వేషన్ అదిరిపోయింది.
ఇంతమంది 'ఇగోయిస్టుల' మధ్య టీమిండియా భవిష్యత్ ఏంటి.? అని ఆలోచించకండి.. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. భవిష్యత్తులో టీమిండియా కూడా వెస్టిండీస్ జట్టులాగా మారిపోయినా వింతేముంది.? అవును మరి, ఇగో ముందు క్రికెట్ ఎంత.?