కలియుగ ప్రత్యక్ష దైవం.. తిరుమల తిరుపతి.. శ్రీ వేంకటేశ్వరస్వామి పేరు చెప్పగానే, ముందుగా భక్తులకు గుర్తుకొచ్చేది 'లడ్డూ' ప్రసాదమే. ఒకప్పుడు ఈ ప్రసాదానికి వున్న క్రేజ్ వేరు. కానీ, ఇప్పుడు లడ్డూ ప్రసాదం పరిస్థితి వేరు. ఎప్పటికప్పుడు 'లడ్డూ' ప్రసాదంపై వివాదాలు పుట్టుకొస్తున్నాయి. లడ్డూలో జెర్రి, లడ్డూలో బొద్దింక, లడ్డూలో ఇనుప వస్తువులు.. ఇదీ శ్రీవారి ప్రసాదం లడ్డూ పరిస్థితి. ఎందుకిలా.?
ఇప్పుడీ లడ్డూ కారణంగా వెంకటేశ్వరస్వామి భక్తులు ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తుల కోసం 'దివ్యదర్శనం' కాన్సెప్ట్ అమల్లో వుంది కొంతకాలంగా. దాన్ని ఇకపై రద్దు చేయబోతున్నారు. ముందస్తుగా 'రద్దీరోజుల్లో' అంటున్నారుగానీ, ముందు ముందు దివ్యదర్శనం అనే మాట వుండకపోవచ్చు. దీనిక్కారణం, దివ్యదర్శనం పేరుతో వచ్చే భక్తులకు రెండు లడ్డూలను ఉచితంగా అందిస్తుండడం.. అది కాస్తా టీటీడీకి 'నష్టాల్ని' తెచ్చిపెడ్తుండడం.
ఇంతకీ, కలియుగ ప్రత్యక్ష దైవానికి సంబంధించిన లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు ఈ 'నష్టం' అన్న ప్రస్తావన ఎందుకు వస్తోంది.? ఎందుకంటే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భక్తిని ఎప్పుడో వ్యాపారంగా మార్చేసింది గనుక. వ్యాపారం అన్నాక, లాభ నష్టాల బేరీజు వేసుకోకపోతే ఎలా.? శ్రీవారి హుండీలో ప్రతిరోజూ 2కోట్లకు తక్కువ కాకుండా భక్తులు 'కానుకల్ని' సమర్పించుకుంటున్నారు. రోజుకి రెండు కోట్లు అంటే మాటలా.? అయినాసరే, టీటీడీ పాలక మండలి దృష్టిలో ఈ డబ్బులు సరిపోవు. ఎందుకంటే, కొండమీద భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి మరి.!
సౌకర్యాలంటే ఏంటో తెలుసా.? ఉచిత దర్శనం సంగతి పక్కన పెడితే, శీఘ్రదర్శనం పేరుతో భక్తులకు సులువైన దర్శన భాగ్యం కల్పించడమన్నమాట. దీనికోసం 300 రూపాయల పైబడి టిక్కెట్టు. ఇదేమన్నా సినిమానా.? టిక్కెట్టు కొనుక్కుని వెళ్ళడానికి.! 'దారుణం' అన్నది చాలా చిన్న మాట ఇక్కడ. క్యూ లైన్లలో భక్తుల వెతల్ని చూస్తోంటే, కడుపు తరుక్కుపోతుంది ఎవరికైనాసరే. కానీ తప్పదు, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు ఈ మాత్రం ఇబ్బందులు చిన్నవేనని భక్తులు అనుకోవచ్చుగాక.. కానీ అధికారులు, భక్తుల్ని పశువులకన్నా హీనంగా చూస్తోంటే, హిందూ ధర్మం ఏమైపోతుందోనన్న ఆందోళన వ్యక్తమవడం సహజమే.
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడే కాదు.. ఏ ప్రముఖ హిందూ దేవాలయానికైనా వెళ్ళండి.. అక్కడ భక్తి ఛార్జీలు తప్పవు. ఇతర మతాల్లో లేని దుస్థితి, హిందూ మతంలోనే ఎందుకట.? పైగా, హిందూ దేవాలయాల నుంచి ప్రభుత్వాలకి పెద్దయెత్తున నిధులు సమకూరుతుంటాయి. అందుకేనేమో, హిందూ ధర్మాన్ని వ్యాపారంగా మార్చేశాయి ప్రభుత్వాలు. ఇది కలియుగం.. తప్పదంతే.!