నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేశ్ కు కోపం వచ్చినా ఆపలేం, ప్రేమ పొంగినా ఆపలేం. కోపం వస్తే ఎంతలా తిట్టేస్తాడో, ప్రేమొచ్చినప్పుడు అంతలా ముద్దు చేస్తుంటాడు. దర్శకుడు హరీశ్ శంకర్ ను చెడామడా తిట్టేసిన బండ్ల, ఇప్పుడు అదే హరీశ్ శంకర్ ను వెళ్లి కౌగిలించుకున్నాడు. ఖరీదైన బహుమతి కూడా ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంపై రియాక్ట్ అయ్యాడు బండ్ల.
“నేను చాలా మందికి బహుమతులు ఇస్తుంటారు. హరీశ్ శంకర్ అనే దర్శకుడు నాకు గబ్బర్ సింగ్ అనే హిట్టిచ్చాడు. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అది. రీసెంట్ గా పదేళ్లు పూర్తయింది. ఎందుకో గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఫోన్ చేశాను. వెళ్లి వాచ్ ఇచ్చాను.”
ఇలా హరీశ్ శంకర్ కు ఖరీదైన వాచీని బహుమతిగా అందించాడు బండ్ల. మొన్నటివరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న ఈ ఇద్దరు ఇప్పుడిలా కలిసిపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఆ గొడవలపై కూడా బండ్ల, తనదైన శైలిలో స్పందించాడు.
“నేను, నా భార్య కొట్టుకుంటాం. నేను నా కొడుకు తిట్టుకుంటాం. అంతమాత్రాన ఆమె నా భార్య కాకుండా పోతుందా లేక వాడు నా కొడుకు కాకుండా పోతాడా? హరీశ్ శంకర్ నా ఫ్రెండ్ కాకుండా పోతాడా? హరీశ్ ఎప్పటికీ నాకు ఫ్రెండే. కొట్టుకోకపోతే బంధాలు ఎలా ఉంటాయి? కొట్టుకుంటేనే బంధాలు బలంగా ఉంటాయి. కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ప్రేమించుకోవాలి.”
ఇదీ హరీశ్ శంకర్ తో గొడవపై బండ్ల గణేశ్ రియాక్షన్. ఇక పవన్ కల్యాణ్ తో చేయబోయే సినిమాపై స్పందిస్తూ, సినిమా కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని, దేవుడు (పవన్) ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడది మొదలవుతుందని అన్నాడు బండ్ల గణేశ్.