నిస్పక్షపాత విచారణ ఎలా సాధ్యం?

టాలీవుడ్ లో మత్తు మందుల వ్యవహారం ఓ కుదుపు కుదుపుతోంది. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని, నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా చూస్తున్నవ్యవహారాలతో ఈ విషయమై అనుమానాలు కలుగుతున్నాయి.…

టాలీవుడ్ లో మత్తు మందుల వ్యవహారం ఓ కుదుపు కుదుపుతోంది. ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని, నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల కొంతకాలంగా చూస్తున్నవ్యవహారాలతో ఈ విషయమై అనుమానాలు కలుగుతున్నాయి.

సినిమా రంగంలోని పలువురు ప్రముఖులతో తెరాస మంత్రి, తెలంగాణ ప్రభుత్వంలోని కీలక నాయకుడు అని కేటిఆర్ అత్యంత సన్నిహితంగా వుంటున్నారు. కేటీఆర్ అంటే ఆషామాషీ కాదు. ఆల్ మోస్ట్ డీఫ్యాక్టో చీఫ్ మినిస్టర్ లెక్క. మరి అలాంటి వ్యక్తికి సన్నిహితంగా వుండే వారిని పోలీసులు కానీ, ఎక్సయిజ్ వారు కానీ ఎక్కడ టార్గెట్ చేయగలుగుతారు?

ఇప్పటికే కేటీఆర్ తో సన్నిహితంగా వుండేవాళ్ల పేర్లు బయటకు రాలేదని టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా డ్రగ్స్ వ్యవహారాలు టాలీవుడ్ లో తెరపైకి వచ్చాయి. కానీ పెద్దగా ఏమీ సాధించిన దాఖలాలు అయితే లేవు. ఆ ఉదాహరణలు చూపించి, ఇప్పుడు కూడా ఇది మీడియాకు మెటీరియల్ ఇవ్వడానికి తప్ప వేరే ఎందుకు పనికి రావన్న పెదవి విరుపులు కూడా కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు మీడియా హడావుడి వుంటుంది. ఆ పైన సద్దుమణుగుతుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ చుట్టుపక్కల భూముల కుంభకోణం హడావుడి వినిపించింది. నానా బీభత్సంగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడా సందడి లేదు. కొద్ది రోజుల క్రితం స్కూళ్లలో డ్రగ్స్ హడావుడి తెగ జరిగింది. ఇప్పుడు అది మటుమాయం. అలాగే టాలీవుడ్ సందడి కూడా ఈ నటులు వెళ్లడం, వివరణ ఇచ్చి రావడంతో ఆగిపోయే అవకాశం వుందని వినిపిస్తోంది.