వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. వాటిని భర్తీ చేయడం ఎలాగో అర్థం కాలేదు. వెంటనే పుష్ప సినిమాను గుర్తుకు తెచ్చుకున్నాడు. తను కూడా పుష్పగా మారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలనుకున్నాడు. కానీ సినిమాలో చూపించినట్టు బయట జరగదు కదా. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.
కడప జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ రఫీ అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఏపీ నుంచి తెలంగాణ, ఢిల్లీ, యూపీకు అరటిపండ్లు సరఫరా చేస్తుంటాడు. అయితే కొన్నాళ్లుగా ఈ వ్యాపారంలో నష్టాలు చూస్తున్నాడు రఫీ. రోజురోజుకు పెరిగిపోతున్న నష్టాల నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నాడు. ఇదే విషయాన్ని స్నేహితుడు ముల్లా బషీర్ అహ్మద్ తో పంచుకున్నాడు.
అహ్మద్ కు అప్పటికే ఎర్రచందనం స్మగ్లర్లతో లింకులు ఉన్నాయి. అతడిచ్చిన సమాచారం ఆధారంగా తను కూడా స్మగ్లర్ గా మారాలనుకున్నాడు రఫీ. అనుకున్నదే తడవుగా కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకు చెందిన మూర్తి నుంచి ఎర్రచందనం దుంగలు సంపాదించాడు.
ఆ దుంగల్ని తన లారీలో ఎక్కించి, వాటిపై పూర్తిగా అరటిపండ్లతో కప్పేశాడు. రెగ్యులర్ గా తిరిగే బండి కాబట్టి ఎవ్వరికీ అనుమానం రాలేదు. అలా కడప నుంచి హైదరాబాద్ వరకు లారీ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మౌలాలీని ఓ ప్రదేశంలో ఎర్రచందనం దుంగల్ని దాచారు. వాటిని అమ్మడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సరిగ్గా ఇక్కడే రఫీ-అహ్మద్ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ మేటర్ ఆ నోటా ఈనోటా వెళ్లి పోలీసుల చెవిలో పడింది. పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దందా గుట్టు రట్టు చేశారు. అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం సప్లయ్ చేసిన మూర్తి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
30 దుంగల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, మార్కెట్లో దీని విలువ దాదాపు 70 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ చేద్దామని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు రఫీ.