చంద్రబాబునాయుడును రాజకీయ వ్యూహరచనా దురంధరుడని, అపర చాణక్యుడని, ఆయన రాజకీయ తెలివితేటలు అపారమైనవని, అసలు ఆయన ఒక పొలిటికల్ యూనివర్సిటీ నడిపితే సూపర్ గా ఉంటుందని.. ఇలా రకరకరాలుగా ఆయన వందిమాగధులు కీర్తిస్తుంటారు. కానీ వ్యూహరచన పరంగా ఆయనలోని సరుకు ఎండిపోయినట్లుగా కనిపిస్తోంది.
సరుకు తడారిపోయి, ఇతరులు ఏ వ్యూహాలు అనుసరిస్తోంటే అచ్చంగా అవే కాపీ పేస్ట్ చేసుకుని, ఆ రూటులోనే తాను కూడా వెళ్లడానికి ఆయన దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి చంద్రబాబునాయుడు అచ్చంగా వైఎస్ జగన్ తయారు చేసిన ఫార్ములానే అనుసరిస్తున్నారు.
మునిసిపాలిటీ ఎన్నికల్లో కుప్పం ప్రజలు తనను దారుణంగా తిప్పికొట్టిన తర్వాత చంద్రబాబునాయుడులో భయం పెరిగింది. గతంతో పోలిస్తే 2019 ఎన్నికల నాటికి ఆ నియోజకవర్గంలో తన మెజారిటీ దారుణంగా పతనం అయిపోగా, మునిసిపాలిటి ఎన్నికల్లో పరాభవం ఆయన కళ్లు తెరిపించింది. అప్పటినుంచి నియోజకవర్గం మీద అంతో ఇంతో ఫోకస్ పెడుతున్నారు.
కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ ఓ ప్రహసన కార్యక్రమం నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఆ మిషపై కుప్పం నియోజకవర్గంలో కూడా మూడు రోజుల పాటు పర్యటించారు. అందులో భాగంగా చివరిరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి, కుప్పంలో వచ్చే ఎన్నికల్లో తాను పరాజయం పాలు కాకుండా ఉండేందుకు అవసరమైన దిశానిర్దేశం చేశారు.
ప్రధానంగా.. పార్టీ నాయకులు హోదాలను పక్కన పెట్టి ఇంటింటికీ తిరిగి బాదుడే బాదుడు గురించి వివరించాలని ఆయన అంటున్నారు. ఇంటింటికీ తిరగడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అంటున్నారు. ఇది.. అచ్చంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘గడపగడపకూ’ కార్యక్రమానికి కాపీలాగానే ఉంది.
అలాగే ఈసారి 40 శాతం టికెట్లు యూత్ కు ఇస్తానని, సీనియర్ల సేవలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం ద్వారా గౌరవిస్తానని అంటున్నారు. ఇది జగన్ తొలినుంచి అనుసరిస్తున్న పద్ధతి. రాజ్యసభ, ఎమ్మెల్సీ టికెట్లను అమ్ముకోవడం మాత్రమే తెలిసిన చంద్రబాబుకు ఇప్పుడు కనువిప్పు కలిగినట్టుంది. జగన్ బాటలోకి వచ్చి.. యూత్ కు టికెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఆయన నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే గనుక.. తెలుగుదేశం టికెట్లు పొందిన యూత్ మొత్తం.. జగన్ కు రుణపడి ఉండాలేమో.
వీటిని మంచి మరో విషయం జగన్ రూటును ఫాలో అవడంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రతి యాభై ఇళ్లకు సేవలందించడానికి ఒక వాలంటీరును నియమించింది. వీరు ప్రభుత్వోద్యోగులే తప్ప పార్టీ కార్యకర్తలు కారు. కానీ వీరిపై పార్టీ ముద్ర వేసి చెలరేగుతున్న తెలుగుదేశం అనేక ఆరోపణలు చేస్తుంటుంది. వాలంటీర్లు కేవలం.. తమకు కేటాయించిన యాభై ఇళ్లకు అందే సంక్షేమ పథకాల వివరాలు మాత్రమే పట్టించుకుంటూ ఉంటారు.
కానీ.. ఈ ఏర్పాటు ద్వారా రాజకీయ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న చంద్రబాబునాయుడు.. ప్రతి వంద ఓట్లకు తమ పార్టీ తరఫున ఒక సెక్షన్ ఇన్చార్జిని ఏర్పాటు చేయాలని పిలుపు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఈ మంత్రం బాగా పనిచేస్తుందని ఆయన చెబుతున్నారు.
చూడబోతే.. తన దగ్గర సొంత వ్యూహాల సరుకు పూర్తయిపోయి.. అచ్చంగా జగన్ రూటును ఫాలో అవుతూ జగన్ నే ఓడించాలని చంద్రబాబునాయుడు తపన పడుతున్నట్లుగా కనిపిస్తోంది.