ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్నారు. ప్రజాభిమానాన్ని చూరగొనడానికి వారి వద్దకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదని జగన్, చంద్రబాబు ఒకే పంథా అనుసరించడం ఆసక్తికర పరిణామం. మరో రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. అధికారాన్ని నిలబెట్టుకోడానికి జగన్, పోయిన అధికారాన్ని దక్కించుకోడానికి చంద్రబాబు వేర్వేరు పేర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గత మూడేళ్లతో ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, మరోసారి ఆశీస్సులు కోరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే మార్గనిర్దేశం చేశారు. సర్వే ఆధారంగా రానున్న రోజుల్లో టికెట్లు ఇస్తానని జగన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడప గడపకూ ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళుతున్నారు. తాజాగా కుప్పం పర్యటనలో చంద్రబాబు కూడా తన పార్టీ నేతలకు ఇలాంటి ఆదేశాలే ఇచ్చారు.
ఏ స్థాయి నాయకులకైనా వారి పనితనమే గుర్తింపు తెస్తుందన్నారు. వారికే పార్టీలో పదవులు లభిస్తాయన్నారు. కొత్తగా పదవులు ఇచ్చినవారు పనిచేయకపోతే ఆ పదవులు ఊడుతాయని చంద్రబాబు హెచ్చరించారు. కొత్తగా పదవులు పొందిన వారు, ఆయా పదవుల్లో ఉన్నవారు నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి కష్టనష్టాలు తెలుసుకుని, పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. లేదంటే పదవులు ఊడుతాయని హెచ్చరించారు. సిఫార్సులు, రెకమండేషన్లతో పదవులు రావని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంత శక్తిమంతులో ప్రధాన రాజకీయ పక్షాల నేతల ఆందోళనలను గమనిస్తే అర్థమవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చల్లని చూపు లేకపోతే, ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు. అందుకే ఎన్నికలొస్తున్నాయంటే చాలు నిత్యం ప్రజల్లో ఉండేందుకు నేతలు నానా పాట్లు పడుతున్నారు.
అధినేతలు కూడా వివిధ మార్గాల్లో ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలెవరో గుర్తిస్తున్నారు. ఏది ఏమైనా లోపాలను సరిదిద్దుకుంటూ నేతలు పార్టీని బలోపేతం చేసుకునేందుకు క్షేత్రబాట పట్టడం మంచి పరిణామం.