బ్రిటన్ ఎన్నికలలో కన్సర్వేటివ్ (టోరీ) పార్టీయే మళ్లీ గెలిచిందని అందరికీ తెలుసు. అయినా నెగ్గిన తెరీసా మే కంటె విశ్లేషకులు ఎక్కువగా చర్చిస్తున్నది 262 సీట్లు మాత్రమే తెచ్చుకున్న లేబరు పార్టీ లీడరు జెరెమీ కోర్బిన్ గురించి! బ్రెగ్జిట్ సందర్భంగా బేరసారాలు ఆడడానికి 650 సీట్ల పార్లమెంటులో తనకు ప్రస్తుతం వున్న ఐదు సీట్ల ఆధిక్యత చాలదు, మరింత బలం కావాలంటూ కన్సర్వేటివ్ ప్రధాని మే మూడేళ్ల్ల ముందస్తుగా ఎన్నికలు ప్రకటించి జూదమాడింది. కానీ ఆవిడ అది జూదమనుకోలేదు. ప్రజలు తనకు బ్రహ్మాండమైన మెజారిటీ కట్టబెడతారనుకుంది. అయితే లెక్క తన్నేసింది.
గతంలో కంటె ఓట్ల శాతం 5.5% పెరిగినా సీట్లు మాత్రం 13 తగ్గి 317 మాత్రమే తెచ్చుకోగలిగింది. త్రిశంకు సభ తప్పించుకోవడానికి చాలా విషయాల్లో భావైక్యత లేని ఉత్తర ఐర్లండ్‌కు చెందిన పది సీట్ల ఫార్-రైటిస్టు డెమోక్రాటిక్ యూనియనిస్టు పార్టీ (డియుపి)తో పొత్తు పెట్టుకుని సింపుల్ మెజారిటీ కంటె జస్ట్ 1 ఎక్కువ సంపాదించింది. వాళ్లను తృప్తి పరచడానికి నిన్ననే ఐర్లండ్‌కు బిలియన్ పౌండ్ల ఋణసహాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే అనేక పథకాలకు నిధులు చాలకుండా సతమతమవుతున్న బ్రిటన్ ఆర్థికవ్యవస్థకు యిదో భారం. ఈ విధంగా ప్రధాని మే యిమేజి దిగజారగా, అవతల అదే సమయంలో గతంలో కంటె 30 సీట్లు ఎక్కువ తెచ్చుకున్న లేబరు పార్టీ నాయకుడు కోర్బిన్ యిమేజి పెరిగింది.
వామపక్షాలు ఒకప్పటి వామపక్షాలు కాదు. వాటిల్లో ఒకప్పటి సిద్ధాంతబలిమి లేదు. గ్లోబలైజేషన్ కారణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి అనుకుంటూ అవి రైటిస్టు పార్టీలకు నకలుగా మారి, సెంటర్‌కు జరగసాగారు. రైటిస్టులూ మరీ బెట్టుగా లేకుండా మెత్తబడి, సెంటర్‌కు జరగసాగారు. చివరకు యిరుపక్షాలు యించుమించుగా మధ్యేవాదులుగా మారడంతో రైటిస్టులకు, లెఫ్టిస్టులకు గల తేడా ఏమిటో అర్థం కాని ఓటర్లు ఎవరికి వేసినా ఒకటేలే అనే పరిస్థితికి చేరారు. అందువలన వామపక్షాలకు కచ్చితంగా ఓటేసే ఓటు బ్యాంకులు తరిగిపోతున్నాయి.
ప్రపంచమంతా యిదే పరిస్థితి వ్యాపిస్తోంది. మౌలిక వామపక్ష భావాలైన సమసమాజం, అందరికీ అవకాశాలు, అందరితో చర్చించి విభిన్న భావాలను కలుపుకుపోవడం, విపరీత జాతీయ భావాలకు, ప్రాంతీయ భావాలకు లొంగకపోవడం.. యిత్యాది భావాలన్నీ బూజుపట్టినవి అని వామపక్ష నాయకులే అనుకుని వాటిని పక్కకు నెట్టేసి, తాము ముందుండి ప్రజలను నడిపించే బదులు, భావోద్వేగాలకు లోనైన ప్రజలు ఏమంటే దానికి తానతందాన అనసాగారు. పాతకాలపు సిద్ధాంతాలు నమ్ముకున్నవారిని ఛాందసులుగా, చాదస్తులుగా ముద్ర కొట్టారు. పార్టీలో పైకి రానివ్వలేదు.
లేబరు పార్టీలో మొన్నటివరకు కోర్బిన్ పరిస్థితి అదే. ఎందరో నాయకులు ప్రజలను ప్రభుత్వ స్కూళ్లల్లో తమ పిల్లల్ని చేర్పించమని ప్రబోధిస్తూనే తమ పిల్లల్ని కార్పోరేటు స్కూళ్లకు పంపుతారు. బ్రిటన్‌లో ప్రభుత్వమే నడిపే ప్రత్యేక పాఠశాలలు – గ్రామర్ స్కూళ్లు. తన కొడుకుని గ్రామర్ స్కూలుకు కాకుండా మామూలు స్కూలుకు పంపుతానంటే అతని భార్య ఒప్పుకోలేదు. ఆ విషయంపై గొడవ పడి యిద్దరూ విడిపోయారు.
ఆమె అతని రెండో భార్య. విడాకులకైనా సిద్ధపడ్డాడు కానీ సిద్ధాంతాలకు విడాకులు యివ్వడానికి సరేననలేదు. ఇలాటి చాదస్తుణ్ని చూస్తే పార్టీలో లోకువే మరి. 1983 నుంచి అతను ఎంపీగా నెగ్గుతూ వస్తున్నా అతన్ని వెనుక బెంచీల్లోనే కూర్చోబెట్టారు. అతని మొండితనాన్ని వేళాకోళం చేసేవారు. ఇతనూ తక్కువ తినలేదు. సిద్ధాంతాలకు విరుద్ధంగా పార్లమెంటులో ఓటేయమని విప్ జారీ చేస్తే అంతరాత్మ ప్రబోధం అంటూ ధిక్కరించేవాడు. అతని చర్యల్లో నిజాయితీ వుంది కాబట్టి పార్టీ అతనిపై చర్య తీసుకోలేదు.
అతను మరీ పేదకుటుంబం నుంచి వచ్చినవాడు కాదు. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనియర్. తల్లి గ్రామర్ స్కూల్లో మాథ్స్ టీచరు. కానీ సింపుల్‌గా జీవించడం నేర్చుకున్నాడు. శాకాహారి. మద్యం సేవించడనే చెప్పాలి. 68 ఏళ్ల వయసులో కూడా ఆఫీసుకి సైకిలు మీద వస్తాడు. ఎంపీలందరిలో ట్రావెల్ ఎలవన్సు అతి తక్కువగా తీసుకునేవాడు అతనే. అతనికి సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే.
ఓ సారి ఒక ఎంపీ అతనిపై కోపం తెచ్చుకుని నిన్ను చావగొడతాను చూడు అనే అర్థంలో ''స్కూల్లో చదివే రోజుల్లో నాకు బాక్సింగ్‌లో మెడల్స్ వచ్చాయి తెలుసా?'' అని బెదిరిస్తే అదే జరిగితే నేను పోట్లాటకు దిగనులే అని అర్థం వచ్చేట్లు యితను ''అవునా, నాకు పరుగు పందాల్లో వచ్చాయి!'' అని చెప్పి అతన్ని కూడా నవ్వించాడు.
బ్రిటన్‌లో లేబరు పార్టీ ప్రభుత్వం వున్నా, కన్సర్వేటివ్ పార్టీ ప్రభుత్వం వున్నా గత కొన్ని దశాబ్దాలుగా అది అమెరికాకు తోకగా మారిపోయింది. అది యిచ్చే ఆర్థికసాయానికి లోబడిపోయి యూరోప్‌లో, మధ్యప్రాచ్యంలో అమెరికా తన స్వప్రయోజనాలకై చేపట్టిన ప్రతి దుశ్చర్యకు వంత పాడింది. లేబరు పార్టీ సభ్యుడైనా సరే, కోర్బిన్ తన సొంత ఆలోచనలు వ్యక్తం చేస్తూనే వున్నాడు.
ఎవరిమీదనైనా సరే తీవ్రవాద ముద్ర కొట్టి దూరం పెట్టేబదులు, వారితో చర్చించి వారి సమస్యలు కనుక్కుని, పరిష్కారం సాధించడం మంచిదని వాదిస్తూ వచ్చాడు. పాలస్తీనాలో ప్రభుత్వం నడుపుతున్న మితవాద సంస్థ ఫతాకు బ్రిటన్ రాజకీయ నాయకులందరూ మద్దతిస్తూండగా అక్కడి తీవ్రవాద సంస్థ ఐన హమాస్‌యే ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది అని అంటాడు కోర్బిన్. ఎక్కడో పాలస్తీనా మాట పక్కన పెడదాం. ఇంగ్లండుకు వ్యతిరేకంగా దక్షిణ ఐర్లండ్ తీవ్రవాదులు ఐఆర్‌ఏ పేరుతో చాలా దాడులు చేశారు.
1984లో థాచర్ కాబినెట్ సభ్యులు అనేవకమంది సమావేశమైన బ్రైటన్ హోటల్‌పై బాంబులతో దాడి చేశారు. ఇంగ్లండు ప్రజలంతా ఐర్లండు వారిపై ఎంత రగులుతూంటారో వూహించుకోవచ్చు. ఆ సమయంలో కూడా కోర్బిన్ కొన్ని వారాల తర్వాత ఇద్దరు ఐఆర్‌ఏ సభ్యులను, అక్కడి తీవ్రవాద పార్టీ నాయకుణ్ని ఆహ్వానించి ఉపన్యసించమన్నాడు. అదీ అతని ఉదారత్వం. యుద్ధానికి వ్యతిరేకి. ఇలాటి వ్యక్తి తన పార్టీలో వస్తున్న మార్పులను జీర్ణించుకోలేకపోయాడు.
1994 అక్టోబరులో టోనీ బ్లయర్ అప్పుడు ప్రతిపక్షంలో వున్న లేబరు పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యాడు. బ్లాక్‌పూల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో తమ పార్టీ రాజ్యాంగంలో, ఆలోచన విధానాల్లో మార్పు రావాలని ప్రతిపాదించాడు. 1918లో తయారైన పార్టీ రాజ్యాంగంలోని 4 వ క్లాజు 'ఉత్పత్తి సాధనాలపై ప్రజలకే అధికారాలు' (కామన్ ఓనర్‌షిప్) ఉండాలని చెపుతుంది. ''మారుతున్న నేటి సమాజంలో, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఎదగాలని చూస్తున్న యీ రోజుల్లో యిది పనికిరాదు. ఈ సిద్ధాంతాన్ని ప్రజలు అర్థం చేసుకోవటం లేదు. టోరీలు కావాలని పెడర్థాలు తీస్తున్నారు.
ఈ క్లాజు ఎత్తేయాలి. రెండున్నరేళ్ల తర్వాత రాబోయే ఎన్నికలు మనకో అవకాశాన్ని యివ్వబోతున్నాయి. ఈలోగా మనం మారాలి. మారామని ప్రజల్ని నమ్మించాలి. అప్పుడే ప్రభుత్వంలో మార్పు సాధ్యం. మన నినాదం 'కొత్త లేబరు – కొత్త బ్రిటన్' కావాలి.'' అన్నాడు. పార్టీలో చాలామంది కన్విన్స్ కావడంతో తర్వాతి ఏడాది జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆ మార్పులు ఆమోదించారు కూడా.
ఆ సమయంలో కోర్బిన్ బిబిసికి యిచ్చిన యింటర్వ్యూలో ''సమాజంలో పైకి ఎదుగుతూన్న మధ్యతరగతి వాళ్లను దృష్టిలో పెట్టుకుని టోనీ ప్రతిపాదనలు చేశాడు. కానీ సమాజంలో ఆ ఒక్క వర్గమే కాదు, నిరుద్యోగులు, చిరుద్యోగులు, నిరుపేదలు అందరూ వున్నారు. లేబరు పార్టీ తమకోసం ఏం ఆలోచిస్తోందో మనం వాళ్లకు చెప్పగలగాలి. లేకపోతే మనం వాళ్ల మద్దతు పోగొట్టుకుంటాం.'' అని హెచ్చరించాడు.
కానీ పార్టీ టోనీనే నమ్మింది, 1997 మేలో అతని మేనిఫెస్టో ప్రకారమే పోటీ చేసింది. ఆ ఎన్నికలలో నెగ్గడంతో 'తాము 'ఇక్ష్వాకుల కాలం నాటి' సోషలిజాన్ని పట్టుకుని వేళ్లాడడానికి బదులు మధ్యేవాద (సెంట్రిస్టు) రాజకీయాలవైపు పయనించాలని లేబరు పార్టీ నాయకులందరూ గాఢంగా నమ్మసాగారు. కోర్బిన్ ఒంటరివాడయ్యాడు.
అమెరికా సద్దాం హుస్సేన్‌పై పగబట్టి, అతని వద్ద అణ్వాయుధాలని అబద్ధపు ప్రచారం చేసి ఇరాక్‌పై యుద్ధానికి దిగింది. ఇంగ్లండును కూడా కలిసి రమ్మంది. ఇంగ్లండు ప్రజలకి అది యిష్టం లేకపోయినా టోనీ అమెరికా చెప్పినట్లే ఆడాడు. దీన్ని లేబరు పార్టీలోని సోషలిస్టు కాంపెయిన్ గ్రూపు వారు వ్యతిరేకించారు. దాని నాయకులు పార్టీ ఎన్నికలలో టోనీని ఎదిరిస్తూ నిలబడ్డారు, కానీ తగినంతమంది మద్దతుదార్లు కరువై ఓడిపోయారు.
టోనీ 2001, 2005 ఎన్నికలలో కూడా నెగ్గాడు. 2007లో గార్డెన్ బ్రౌన్‌కు అధికారం అప్పగించి దిగిపోయాడు. ఎన్నికలు ఐదేళ్ల కోసారి అనడంతో బ్రౌన్ 2010 వరకు పాలించాడు. టోనీ, బ్రౌన్ విధానాలే పార్టీలో చెల్లుబాటయ్యాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోర్బిన్ తన విధానాలు మార్చుకోలేదు. పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ పార్టీ విప్‌ను ధిక్కరిస్తూ పార్లమెంటులో 1997-2010 మధ్య దాదాపు 400 సార్లు ఓటేశాడు.
చివరకు 2010 ఎన్నికలలో లేబరు పార్టీ ఓడిపోయింది. టోరీ ఐన కామెరాన్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. తర్వాత 2015 ఎన్నికలలో పూర్తి మెజారిటీ సాధించి మళ్లీ ప్రధాని అయ్యాడు. బ్రెగ్జిట్‌పై రిఫరెండం నిర్వహించి ప్రజాభిప్రాయం తన అభిప్రాయానికి విరుద్ధంగా వుందని తెలిసి, తెరీసా మే కు అధికారం అప్పగించి దిగిపోయాడు. 2015 ఎన్నికలలో రెండోసారి వరుసగా ఓటమి కలగడంతో లేబరు పార్టీ పూర్తి నిరాశానిస్పృహల్లో మునిగిపోయింది. అధ్యక్షుడిగా మిల్లిబాండ్ రాజీనామా చేశాడు. అతని స్థానంలో పార్టీకి నాయకత్వం వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గతంలో పార్టీ విధానాలను ప్రతిఘటించిన నాయకులను కదలేశారు. 'ఇంతకుముందు మేం పోటీ చేసి ఓడిపోయాం కదా, వద్దులే' అంటూ వాళ్లు తప్పుకున్నారు. అలాటి విపత్కర పరిస్థితుల్లో కోర్బిన్ పేరు ప్రతిపాదించారు – ఎలాగూ ఓడిపోతాడులే అనుకుంటూ. 35 మంది మాత్రమే అతని పేరు నామినేట్ చేశారు. టోనీ బ్లయర్ మౌనంగా కూర్చోలేదు. 'కోర్బిన్ లాటి పాతకాలపు వామపక్షవాదులను తిరస్కరించండి. ఓటమిలో వున్నాం కదాని యిప్పటి విధానాలను తిరగదోడకండి.' అని పిలుపు నిచ్చాడు. అంతేకాదు, కోర్బిన్‌కి ఓటేసినవాళ్లు గుండెమార్పిడి చికిత్స చేయించుకోవాలి అంటూ వెక్కిరించాడు కూడా.
పార్టీలో అధినాయకత్వం కోర్బిన్‌ని సీరియస్‌గా తీసుకోకపోయినా, చిత్రంగా యువనాయకులు అతన్ని నమ్మారు. ట్రేడ్ యూనియన్లు అతనికి అండగా నిలిచాయి. కోర్బిన్ పార్టీ నాయకుడయ్యాడు. ఇది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ''ద ఎకనమిస్ట్'' పత్రిక తన 2015 సెప్టెంబరు సంచికలో ''బ్యాక్‌వర్డ్స్, కామ్రేడ్స్'' (ఇది వెనకడుగు సుమా) అని లేబరు పార్టీ సభ్యులను హెచ్చరించింది.
బ్రిటన్ వామపక్షీయులను కోర్బిన్ కాలగర్భానికి తీసుకెళ్లి పూడ్చిపెడతాడని జోస్యం చెప్పింది. ఆ పత్రిక ఒక్కటే కాదు, యావత్తు మీడియా కోర్బిన్‌పై కక్ష కట్టేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం 2015 సెప్టెంబరు 1 నుంచి నవంబరు 1 వరకు వచ్చిన మీడియా రిపోర్టులన్నీ అతనిపై విషం కక్కాయి. అతని మీదనే కాదు, అతని సమర్థకులపై కూడా విరుచుకుపడ్డాయి. టాబ్లాయిడ్‌లలో అయితే అతన్ని వెక్కిరించని రోజు లేదు. చివరకు మీడియా ధోరణి ఎంతవరకు వెళ్లిందంటే అతనికి టెర్రరిజంతో, బ్రిటన్ శత్రువులతో లింకు పెట్టారు. 'దీని కారణంగా ప్రజలకు అతని గురించి స్పష్టమైన అవగాహన కలగలేదు. ప్రెస్ వాచ్ డాగ్ (కావలి కుక్క) గా వ్యవహరించలేదు, ఎటాక్ డాగ్ (దాడి చేసే కుక్క)గా ప్రవర్తించింది' అంది ఆ అధ్యయనం.
ఈ ప్రచారం ప్రభావం లేబరు పార్టీ నాయకులపై కూడా పడింది. గతంలో కోర్బిన్‌ని సమర్థించినవారు సైతం విమర్శించసాగారు. లేబరు పార్టీ బ్రెగ్జిట్‌కు వ్యతిరేకం. టోరీ పార్టీలో కొందరు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకం కాబట్టి వారితో చేతులు కలిపి పనిచేయాలని కొందరు లేబరు పార్టీ నాయకులు భావించారు. కానీ ఏ అంశంలోనూ టోరీలతో వేదిక పంచుకోనని భీష్మించడంతో కోర్బిన్‌పై వీరికి చికాకేసింది. రిచర్డ్ మర్ఫీ అనే మాజీ కోర్బిన్ సమర్థకుడు 'ఈ కోర్బినామిక్స్ పతనావస్థకు వచ్చింది. కోర్బిన్‌్, అతని టీము కలిసి ప్రపంచాన్ని ద్వేషించడం నేర్పుతున్నారు తప్ప పరిష్కారమార్గాలు చూపించలేక పోతున్నారు.' అని వ్యాసం రాశాడు.
సీమా మల్‌హోత్రా అనే లేబరు ఎంపీ 'దేశానికి బలమైన నాయకత్వం కావాలి తప్ప కోర్బిన్ కాదు' అంటూ అతను ఏర్పరచిన షాడో కాబినెట్‌లోంచి తప్పుకుంది. ఈ మార్చిలో స్కాటిష్ నేషనల్ పార్టీ లీడరు నికోలా స్టర్జియాన్ 'లేబరు పార్టీ వైఫల్యం వలన టోరీ ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగే దురవస్థ వచ్చిపడింది' అంది. (గతంలో 56 సీట్లున్న యీవిడ పార్టీకి యీ సారి 35 మాత్రమే వచ్చాయి) ఏప్రిల్‌లో లిబరల్ డెమోక్రాటిక్ లీడరు టిమ్ ఫెరాన్ 'బ్రిటన్ రాజకీయ చరిత్రలోనే అత్యంత చెత్త నాయకుడు కోర్బిన్' అన్నాడు. (ఇతనికి గతంలో కంటె 4 సీట్లు పెరిగి 12 వచ్చినా ఓట్ల శాతం 0.5% తగ్గింది)
ఇవన్నీ చూసి కాబోలు బ్రిటన్ ప్రధాని తెరీసా మేకు అమిత ధైర్యం వచ్చేసింది. కోర్బిన్ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షం చచ్చుబడి వుంది కాబట్టి తన మెజారిటీ పెంచుకోవడానికి యిదే అదను అనుకుంది. నేను మార్గరెట్ థాచర్‌కు మించిన ఐరన్ లేడీని. బ్రెగ్జిట్ బేరసారాల్లో నా తడాఖా చూపిస్తా అనే యిమేజితో మూడేళ్ల ముందుగా ముందస్తు ఎన్నికల ెళితే మెజారిటీ యింకా పెరుగుతుంది అనుకుంది. జూన్ 8 న ఎన్నికలు అని ఏప్రిల్ 18 న ప్రకటించేసింది. కోర్బిన్‌పై ఎవరికీ ఆశలు లేవు కాబట్టి, ఆమె గెలుపు ఖాయమనీ, లేబరుకు ఘోరపరాజయం తప్పదనీ అందరూ నమ్మారు.
ఒపీనియన్ పోల్స్‌లో టోరీలకు 20 పాయింట్ల ఆధిక్యత వుంది. అయితే ఎన్నికల ప్రచారం సాగుతున్న కొద్దీ పరిస్థితిలో మార్పు వచ్చింది. తన ప్రత్యర్థులు ఏమంటున్నా పట్టించుకోకుండా కోర్బిన్ ప్రజల్లోకి వెళ్లాడు. సాధారణంగా ఎన్నికల సమయంలో ట్రేడ్ యూనియన్ లీడర్లతో సమావేశాలు జరిపి మూసిన తలుపుల వెనుక నాయకులతో ఒప్పందాలు చేసుకుని ఎన్నికల వ్యూహాలు రచిస్తారు. కానీ యితను సరాసరి జనంలోకి వెళ్లి తన ఆలోచనలు చెప్పాడు. వాళ్లు అతని మాటలు విన్నారు.
ఈ గ్లోబలైజేషన్‌తో వచ్చిన మార్పుకు ప్రజలంతా హర్షిస్తున్నారని, చాలా సుఖంగా వున్నారనీ మార్కెట్ మాయాజాలం, మీడియా మనల్ని నమ్మిస్తోంది తప్ప సాధారణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందలేదు. కొందరు మధ్యతరగతివాళ్లు బాగుపడ్డారు తప్ప పేదలు అల్లాడుతున్నారు. పొదుపు చర్యల పేరుతో తెరీసా విద్య, వైద్యరంగాలలో విధించిన కోతల వలన వారు బాధలు పడుతున్నారు. బ్రెగ్జిట్ తర్వాత ఉద్యోగాలు మరిన్ని తగ్గి నిరుద్యోగం మరీ తీవ్రమౌతుందన్న భయంతో వున్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన నాయకుడు కోర్బిన్ ఒక్కడే. అతను పార్లమెంటులో ప్రశ్నలు వేయడానికి ముందు తనకు ప్రశ్నలు పంపమని ప్రజల్ని కోరేవాడు. వాళ్లు పంపిన వాటిని ప్రధానికి సంధించేవాడు. అందువలన అతను తమలో ఒకడు అని ప్రజలు ఫీలయ్యారు, అతని మాటలకు స్పందించారు. ముఖ్యంగా యువత అతని వెంట పరుగులు తీసింది. మీడియా తనకు వ్యతిరేకంగా వుంది కాబట్టి కోర్బిన్ సోషల్ మీడియాను నమ్ముకున్నాడు. యువతను యింకా బాగా చేరాడు.
ఎన్నికల వాగ్దానాలు చేసినప్పుడు కూడా కోర్బిన్ అన్ని వర్గాలనూ మెప్పించాలని ప్రయత్నించలేదు. తమ పార్టీ మానిఫెస్టోలో 4 వ సెక్షన్ మళ్లీ పెడతానన్నాడు. కార్పోరేషన్లకు, ఏటా 80 వేల పౌండ్ల కంటె ఎక్కువ వేతనం వచ్చేవారికీ పన్నులు పెంచుతానన్నాడు. విద్య, వైద్య రంగాలకు తగ్గుతూ వస్తున్న నిధుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసు బజెట్ తగ్గించడం అనర్థం అన్నాడు.
ఆ మాటలు నిజమనిపించేట్లు ఎన్నికలకు సిద్ధమవుతూండగానే మూడు టెర్రరిస్టు దాడులు జరిగాయి. మాంచెస్టరులో దాడి జరిగాక కోర్బిన్ 'ఇతర దేశాల వ్యవహారాల్లో మనం కలగజేసుకునే విధానంలో మార్పు రావాలి' అంటూ ప్రకటించాడు. ఎన్నికలలో ఓటింగు శాతం 2% పెరిగి, 68.7%కి చేరింది. చివరకు ఫలితాలు చూసి అందరూ విస్తుపోయారు.
లేబరు పార్టీ ఓటు శాతం ఒక్కసారిగా 9.5% పెరిగింది. 1945లో రెండవ ప్రపంచయుద్ధానంతరం 10.4% పెరిగింది. ఆ తర్వాత యీ స్థాయిలో పెరిగినది యిప్పుడే. దశాబ్దాలుగా టోరీలు గెలుస్తూ వచ్చిన నియోజకవర్గాల్లో లేబరు గెలిచింది. బ్రెగ్జిట్‌కై ఓటేసిన స్థానాల్లో కూడా గెలిచింది. లండన్‌లో అత్యంత సంపన్నులు నివసించే కెన్సింగ్‌టన్ నియోజకవర్గంలో కూడా లేబరు అభ్యర్థే గెలిచారు. లండన్‌లో మొత్తం ఆరు సీట్లు టోరీలు కోల్పోయారు. 2015లో 12.9% ఓట్లు తెచ్చుకున్న యుకె ఇండిపెండెన్స్ పార్టీ యీసారి పూర్తిగా కుప్పకూలింది.
వాళ్ల ఓట్లన్నీ టోరీలకే వచ్చాయనుకున్నారు కానీ కొన్ని ఓట్లు లేబరుకి కూడా వెళ్లాయని పరిశీలకుల అంచనా. మొత్తం మీద చూస్తే లేబరుకి టోరీల కంటె 2.3% ఓట్లు తక్కువే వచ్చాయి. (కానీ యీ 40% కూడా 2001 నుంచి చూస్తే అత్యధికం) సీట్ల విషయంలో 52 తక్కువ వచ్చాయి. అయినా కోర్బిన్ 'నవ్విన నాప చేనే పండింది' అనే సామెత నిజం చేశాడు. నాప చేను సామెత మాట ఎలా వున్నా, ప్రజల నాడిని పట్టుకున్నవాడికి, ప్రజలతో మమేకం అయినవాడికి, పరిస్థితులతో రాజీ పడకుండా సిద్ధాంతాన్ని నమ్ముకున్న 'ఛాందసుడి'కి కూడా ఆలస్యంగానైనా మంచి రోజులు వస్తాయని మరొక్కసారి రుజువైంది.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]