ఇటు బేబి, అటు బ్రో.. జులై బాక్సాఫీస్ పరిస్థితేంటి?

జూన్ నెలలో భారీ అంచనాలతో వచ్చిన ఓ పెద్ద సినిమా ఫ్లాప్ అవ్వగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా సూపర్ హిట్టయింది. ఆశ్చర్యంగా జులైలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.…

జూన్ నెలలో భారీ అంచనాలతో వచ్చిన ఓ పెద్ద సినిమా ఫ్లాప్ అవ్వగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ఓ చిన్న సినిమా సూపర్ హిట్టయింది. ఆశ్చర్యంగా జులైలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన బ్రో సినిమా, అంచనాల్ని అందుకోలేకపోయింది. అదే టైమ్ లో ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన బేబి సినిమా కుర్రకారు అండతో క్లిక్ అయింది. 

జులై మొదటి వారంలో.. అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో అంచనాలతో వచ్చిన సినిమా ఒకే ఒక్కటి. అదే నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి. ప్రమోషన్స్ తో పిచ్చెక్కించిన ఈ సినిమా థియేటర్లలో చతికిలపడింది. ఫస్టాఫ్ లో హిలేరియస్ గా కామెడీ పండించి, సెకండాఫ్ లో వినోదాన్ని పూర్తిగా పక్కనపెట్టడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఈ విషయాన్ని నాగశౌర్య కూడా అంగీకరించాడు.

ఇక ఈ సినిమాతో పాటు వచ్చిన సర్కిల్, ఓ సాథియా, రుద్రంగి, గ్యాంగ్ లీడర్, 7:11PM సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. లాంగ్ గ్యాప్ తర్వాత సర్కిల్ సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చిన దర్శకుడు నీలకంఠ, తను ఆశించిన రిజల్ట్ పొందలేకపోయారు. మరోవైపు రుద్రంగి, 7:11PM సినిమాలకు భారీగా ప్రచారం చేసినప్పటికీ రేసులో నిలబడలేకపోయాయి.

రెండో వారంలో.. బేబి సినిమా మెరిసింది. సాయిరాజేష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో లోపాలున్నప్పటికీ, ఇందులో పెట్టిన డైలాగులు, కొన్ని సీన్లు యూత్ కు కనెక్ట్ అయ్యేలా చేశాయి.  పూర్తిగా యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. నిర్మాత ఎస్కేఎన్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అటు ఆనంద్ దేవరకొండకు తొలి థియేట్రికల్ విజయాన్ని అందించింది.

బేబి సినిమాతో పాటు ఓ మోస్తరు అంచనాలతో వచ్చింది నాయకుడు సినిమా. వడివేలు, ఉదయనిధి చేసిన ఈ డబ్బింగ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇదే వారంలో శివకార్తికేయన్ హీరోగా మహావీరుడు సినిమా వచ్చింది. ఈ మూవీతో పాటు రివెంజ్, భారతీయన్స్ అనే సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.

మూడో వారంలో.. థియేటర్లలో మూవీ ఫెస్టివల్ నడిచింది. ఏకంగా 9 సినిమాలు వచ్చాయి. వీటిలో ఆకట్టుకున్న సినిమా ఒక్కటి కూడా లేదు. వీటిలో హిడింబ అనే సినిమాకు గట్టిగా ప్రచారం చేశారు. అశ్విన్ బాబు, నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆకట్టుకోలేదు. మంచి పాయింట్ పట్టుకున్నప్పటికీ.. లాజిక్స్ లేకపోవడం, టెన్షన్ పెట్టే స్క్రీన్ ప్లే చేసుకోలేకపోవడంతో ఈ మూవీ ఫెయిలైంది.

ఇదే వారం విజయ్ ఆంటోనీ నటించిన హత్య, రుహానీ శర్మ చేసిన HER, చైతన్యరావు హీరోగా వచ్చిన అన్నపూర్ణ ఫొటోస్టుడియో, డిటెక్టివ్ కార్తీక్ లాంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మూడో వారంలో ఇన్ని సినిమాలు రావడానికి కారణం బ్రో.

పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా జులై చివర్లో థియేటర్లలోకి వచ్చింది. తమిళ్ లో వచ్చిన వినోదాయ శితం సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ అంచనాల్ని అందుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా ఒరిజినల్ మూవీ చూసిన ప్రేక్షకుల్ని బ్రో మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. ఓ మంచి పాయింట్ ను రీమేక్ గా మలిచే క్రమంలో పవన్ ఫ్యాన్స్ కోసం అతడి పాత సినిమాల పాటల్ని, ఇక పవన్ కోసం కాస్త పొలిటికల్ టచ్ ను యాడ్ చేశారు. ఓ వైసీపీ నేతను కించపరిచేందుకు, సినిమాతో సంబంధం లేకపోయినా అనవసరంగా సీన్లు పెట్టారు. దీనికితోడు తమన్ అందించిన పాటలు ఆకట్టుకోలేదు. వీటిన్నింటి మూలంగా బ్రో సినిమా క్లిక్ అవ్వలేకపోయింది.

బ్రో సినిమాతో పాటు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు నటించిన స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే సినిమా వచ్చింది. ఇది కూడా ఫెయిలైంది. ఓవరాల్ గా జులై నెలలో అటుఇటుగా 23 సినిమాలు రిలీజ్ అవ్వగా.. బేబి ఒక్కటే లాభాలు చూసింది. రెవెన్యూ పరంగా బ్రో సినిమా రేంజ్ ఏంటనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.