చైనా గోల: రాహుల్‌ ‘అమాయకత్వం’.!

పేరుకే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు.. ఇప్పటికే పలుమార్లు ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన అనుభవం వున్నా, అవగాహన శూన్యం. అసలంటూ ఏ విషయమ్మీదా అవగాహన లేని రాజకీయ ప్రముఖుడు దేశంలో ఎవరన్నా వున్నారంటే,…

పేరుకే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు.. ఇప్పటికే పలుమార్లు ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన అనుభవం వున్నా, అవగాహన శూన్యం. అసలంటూ ఏ విషయమ్మీదా అవగాహన లేని రాజకీయ ప్రముఖుడు దేశంలో ఎవరన్నా వున్నారంటే, బహుశా అది కాంగ్రెస్‌ 'యువరాజు' రాహుల్‌గాంధీయే కావొచ్చు. 

చైనా – భారత్‌ మధ్య చిన్నపాటి గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నమాట వాస్తవం. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది.. తాజాగా సిక్కిం విషయంలో చైనా నుంచి కొంత అలజడి రేగుతోంది. అంతమాత్రానికే, చైనాతో కొంపలు మునిగిపోయే పరిస్థితి మనకెదురైందని రాహుల్‌గాంధీ అనుకోవడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? 

'చైనా విషయంలో మీ వైఖరేంటి.?' అంటూ రాహుల్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించేశారు. దాంతో, అంతా నవ్వుకున్నారు. నెటిజన్లయితే షరామామూలుగానే 'పప్పు' అంటూ రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్తున్నారు. చైనా – భారత్‌ మధ్య చిన్నపాటి గందరగోళమే వుందిప్పుడు. అది యుద్ధంగానో, తగాదాగానో మారే పరిస్థితులే లేవు. 

తాజాగా భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా ప్రధాని జిన్‌ పింగ్‌ ఒకే వేదికపై నేడు కలుసుకున్నారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు పలకరించుకున్నారు. తీవ్రవాదంపై భారత్‌ పోరుని చైనా ప్రధాని జిన్‌ పింగ్‌ అభినందించారు కూడా. సో, కొద్ది రోజుల్లోనే ఈ వివాదం సద్దుమణిగిపోవచ్చు. చైనా, భారత్‌ రెండూ అణ్వస్త్రాలు కలిగివున్న దేశాలే. పైగా, రెండు దేశాల మధ్యా 'వాణిజ్యం' జోరుగా సాగుతోంది. 

1962 నాటి యుద్ధ పరిస్థితుల్ని తెలుసుకోవాలని చైనా, భారత్‌కి సున్నితమైన హెచ్చరిక చేసినా, అప్పట్లా భారత్‌ ఇప్పుడు లేదని భారత్‌ నుంచి చైనాకి కౌంటర్‌ వెళ్ళినా, అవును అంతకు మించిన నష్టం తప్పదని చైనా నుంచి ఇంకాస్త ఘాటుగా హెచ్చరికలు వచ్చినా.. ఇవన్నీ ప్రస్తుతానికి మాటల వరకే పరిమితం. 

రెండు దేశాల మధ్య పరిస్థితులు వేడెక్కుతున్నప్పుడు, మన దేశంలో రాజకీయాలకతీతంగా అందరూ ఒక్కటవ్వాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో మోడీని, రాహుల్‌గాంధీ ప్రశ్నించడమంటే తొందరపడినట్లే అవుతుంది. రేపో మాపో, చైనాతో వ్యవహారం 'కూల్‌' అంటూ కేంద్రం తరఫున ఓ ప్రకటన వస్తే.. అంతా హ్యాపీనే. అదెలాగూ జరగబోతోంది. ఎంపీగా పనిచేస్తోన్న వ్యక్తికి ఈమాత్రం అవగాహన లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?