కులాల కుంపటి రగులుకున్న 'గంగల పర్రు'లో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించారు. నిజానికి కులాల కుంపటి అన్నది రాజకీయ పార్టీలకు చాలా క్లిష్టమైన సమస్య. కరవమంటే కుక్కకు కోపం, విడవమంటే పాముకు కోపం టైపు వ్యవహారం అది.
అందునా అసలే వెస్ట్ గోదావరి జిల్లాలో క్షత్రియ కమ్యూనిటి మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా పని చేసిందని టాక్ వుంది. అలాంటి చోటకు వెళ్లి బాధితులను పరామర్శించడం అంటే కాస్త కష్టమే. అయినా తప్పదు. అందుకే జగన్ చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడినట్లు కనిపిస్తోంది.
‘’నేను రెండు పక్షాలతోను మాట్లాడతా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దాని కోసమే ఈ ప్రయత్నం. ప్రతి కులంలో మంచి, చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికీ ఆపాదించడం సరికాదు.
ఇది అన్నివర్గాలకు వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే… దాన్ని సరిదిద్దుకుందాం. దానివల్ల ఔన్నత్యం పెరుగుతుందే తప్ప తగ్గదు.’’ అని వైఎస్ జగన్ బాధితులతో అన్నట్లు వార్తలు వెలువడ్డాయి.
దీన్ని బట్టి జగన్ చాలా జాగ్రత్తగా మాటలు పేర్చుకుని మాట్లాడినట్లు అర్థం అవుతోంది. అసలే ఇటీవల క్షత్రియులు మెల మెల్లగా మనసు మార్చుకుంటున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఇలాంటి టైమ్ లో జగన్ ఈమాత్రం జాగ్రత్త తీసుకోవడం అవసరమే.