ఆ పార్టీ నీడలో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌!

ఇటీవ‌ల టీ-టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వ‌ర్ రాజ‌కీయంగా కొత్త దారిని ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కాసాని గులాబీ కండువా క‌ప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌నే టీడీపీ…

ఇటీవ‌ల టీ-టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వ‌ర్ రాజ‌కీయంగా కొత్త దారిని ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కాసాని గులాబీ కండువా క‌ప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌నే టీడీపీ నిర్ణ‌యాన్ని కాసాని వ్య‌తిరేకించారు. దీంతో ఆ పార్టీని ఆయ‌న వీడారు.

తెలంగాణ‌లో ముదిరాజ్ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. తెలంగాణ‌లో బీసీ ఓటర్లు ఎక్కువ‌గా వుండ‌డం, అలాగే ఆర్థికంగా సంప‌న్నుడైన బీసీ నాయ‌కుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా టీడీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో సొంత ఖ‌ర్చులు పెట్టుకుని పార్టీని కొన్ని నెల‌ల‌పాటు కాసాని న‌డిపించారు. అయితే క‌మ్మ సామాజిక వ‌ర్గం కాంగ్రెస్‌కు అండ‌గా నిల‌వాల‌ని కోరుకుంటోంద‌న్న కార‌ణంతో ఎన్నిక‌ల బ‌రి నుంచి టీడీపీ త‌ప్పుకుంది.

ఈ నేప‌థ్యంలో కాసాని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో శుక్ర‌వారం ఆయ‌న స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక వ‌ర్గం నుంచి ఈట‌ల రాజేంద‌ర్ ఎవరినీ ఎద‌గ‌నివ్వ‌లేద‌ని ఆరోపించారు. బండా ప్ర‌కాశ్ ముదిరాజ్ లాంటి వాళ్ల‌ను పార్టీలోకి తీసుకొచ్చి ప‌ద‌వులు ఇచ్చామ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కాసాని జ్ఞానేశ్వ‌ర్‌కు అవ‌కాశాలు ఉంటాయ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈటల రాజేందర్ పార్టీలోంచి వెళ్లాక పార్టీలోకి వచ్చిన పెద్ద నేత మీరే అని కాసానితో కేసీఆర్ అన్నారు.  

కాసానికి రాజ‌కీయాలు తెలుస‌ని, మ‌న‌కున్న‌వి మొత్తం 119 సీట్లే అని కేసీఆర్ అన్నారు. అందులో ఏడు మ‌న‌వి కావ‌న్నారు. కేవ‌లం 112 సీట్లు మాత్ర‌మే ఉన్నాయ‌ని, వాటిలో నిల‌బెట్టిన వ్య‌క్తి ఖచ్చితంగా గెల‌వాల‌ని ఆయ‌న అన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత హైద‌రాబాద్‌లో అంద‌రం క‌లిసి కూర్చుని మాట్లాడుకుందామ‌న్నారు. ముదిరాజ్ సామాజిక వ‌ర్గం పెద్ద‌ది కాబ‌ట్టి ఆ వ‌ర్గం నుంచి మ‌నం నాయకుల‌ను త‌యారు చేసుకోవాల‌న్నారు. జిల్లాకు ఒక‌రిద్ద‌రిని త‌యారు చేసుకుంటే పార్ల‌మెంట్‌కు పెట్టుకోవ‌చ్చ‌న్నారు. రాజేంద‌ర్ అటు పోయినా.. పెద్ద మ‌నిషి కాసాని జ్ఞానేశ్వ‌ర్ పార్టీలో చేర‌డం మంచి ప‌రిణామం అని సీఎం కేసీఆర్ అన్నారు.